breaking news
to be release
-
త్వరలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీని 31 జిల్లాల ప్రకారమే చేపట్టే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన ములుగు, నారాయణ్‌పేట్ కలుపుకొని 33 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో 31 జిల్లాల ప్రకారమే ముందుకు సాగాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ) భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు సమాచారం. దీంతో గురుకులాల్లోని 2,500 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. మొత్తం 5 శాఖలకు చెందిన గురుకులాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులకు సంబంధించిన వివరాలను ఆయా గురుకులాల సొసైటీల కార్యదర్శులు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 1,900 పోస్టులు బీసీ గురుకులాలకు చెందినవి కాగా, మరో 600 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. 1,900 పోస్టులు బీసీ గురుకులాల్లోనే.. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ గురుకులాలు 261 ఉండగా, అందు లో 119 గురుకులాలు ఈ ఏడాదే ప్రారంభం అయ్యాయి. వాటిల్లోనే 1,900 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 1,071 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), 119 స్టాఫ్‌నర్స్, 119 లైబ్రేరియన్స్, 119 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు, 110 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే పీజీటీ హిందీ–100, ఫిజికల్ డైరెక్టర్స్–70 పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా మరో 192 పోస్టులను మిగతా బీసీ గురుకులాల్లో భర్తీ చేయనున్నారు. ఇతర సంక్షేమ శాఖలకు చెందిన గురుకులాల్లో మరో 600 వరకు బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆయా పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డు సీఎస్‌కు లేఖ రాసింది. -
రేపు మధ్యాహ్నం సీబీఎస్ఈ ఫలితాల విడుదల
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. 21 వ తేదీ మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించనున్నట్టు సీబీఎస్ఈ శుక్రవారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 10.67 లక్షల మంది విద్యార్థులు (ప్లస్ 2) ఈ పరీక్షలకు హాజరయ్యారు. గత మార్చి 1 వ తేదీ నుంచి ఏప్రిల్ 22 వరకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జేఈఈతో పాటు ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లకు హాజరైన విద్యార్థులు సీబీఎస్ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్టు ముందుగా సంకేతాలు ఇచ్చారు. ఆ ఉత్కంఠకు తెరదించుతూ 21 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. ఫలితాలను www.cbseresults.nic.in లో చూసుకోవచ్చు.