breaking news
BCCI advisory committee
-
ఆ కమిటీ ఎక్కడ?
సరిగ్గా ఆరు నెలల క్రితం... భారత క్రికెట్లో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. ఆట అభివృద్ధి, జట్టు విజయాల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ల రూపంలో ముగ్గురు దిగ్గజాలతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ కేవలం ఒక్కసారి మాత్రమే సమావేశమైంది. ఆ తర్వాత ఈ కమిటీ గురించి ఎక్కడా వార్త లేదు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన కొత్త కమిటీల్లో అసలు ఈ కమిటీ పేరు కూడా లేకపోవడం గమనార్హం. * కనిపించని బీసీసీఐ సలహా కమిటీ * తాజా జాబితాల్లోనూ లేని త్రిమూర్తుల పేర్లు సాక్షి క్రీడావిభాగం: ‘స్వదేశంలో భారత జట్టు బాగాఆడుతున్నా... విదేశాల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం జట్టులో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉన్నందున వారికి దిశానిర్దేశం చేయడానికి అనుభవజ్ఞులు అవసరం...’ సరిగ్గా ఇవే మాటలతో బీసీసీఐ త్రిసభ్య సలహా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి బోర్డు అధ్యక్షుడు, దివంగత జగ్మోహన్ దాల్మియా, కార్యదర్శి ఠాకూర్ కలిసి చర్చించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. జూన్ 1న ఈ కమిటీ ఏర్పాటును ప్రకటించిన తర్వాత అదే నెల ఆరో తేదీన కోల్‌కతాలో సచిన్, లక్ష్మణ్, గంగూలీ సమావేశమయ్యారు. అంతే... ఆ తర్వాత ఈ ముగ్గురూ కలిసి కూర్చున్నది లేదు. దాల్మియా మరణానంతరం గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికవడం, లక్ష్మణ్ కామెంటరీతో బిజీగా మారడం, సచిన్ రకరకాల వ్యాపకాలతో ప్రపంచాన్ని చుట్టేస్తుండటంతో ఈ ముగ్గురూ కలవలేదు. ఈ లోగా బీసీసీఐలోనూ రకరకాల పరిణామాలు జరిగాయి. కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పగ్గాలు అందుకోగానే అన్ని కమిటీలను ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కమిటీల్లో మెంబర్ల సంఖ్యను తగ్గించి మార్పు చేర్పులతో కొత్త కమిటీలను ప్రకటించి వీటిని బీసీసీఐ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో త్రిమూర్తులతో కూడిన క్రికెట్ సలహా కమిటీ ఊసే లేదు. వారికైనా తెలుసా? అసలు ప్రస్తుతం ఈ కమిటీ ఉందా? లేదా? ఒకవేళ ఉంటే బీసీసీఐ జాబితాలో ఎందుకు చూపించలేదు..? లేకపోతే ఆ విషయం సచిన్, లక్ష్మణ్, గంగూలీలకు తెలిపారా? ఈ ప్రశ్నలకు ఎక్కడా సమాధానం లేదు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం బీసీసీఐ అధికారుల్లో చాలామందికి అసలు ఈ కమిటీ గురించే తెలియదు. ‘ఈ కమిటీ ఉందని నేను అనుకోవడం లేదు’ అని బోర్డు అధికారి ఒకరు అన్నారు. మరోవైపు క్రికెటర్లు దీని గురించి బాహాటంగా ఏమీ చెప్పకపోయినా... వారి సన్నిహితులు మాత్రం ‘ఈ కమిటీ ఉందో లేదో క్రికెటర్లకు తెలియదు’ అని చెబుతున్నారు. అంటే బోర్డు నుంచి వీరికి ఎలాంటి సమాచారం లేదనేది స్పష్టం. ఎందుకు ఏర్పాటు చేశారంటే... జూన్ ఆరో తేదీన ఈ కమిటీ సమావేశమైనప్పుడు కార్యాచరణ గురించి మాట్లాడారు. విదేశాల్లో భారత జట్టు ప్రదర్శన మెరుగుపడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంతర్జాతీయ క్రికెట్లో షెడ్యూల్ బిజీగా మారినందున... మూడు ఫార్మాట్లను సీనియర్లు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దేశంలో మౌళిక సదుపాయాల పెంపునకు ఏం చర్యలు తీసుకోవాలి..? దేశంలో జూనియర్ క్రికెట్ స్థాయిలోనే నాణ్యతను ఎలా పెంచాలి?... ఇలా కొన్ని అంశాలపై ఈ ముగ్గురూ బీసీసీఐకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉండాలి. అయితే ఆ తర్వాత బోర్డు వీరికి ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. షెడ్యూల్ ప్రకారం జూలై నెలాఖరులో వీరు సమావేశం కావలసి ఉన్నా బోర్డు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ద్రవిడ్‌కు ముందే తెలుసేమో..! బీసీసీఐ ఏర్పాటు చేసే కమిటీలు, బీసీసీఐ వ్యవహారశైలి గురించి అందరిలోకీ ద్రవిడ్‌కే ఎక్కువ ఆలోచన ఉండి ఉంటుంది. అందుకే ఆనాడు నలుగురు క్రికెటర్లతో కమిటీని ఏర్పాటు చేస్తామంటే తను తిరస్కరించాడు. కమిటీల పట్ల తనకు ఆసక్తి లేదని, జూనియర్ జట్లకు కోచ్‌గా పని చేస్తాననే ప్రతిపాదనతో వచ్చాడు. కాబట్టి తను ఇప్పటికీ తన బాధ్యతలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అండర్-19 జట్టుకు కోచ్‌గా శ్రీలంకలో ఉన్నాడు. నిజానికి బోర్డు ఈ కమిటీని నిర్లక్ష్యం చేయడం ఈ దిగ్గజాలను అవమానించడమే. ఇప్పటికైనా బీసీసీఐ మేలుకొని ఈ కమిటీ విషయంలో ఓ నిర్దిష్ట ప్రకటన చేస్తే మంచిది. -
బోర్డు సలహాదారులుగా సచిన్, గంగూలీ, లక్ష్మణ్
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్తగా క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లను సభ్యులుగా నియమించారు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా వీరిని నియమించినట్టు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. వీరి నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. సలహాదారులుగా పనిచేసేందుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత్ క్రికెట్ పురోగతి, భవిష్యత్ సవాళ్లకు సంబంధించి దిగ్గజ త్రయం.. బోర్డు, జట్టుకు తగిన సలహాలు అందిస్తారు. స్వదేశంలోనూ, విదేశీ గడ్డపైనా జరిగే సిరీస్‌లకు భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేయడానికి మార్గనిర్దేశం చేయనున్నారు. దేశవాళీ క్రికెట్ పురోభివృద్దికి చర్యలు తీసుకోనున్నారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో భారత్ జట్టు అత్యున్నత స్థాయికి చేరుతుందని బీసీసీఐ చీఫ్ దాల్మియా విశ్వాసం వ్యక్తం చేశారు.