breaking news
Bavuma
-
‘లార్డ్’ బవుమా
‘కోటా’ వల్లే కొనసాగుతున్నాడనే విమర్శలు... ఆటగాడిగానూ అర్హత లేని వాడికి సారథ్యమా అనే విసుర్లు... సోషల్ మీడియాలో లెక్కకు మిక్కిలి మీమ్స్... కొన్నాళ్ల క్రితం ఆ ఆటగాడి పరిస్థితి ఇది! కానీ వాటన్నింటిని లెక్క చేయని ఆ ప్లేయర్... ‘పక్షి కన్నుకు గురి పెట్టిన పార్థుడిలా...’ లక్ష్యాన్ని మాత్రమే స్వప్నించాడు. దాని కోసమే తపించాడు. అహర్నిశలు దానికై సర్వశక్తులు ధారపోశాడు. ఎట్టకేలకు దాన్ని సాధించాడు. తమ దేశాభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీని అందించి... అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు.లార్డ్స్ బాల్కానీలో ఐసీసీ గద చేతబూని సగర్వంగా చిరు దరహాసం చేసిన ఆ ఐదడుగుల నాలుగు అంగుళాల ప్లేయరే తెంబా బవుమా. ‘బ్లాక్ ఆఫ్రికన్’ కాబట్టే జట్టులో చోటు దక్కిందనే విమర్శల దశ నుంచి... 27 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా ఇప్పుడు ఎక్కడ చూసినా అతడి పేరు మారుమోగుతోంది. ప్రధాన జట్లతో ఆడకుండానే ఫైనల్ చేరారనే విమర్శలకు తనదైన శైలిలో జవాబిచ్చిన బవుమా... తుదిపోరులో తమ మనోస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు కంగారూలు ‘చోకర్స్’ అంటూ స్లెడ్జింగ్‌కు దిగినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. సఫారీ జట్టును ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిపిన బవుమా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో... దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. స్కోరు బోర్డుపై 70 పరుగులు చేరేసరికి రెండు వికెట్లు నేలకూలాయి. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవాలంటే సఫారీ జట్టుకు ఇంకా 212 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పుడు లార్డ్స్ లాంజ్ రూమ్ నుంచి దక్షిణాఫ్రికా సారథి తెంబా బవుమా చిట్టి చిట్టి అడుగులు వేస్తూ మైదానంలో అడుగు పెట్టాడు. అప్పటి వరకు పేసర్లు పండగ చేసుకున్న పిచ్ అది. అందులోనూ మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి ఆరున్నర అడుగుల ఆజానుబావుల భీకర బౌలింగ్. ఒక ఎండ్‌లో మార్క్రమ్ పోరాడుతున్నా... అతడికి సహకరించే వారేరి అనే అనుమానాలు. గతేడాది ఆరంభంలో కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టులోనూ మార్క్రమ్ ఒంటరి పోరాటంతో సెంచరీ చేసినా అతడికి అండగా నిలిచేవారు లేక సఫారీ జట్టు ఘోర పరాజయం ఎదుర్కొంది. లార్డ్స్‌లోనూ దాదాపు అదే ప్రమాద ఘంటికలు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు రానున్న వారిలో పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు లేరు. ఇలాంటి దశలో బవుమా తన కెరీర్లో అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకు 63 టెస్టులాడినా... కేవలం నాలుగు శతకాలే సాధించిన అతడు... లార్డ్స్‌లో ఆణిముత్యంలాంటి అర్ధసెంచరీతో మార్క్రమ్కు అండగా నిలిచాడు. ఆసీస్ పేసర్లు బాడీలైన్ బౌలింగ్‌తో పరీక్ష పెడుతున్నా... ప్రత్యర్థులు తన ఎత్తును అదునుగా చేసుకొని బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. క్రీజులో అడుగుపెట్టిన కాసేపటికే కండరాలు పట్టేసినా... మైదానం వీడితే క్షణాల్లో మ్యాచ్‌ను లాగేసుకోవడంలో సిద్ధహస్తులైన కంగారూలకు అవకాశం ఇవ్వకుండా నొప్పిని పంటిబిగువున భరిస్తూనే మార్క్రమ్కు అండగా నిలిచాడు. దీంతో స్వేచ్ఛగా ఆడిన మార్క్రమ్ జట్టును విజయ తీరాలకు చేరువ చేశాడు. సార్థక నామధేయుడు తెంబా బవుమా పేరు వెనక ఒక చరిత్ర ఉంది. దక్షణాఫ్రికా స్థానిక జులూ భాషలో తెంబా అంటే ‘ఆశ’ అని అర్థం. అందుకు తగ్గట్లే ఎప్పుడూ ఆశావాహ దృక్పథంతోనే ఉండే బవుమా... ‘పొట్టివాడు గట్టివాడు’ అని తన చేతలతో నిరూపించాడు. ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడాలంటే... ఆట ఆరంభానికి ముందే ప్రత్యర్థి మానసికంగా కుంగిపోవడం ఖాయం. అలాంటిది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కంగారూలను కంగుతినిపిస్తూ బవుమా జట్టును నడిపిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ‘చోకర్స్’ ముద్రను చెరిపేస్తూ... ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్‌లో తమ జట్టును సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిపిన అతడి నాయకత్వ సామర్థ్యాన్ని విమర్శకులు సైతం కొనియాడుతున్నారు. గతంలో విరాట్ కోహ్లి మాదిరిగా ‘అతి సంబరాల’తో విమర్శల పాలైన బవుమా... డబ్ల్యూటీసీ ఫైనల్లో కైల్ వెరీన్ విన్నింగ్ రన్స్ కొట్టిన తర్వాత ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని... కళ్లలో నీటి చెమ్మ కనిపించకుండా ముభావంగా కూర్చుండిపోయాడు. సహచరులంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే... భారీ బరువేదో భుజస్కంధాలపై నుంచి దించేసుకున్నట్లు నింపాదిగా లేచి అందరితో కలిసిపోయాడు. ‘లాంగా’ నుంచి లార్డ్స్ వరకు... దక్షిణాఫ్రికా మూడు రాజధానుల్లో ఒకటైన కేప్‌టౌన్‌లో నల్లజాతీయులు అధికంగా నివసించే ‘లాంగా’లో బవుమా క్రీడా ప్రస్థానం ప్రారంభమైంది. పదేళ్ల ప్రాయంలో వీధుల్లో క్రికెట్ ఆడుతూ... గల్లీకొక మైదానం పేరుతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన బవుమా... పదకొండేళ్లకు స్పోర్ట్స్ స్కాలర్షిప్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత కఠోర శ్రమ, నిత్యం నేర్చుకోవాలనే తపనతో ఆటను మెరుగు పర్చుకున్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమీప బంధువు సూచనలు పాటిస్తూ ఒక్కో మెట్టూ ఎదుగుతూ జాతీయ జట్టు వరకు చేరుకున్నాడు. ప్రతీక్షణం నిరూపించుకోవాల్సిన కఠిన పరిస్థితులను ఎదురొడ్డి వచ్చిన అవకాశాలను అతడు సది్వనియోగ పర్చుకున్నాడు. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో జట్టులో అతడి స్థానానికి భరోసా లేకపోయింది. అయితే డీన్ ఎల్గర్ రిటైర్మెంట్ అనంతరం అనూహ్యంగా సారథిగా ఎంపికైన తెంబా... ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 2023–25 డబ్ల్యూటీసీ సర్కిల్లో జట్టు పగ్గాలు అందుకున్న బవుమా... కెపె్టన్‌గా ఆడిన తొలి 10 టెస్టుల్లో ఓటమి ఎరగని రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆటగాడిగానూ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 59.25 సగటుతో 711 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. భాగస్వామ్యాలకు పెట్టింది పేరైన బవుమా... ఈ డబ్ల్యూటీసీ సర్కిల్లో 60.35 పార్ట్నర్షిప్ సగటుతో అందరికంటే అగ్రస్థానంలో నిలిచాడు. ‘గత కొన్నేళ్లుగా తెంబా జట్టును సమర్థవంతంగా నడుపుతున్నాడు. ఫైనల్లో నా ప్రదర్శన వెనక అతడి