breaking news
bc study circle center
-
వడివడిగా ‘స్టడీ’...నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువత కొలువుల జాతరలో మునిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులు అకుంఠిత దీక్షతో సంసిద్ధులవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు గ్రూప్–1, పోలీసు ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేయడంతో తమకు ఆసక్తి ఉన్న ఉద్యోగాలను దక్కించుకునేందుకు అవసరమైన శిక్షణ కోసం యువత నడుం బిగించింది. ఈ క్రమంలోనే సంక్షేమ శాఖల పరిధిలోని స్టడీ సర్కిళ్లు కూడా యువతకు శిక్షణ ఇస్తున్నాయి. ఆయా స్టడీ సర్కిళ్లు వ్యూహాత్మక శిక్షణ ఇస్తుండటంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ సెంటర్ల బాట పడుతున్నారు. దీంతో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో లక్ష మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ అమలు చేయడంలో సంక్షేమ శాఖలు నిమగ్నమయ్యాయి. వంద స్టడీ సెంటర్లు... లక్ష మంది అభ్యర్థులు నాలుగు సంక్షేమ శాఖలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయగా.. బీసీ సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న పది స్టడీ సర్కిళ్లతో పాటు మరో రెండు చోట్ల స్టడీ సర్కిళ్లను అందుబాటులోకి తెచ్చింది. మైనార్టీ సంక్షేమ శాఖ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో తాత్కాలిక స్టడీ సెంటర్లను తెరిచింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో ప్రస్తుతం పదివేల మంది అభ్యర్థులతో సంక్షేమ శాఖలు వంద స్టడీ సెంటర్లను నిర్వహిస్తుండగా... అతి త్వరలో మరో రెండు బ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించాయి. దీంతో పాటు ఆన్లైన్ కోచింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. మొత్తం మీద లక్ష మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. నిపుణులతో శిక్షణ తరగతులు: ప్రభుత్వ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఇచ్చే శిక్షణ.. ఏదో నామమాత్రపు, మొక్కుబడి శిక్షణ కాకుండా, నాణ్య తతో కూడిన శిక్షణ అందించాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఆయా అంశా లు, సబ్జెక్టుల్లో నిపుణులైన వారిని నియమించేందుకు సంక్షేమ శాఖలు పోటీ పడ్డాయి. అత్యుత్తమ రేటింగ్ ఉన్న ప్రైవేటు కోచింగ్ సెంటర్లలోని నిపుణులను మంచి ప్యాకేజీలతో ఎంగేజ్ చేసుకున్నాయి. నిపుణుల ఎంపికకు హైదరాబాద్, నగర శివారు జిల్లాల్లో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో కాస్త కష్టంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కొందరిని ప్రత్యేకంగా ఎంపిక చేసి గ్రామీణ జిల్లాలకు పంపించేందుకు సంక్షేమాధికారులు విశేషంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీ నుంచే గ్రూప్–1, పోలీసు ఉద్యోగాలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు అనూహ్య స్పందన వస్తోంది. తొలివిడతకు ఏకంగా 34 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో వడపోత అనంతరం 10 వేల మందితో ఒక బ్యాచ్‌ను ప్రారంభించారు. మరో రెండు బ్యాచ్‌లను అతి త్వరలో ప్రారంభించేందుకు స్టడీ సర్కిల్ డైరెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. త్వరలో గ్రూప్–4 నోటిఫికేషన్ సైతం వెలువడే అవకాశం ఉండడంతో ఆ మేరకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు స్టడీ సెంటర్ల నిర్వహణకు గిరిజన సంక్షేమ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సెంటర్లను నడిపిస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించగా.. పర్యవేక్షణ కోసం గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ నుంచి ప్రత్యేకాధికారులు నియమితులయ్యారు. శిక్షణ తరగతులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడంతో పాటు అంతర్గత పరీక్షల నిర్వహణ, ఫలితాల విశ్లేషణ తదితర అంశాలను సైతం పర్యవేక్షిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి సముజ్వల తెలిపారు. అందుబాటులో వీడియో పాఠాలు బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లలో ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని అభ్యర్థుల కోసం వీడియో పాఠాలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. నిపుణ చానల్‌తో పాటు టీశాట్ ద్వారా వీడియో పాఠాలను వీక్షించే వెసులుబాటును కల్పించారు. రెండ్రోజుల క్రితం ఈ తరగతులను ప్రారంభించారు. వారంలోగా వీక్షకుల సంఖ్య 50 వేలకు చేరుతుందని భావిస్తున్నామని, గ్రూప్–4 నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మరికొన్ని బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ చెప్పారు. -
బీసీ స్టడీసర్కిల్‌కు మోక్షమెప్పుడో..?
