breaking news
BC loan application process
-
బీసీ రుణాల కోసం యువత ఎదురుచూపు
సాక్షి, మెదక్: జిల్లాలో బీసీ రుణాల పంపిణీ అటకెక్కింది. వేలాది మంది బీసీ యువకులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావడం లేదు. దీనికితోడు ప్రభుత్వం నిధులు సైతం మంజూరు చేయకపోవడం గమనార్హం. దీంతో బీసీ రుణాల పంపిణీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా మారింది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ సబ్సిడీ రుణాలు అందజేస్తోంది. ఈ సబ్సిడీని 50 నుంచి 80 శాతానికి పెంచింది. లక్ష నుంచి రూ.12 లక్షల వరకు రుణాలు అందజేస్తోంది. రూ.లక్షకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షలకు 70 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ ఉంటుంది. అలాగే బ్యాంకు కాన్సెంట్‌ను కూడా రద్దు చేసింది. దీంతో జిల్లాలోని యువకులు పెద్ద సంఖ్యలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 13 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 9వేల దరఖాస్తులు నిబంధనల మేరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దరఖాస్తులను స్వీకరించి మూడు నెలలు దాటుతున్నా ఇంకా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఎంపిక కోసం గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రుణాల లక్ష్యం నిర్ణయించలేదు.. జిల్లాలో బీసీ రుణాల కోసం 20 మండలాల నుంచి 9వేల మందికిపైగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు కులవృత్తులు చేసుకునేవారు సైతం తమ సంఘాల ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుల సంఘాల ద్వారా 9,044 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ లక్ష నుంచి రూ.12 లక్షల వరకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరు ఊసెత్తడం లేదు. రుణాల మంజూరీ కోసం ప్రభుత్వం బ్యాంకులకు మండలాలు, పట్టణాల వారీగా లక్ష్యం నిర్ధేశిస్తుంది. కానీ ఇప్పటివరకు బ్యాంకుల వారీగా రుణాల పంపిణీ లక్ష్యం నిర్ణయించలేదు. ఈ కారణంగానే రుణాల పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే నెల నుంచి మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. రూ.2 నుంచి 12 లక్షల వరకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాల మంజూరీలో జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కులవృత్తుల వారికి సైతం వచ్చేనెల నుంచి రుణాలు మంజూరు అయ్యే అవకాశాలున్నాయి. ఎంపిక ప్రక్రియ జరుగుతోంది జిల్లాలో బీసీ రుణాల అందజేసేందుకు లబ్ధిదారుల ఎంపిక పక్రియ జరుగుతోంది. గతంలో రుణాలు పొందిన వారు సైతం తిరిగి దరఖాస్తులు సమర్పించటంతో అధికారులు దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. నిధులు మంజూరు అయిన వెంటనే బీసీ రుణాల పంపిణీ ప్రారంభం అవుతుంది. –సుధాకర్, బీసీ సంక్షేమశాఖ అధికారి ఎప్పుడిస్తారో తెలియడం లేదు బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం దరఖాస్తు చేసుకున్నాం. వార్డు సభలు కూడా నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. అసలు ఇస్తారో?.. ఇవ్వరో? తెలియడం లేదు. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. –నరేష్, మెదక్ వస్తాయో?.. రావో? స్వయం ఉపాధి పొందుదామని బీసీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్ కోసం దరఖాస్తు చేసుకొని నెల్లాళ్లు గడుస్తోంది. ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదు. వార్డు సభలన్నారు. ఎంక్వరీలన్నారు. అన్నీ అయిపోయాయి. కానీ ఇంకా లోన్ల గురించి ఎవరూ ఏం చెప్పడం లేదు. –కృష్ణ, మెదక్ -
పేదల రుణాలకు ప‘రేషన్’