ప్రోద్బలం ఎంతో ఉంది. కండరాలు పట్టేసిన స్థితిలో పరుగు తీయడం ఇబ్బందిగా మారినా మైదానాన్ని వీడకుండా పోరాడాడు. కీలక పరుగులతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి చిరస్మర విజయంలో కీలకపాత్ర పోషించాడు’ అని తన సారథిపై మార్క్రమ్ ప్రశంసలు కురిపించాడు. నిస్వార్థ నాయకుడు... జట్టు ఓడితే ఆ బాధ్యత తాను వహించి... గెలిస్తే సహచరులకు ఆ క్రెడిట్ ఇచ్చేవాడే అత్యుత్తమ నాయకుడు. ఈ కోవలో చూస్తే బవుమాకు 100కు 100 మార్కులు పడతాయి. ఫైనల్లో తన అసమాన ప్రదర్శనను పక్కనపెట్టి... రబాడ, ఇన్‌గిడి, మార్క్రమ్ పోరాటంతోనే జట్టు విజయం సాధించిందని చెప్పిన గొప్ప మనసు బవుమాది. ‘జట్టంతా సమష్టిగా రాణిస్తేనే నిలకడగా విజయాలు సాధించడం సాధ్యమవుతుంది. మా టీమ్ అందుకు నిదర్శనం. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడంలో మేమెప్పుడూ ముందుంటాం. ఒకరి విజయాలను మరొకరం ఆస్వాదిస్తాం. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రతి రోజు మెరుగయ్యేందుకు ప్రయత్నించడమే మా విజయ లక్ష్యం’ అని బవుమా అన్నాడు. అతడు అన్నట్లుగానే 2023–25 డబ్ల్యూటీసీ సర్కిల్‌ను పరిశీలిస్తే... దక్షిణాఫ్రికా జట్టు ఏ ఒక్క ఆటగాడి ప్రదర్శనపైనో అతిగా ఆధారపడలేదు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్నారంటే సఫారీ జట్టు ‘టీమ్ వర్క్’ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందరిని కలుపుకుంటూ... మార్క్రమ్, బెడింగ్హామ్, స్టబ్స్ వంటి తెల్లజాతీయులు, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి వంటి భారత సంతతి ఆటగాళ్లు, రబాడ, ఇన్‌గిడి వంటి నల్ల జాతీయులు కలగలిపి ఉన్న దక్షిణాఫ్రికా జట్టును బవుమా చక్కగా నడిపించాడు. ‘విభిన్న నేపథ్యాల వాళ్లమైనా... జట్టుగా మేమంతా ఒక్కటే. సమష్టి ప్రదర్శనకు దక్కిన చక్కటి ఫలితమిది’ అని మ్యాచ్ అనంతరం బవుమా పేర్కొన్నాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం సమయంలో జట్టు సహచరుడు క్వింటన్ డికాక్ మోకాళ్లపై నిల్చునేందుకు నిరాకరించిన నోరు మెదపని బవుమా... ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ దక్షిణాఫ్రికా జట్టుకు ఐసీసీ ట్రోఫీ అందించిన తొలి నల్లజాతి సారథిగా చరిత్రకెక్కాడు. మైదానం బయట కూడా మంచి మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకున్న బవుమా... ప్రస్తుతం నిరుపేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్ నడుపుతున్నాడు. వాళ్లకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు ఈ సంస్థ సహకారం అందిస్తోంది. -
చోకర్స్ కాదు... విన్నర్స్
దాదాపు ఏడాది క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో టి20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడింది. 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో చేతిలో 6 వికెట్లతో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. ఇక విజయం లాంఛనమే అనిపించగా...