భవన నిర్మాణానికిరాని మంజూరు నాలుగు జిల్లాల్లో గ్రీన్‌సిగ్నల్ కరీంనగర్‌కు దక్కని చోటు నిధులుండీ నిర్మాణం చేపట్టని సర్కారు కరీంనగర్ సిటీ : బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి ఇప్పట్లో మోక్షం కలిగేలా పరిస్థితులు కల్పించడంలేదు. నిధులు విడుదలై శంకుస్థాపన చేసుకున్నా పనులు, మంజూరుకు మాత్రం నోచుకోవడంలేదు. తాజాగా నాలుగు జిల్లాల్లో బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. అందులో కరీంనగర్‌ను విస్మరించడం అనుమానాలకు తావిస్తోంది. కేవలం రాజకీయ కోణంలోనే కరీంనగర్‌కు చోటు లభించలేదనే విమర్శలొస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే అందులో కరీంనగర్ గురించి ప్రస్తావన లేకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.3.65 కోట్లతో నిజామాబాద్‌లో, రూ.8.70 కోట్లతో హైదరాబాద్, రూ.3.75 కోట్లతో ఆదిలాబాద్, రూ.3.70 కోట్లతో సంగారెడ్డి (మెదక్)లో బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణాలకు మెమో నెం.టీ4/24/2017–17, తేదీ 11.08.2016 ద్వారా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 2013లో శంకుస్థాపన చేసుకుని మంజూరుకు ఎదురుచూస్తున్న కరీంనగర్ బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. మూడేళ్లయినా కలగని మోక్షం.. 2009 ఆగస్టు 3న జిల్లా కేంద్రంలో ఎస్సారార్ కళాశాల ఎదురుగా ఆర్అండ్బీ క్వార్టర్స్ సముదాయంలో బీసీ స్టడీసర్కిల్‌ను ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో స్టడీసర్కిల్ నిర్వహిస్తుండడంపై విమర్శలొచ్చాయి. స్టడీసర్కిల్‌కు సొంత భవనం నిర్మించాలంటూ అభ్యర్థులు, వివిధ సంఘాల బాధ్యులు కోరుతూ వచ్చారు. చివరకు 2013లో అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ చొరవతో భవన నిర్మాణానికి బీజం పడింది. ఇందుకోసం నగరంలోని సప్తగిరికాలనీ ఆబాదికుంట శిఖంలో వేయిచదరగపు గజాల స్థలాన్ని కేటాయించారు. రూ.2 కోట్ల 40 లక్షల వ్యయంతో నాలుగు అంతస్తులతో భవనం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తన వాటాగా పొన్నం ప్రభాకర్ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయించారు. మరో రూ.50 లక్షలు రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌తో మంజూరు చేయించారు. మిగిలిన రూ.కోటి 40 లక్షలు బీసీ శాఖ భరించడానికి ఒప్పందం కుదిరింది. భవన నిర్మాణానికి 2013 నవంబర్ 28న అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం భవన నిర్మాణానికి మంజూరు ఇవ్వడంలో ఆసక్తి చూపకపోవడానికి రాజకీయపరమైన కారణాలంటూ ప్రతిపక్షాలు పలుమార్లు ఆరోపించాయి. ప్రస్తుత ప్రభుత్వం రూ.3కోట్ల అంచనాతో భవన నిర్మాణానికి కొత్త ప్రక్రియను ప్రారంభించింది. ఎంపీ హోదాలో పొన్నం ప్రభాకర్ కేటాయించిన రూ.50 లక్షలు విడుదల అయినా ప్రభుత్వం మంజూరు ఇవ్వకపోవడంతో అలానే ఉండిపోయాయి. అద్దె భవనంలో కొనసాగింపు ప్రస్తుతం పోటీపరీక్షల సీజన్ కావడంతో బీసీ స్టడీసర్కిల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం మంకమ్మతోటలో అద్దె భవనంలో స్టడీసర్కిల్‌ను ఇబ్బందుల మధ్య నిర్వహిస్తున్నారు. ఒకటో అంతస్తులో కార్యాలయం, రెండోఅంతస్తులో డైనింగ్, మూడు, నాలుగు అంతస్తుల్లో బాలికల, బాలుర హాస్టళ్లను నిర్వహించడానికి వీలుగా నిర్మించనున్న భవనం పూర్తయితే అభ్యర్థులకు ఎంతో మేలు జరగనుంది. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనపెట్టి త్వరగా స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి మంజూరు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.