వీరయ్య రేషన్‌కార్డులో భార్య, ఇద్దరు పిల్లలతోపాటు మరో ఇద్దరు తమ్ముళ్ల పేర్లు కూడా ఉన్నాయి. వీరయ్య ప్రభుత్వం మంజూరు చేసిన భూమికి ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. వీరయ్య తమ్ముడు నిరుద్యోగి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని స్వయం ఉపాధి పొందాలని భావించాడు. దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది. ఇదేమిటని జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో విచారించగా విషయం తెలిసి అవాక్కయ్యూడు. తెల్లరేషన్‌కార్డులో ఉన్న సభ్యుల్లో ఒక్కరు మాత్రమే రుణం పొందడానికి అర్హులని అధికారులు తేల్చారు. 101 జీఓ నిబంధనలు కఠినతరం కావడంతో చాలామంది రుణాలు దక్కక ఇబ్బందుల పాలవుతున్నారు. ► రేషన్‌కార్డులో పేరున్న ఒక్కరికే రుణం ►ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అవకాశం ►నిబంధనలు కఠినతరం ►తప్పని 101 జీవో కష్టాలు ►నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రుణం ఇక గగనమే కడప రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం గుదిబండ లాంటి జీఓ 101ను తీసుకొచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. స్వయం ఉపాధి కోసం రుణం తీసుకుందామన్నా రేషన్ విధించడం (పరిమితం చేయడం) నిరుపేదల పాలిట శాపంగా మారుతోంది. కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అంటే సరే అనుకున్నారు. ఇప్పుడు రుణం కూడా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా అందులో ఒక్కరికి మాత్రమే అవకాశం అని పరిమితులు విధించడం హతాశులను చేస్తోంది. 101 జీఓతో అష్టకష్టాలు 2013-14లో నాటి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల రుణాల మంజూరుకు సంబంధించి 101 జీఓను తీసుకొచ్చింది. ఈ జీఓపై నాడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయా వర్గాలకు చెందిన వారు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించారు. కొత్త ప్రభుత్వంలో 101 జీఓ పీడ ఉండదని ఆయా వర్గాలకు చెందిన వారు ఆశించారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పాలకులు ఆ జీఓను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యధాతథం చేశారు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల ఉరి! ఈ జీఓ ప్రకారం రుణాలు పొందాలనుకుంటే తెల్లరేషన్‌కార్డు తప్పనిసరి, అలాగే ఆధార్‌కార్డు ఉండాలి. ఇటీవల మీ-సేవ కేంద్రాల నుంచి పొందిన ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలి. ముఖ్యంగా తెల్లరేషన్కార్డుతోనే అసలు చిక్కు ఎదురవుతోంది. కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నా ఒక్కరు మాత్రమే రుణం పొందడానికి అర్హులు. ఒకవేళ ఆ రేషన్‌కార్డులో ఉన్న మరొకరు రుణం పొందాలంటే మరో ఐదు సంవత్సరాల వరకు ఆగాల్సిందే! ఈ నిబంధనల కారణంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. చాలామందికి ఒక్కరికే రేషన్‌కార్డు పెద్ద కుటుంబాలకు తెల్లరేషన్‌కార్డు ఒక్కటే ఉండడంతో రుణాలు పొందడానికి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఉదాహరణకు తల్లీదండ్రులు లేని వారు తమ్ముళ్లు, చెల్లెళ్లు, అన్నా లేక అక్క సంరక్షణలోనే ఉంటున్నారు. వివిధ కారణాల వల్ల వారికి వివాహాలు కాకపోవడంతో ఉమ్మడి కుటుంబంలా జీవిస్తూ ఒకే తెల్లరేషన్‌కార్డులో సభ్యులై ఉంటున్నారు. ఆ రేషన్‌కార్డులో ఉన్న సభ్యులు ఒకరు వ్యవసాయంపై ఆధారపడగా, మరొకరు చదువుకొని ఉద్యోగం రాక నిరుద్యోగిగా ఉంటున్నారు. అలాంటి వారు రుణం పొందాలంటే కష్టతరంగా మారింది. ముఖ్యంగా ఆన్లైన్ దరఖాస్తు విధానంలో పొరపాటున తెల్లరేషన్కార్డులోగల మరో వ్యక్తి దరఖాస్తు చేసినప్పటికీ ఆ దరఖాస్తును వెబ్సైట్ స్వీకరించడం లేదు. ఎస్సీల పరిస్థితి దారుణం గతంలో రుణాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉండేవి కావు. అర్హులు ఎంతమంది ఉన్నా లక్ష్యాలు, నిబంధనల ప్రకారం వారందరికీ ఆయా కార్పొరేషన్లు రుణాలు మంజూరు చేసేవి. కొత్త నిబంధనల కారణంగా ఎస్సీ వర్గాలకు చెందిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. విద్యుత్ సౌకర్యం కింద గతంలో విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకుని అవి మంజూరైనా ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబంలోని మరొక వ్యక్తి రుణం పొందేవారు. ప్రస్తుతం రేషన్కార్డులోగల వ్యక్తి వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకుంటే అతను లేదా అతని కుటుంబంలోని వ్యక్తి ఏ యూనిట్‌కైనా సరే రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ రుణ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఎస్టీ, బీసీల రుణ దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. బడుగు, బలహీన వర్గాల రుణాల విషయంలో ఆంక్షలు సంకెళ్లు విధించడం తగదని నిరుద్యోగులు వాపోతున్నారు.