చివరకు 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డగౌట్లో కూర్చుకున్న కెప్టెన్ మార్క్రమ్ కన్నీళ్లపర్యంతమైన దృశ్యం దక్షిణాఫ్రికా అభిమానులకు కలచివేసింది. ఇప్పుడు సంవత్సరం తిరగక ముందే అతను సఫారీ ఫ్యాన్స్ దృష్టిలో హీరోగా మారిపోయాడు. ఆస్ట్రేలియా ‘బౌలింగ్ చతుష్టయం’ను ఎదుర్కొని దక్షిణాఫ్రికా 282 పరుగులు సాధించగలదా అనే సందేహాల మధ్య అతను అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ‘డకౌట్’ అయినా రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా తన కెరీర్లో అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కెపె్టన్ తెంబా బవుమా విజయగాథ కూడా ఇలాంటిదే. 64 టెస్టుల కెరీర్లో కేవలం 4 సెంచరీలే సాధించిన అతను ప్రతీసారి తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నాడు. ‘బ్లాక్ ఆఫ్రికన్’ కాబట్టి టీమ్‌లో చోటు దక్కిందని, రిజర్వేషన్ కారణంగానే కొనసాగుతున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తూ వచ్చాయి. తాజా ఘనతతో బవుమా నాయకుడిగా ఆకాశమంత ఎత్తున నిలిచాడు. ఫైనల్‌కు ముందు తన కెపె్టన్సీలో ఆడిన 9 టెస్టుల్లో 8 మ్యాచ్‌లు గెలిపించి ఓటమి ఎరుగని అతను...ఇప్పుడు టీమ్‌ను వరల్డ్ చాంపియన్‌గా నిలిచి పొట్టివాడు అయినా గట్టివాడే అని నిరూపించాడు. మార్క్రమ్, బవుమా 147 పరుగుల భాగస్వామ్యం ఆ్రస్టేలియా ఆట కట్టించేలా చేసింది. డ్రగ్స్ వివాదం నుంచి బయటపడిన రబాడ 9 వికెట్లతో సఫారీ విజయానికి పునాది వేయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఇన్‌గిడి తన విలువ చాటాడు. విమర్శలను అధిగమించి... దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించినా...ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎదురుగా బలమైన ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థి ఉండటంతో పాటు టీమ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. టాప్–7 బ్యాటర్లతో పాటు ఆల్‌రౌండర్ యాన్సెన్ మొత్తం టెస్టు పరుగులు కలిపినా... ఒక్క స్టీవ్ స్మిత్ సాధించిన పరుగులకంటే తక్కువగా ఉన్నాయి! పైగా స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, లయన్ కలిసి ఆసీస్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అలాంటి బౌలింగ్‌ను ఎదుర్కొని గెలవడం దాదాపు అసాధ్యమని అనిపించింది. అన్నింటికి మించి సఫారీ టీమ్ ఫైనల్‌కు చేరిన క్రమంపై విమర్శలు ఉన్నాయి. 2023–25 డబ్ల్యూటీసీ సైకిల్లో అగ్రశ్రేణి టీమ్‌లైన ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలను ఒక్క టెస్టులోనూ ఎదుర్కోని టీమ్... సొంతగడ్డపై భారత్ చేతిలో 55కు ఆలౌటై చిత్తుగా ఓడింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్‌లాంటి బలహీన ప్రత్యర్థులపై (వరుసగా 7 టెస్టులు) గెలిచి ఫైనల్ చేరిందని వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఫైనల్‌కు ముందు ‘అదంతా మా చేతుల్లో లేదు. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే దానిని ఎవరూ పట్టించుకోరు’ అంటూ స్పష్టంగా చెప్పిన బవుమా దానిని చేసి చూపించాడు. ఆ్రస్టేలియాను ఓడిస్తేనే వరల్డ్ చాంపియన్‌గా భావిస్తాం అనేవారికి సమాధానం ఇచ్చాడు. స్వదేశంలో టి20 లీగ్ కోసం ప్రధాన ఆటగాళ్లతో కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును న్యూజిలాండ్ పంపగా 0–2తో టీమ్ చిత్తయింది. అయినా సరే చివరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టు అర్హత సాధించడం విశేషం. ఆనందం దక్కింది... అంతర్జాతీయ క్రికెట్లోకి 1991లో దక్షిణాఫ్రికా పునరాగమనం చేసింది. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ సెమీస్‌లో వర్షం నిబంధనతో ఓడిన జట్టు, 1996లో అన్ని లీగ్‌లు గెలిచి క్వార్టర్స్‌లో అనూహ్యంగా ఓడింది. 1998తో క్రానే, కలిస్, రోడ్స్, బౌచర్‌లతో కూడిన జట్టు తొలి చాంపియన్స్ ట్రోఫీని గెలిచి ఆనందం పంచింది. అయితే ఆ తర్వాతే జట్టు రాత పూర్తిగా మారిపోయింది. గత ఏడాది టి20 వరల్డ్ కప్‌కు ముందు వరకు ఒక్క ఐసీసీ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయింది. 1999 సెమీస్‌లో ‘టై’తో గుండె పగలగా, సొంతగడ్డపై 2003లో మళ్లీ వర్షంతో లెక్క తప్పడంతో సెమీస్ కూడా చేరలేకపోయింది. ఆ తర్వాత మూడు సార్లు సెమీస్ వరకు చేరడంలో సఫలమైంది. స్వదేశంలో 2007 టి20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరని జట్టు తర్వాత రెండు సార్లు సెమీస్‌లోనే ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో ఐదు సార్లు సెమీస్‌కే పరిమితమైంది. వేర్వేరు కారణాలతో వచ్చిన ఈ ఓటములతో టీమ్‌లో నైరాశ్యం నెలకొంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బోర్డులో రాజకీయాలు, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో జట్టు ఆటపై కూడా ప్రభావం పడింది. వరుస ఓటములతో టీమ్ వెనుకబడిపోవడంతో ఇతర టీమ్‌ల దృష్టిలో అది ద్వితీయ శ్రేణి జట్టుగా మారిపోయింది. అయితే తాజా విజయం సఫారీ టీమ్‌లో కొత్త ఉత్సాహం తీసుకు రానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో ఈ విజయం వారిలో జోష్ నింపడం ఖాయం. -
సూపర్ ‘సఫారీ’
దక్షిణాఫ్రికా సుదీర్ఘ స్వప్నం నెరవేరింది...ఐసీసీ ట్రోఫీ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాడిన టీమ్ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకుంది...1998లో ఐసీసీ నాకౌట్ కప్ సాధించిన తర్వాత 7 వన్డే వరల్డ్ కప్‌లు, 9 టి20 వరల్డ్ కప్‌లు, 9 చాంపియన్స్ ట్రోఫీలు, 2 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లు జరగ్గా... ఒక్క సారి కూడా టైటిల్ అందుకునే అవకాశమే రాలేదు... అద్భుతంగా ఆడుతూ వచ్చి అసలు సమయంలో చేతులెత్తేసిన సందర్భాలు కొన్నయితే, అవసరమైన చోట అదృష్టం మొహం చాటేసిన సందర్భాలు మరికొన్ని... ఇప్పుడు ఆ ‘చోకర్స్’ ముద్రను వెనక్కి తోస్తూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌తో సఫారీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ్రస్టేలియాను చిత్తు చేసి బవుమా సేన సగర్వంగా సత్తా చాటింది. ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఈ సారి మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో తలవంచి నిరాశగా వెనుదిరిగింది.లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో దక్షిణాఫ్రికా చాంపియన్‌గా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 213/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎయిడెన్ మార్క్రమ్ (207 బంతుల్లో 136; 14 ఫోర్లు) దాదాపు చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్ (2021), ఆ్రస్టేలియా (2023) తర్వాత డబ్ల్యూటీసీ గెలుచుకున్న మూడో టీమ్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. విజేత దక్షిణాఫ్రికాకు రూ. 30.76 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది.27.4 ఓవర్లలో 69 పరుగులు... ఆట ఆరంభంలోనే తెంబా బవుమా (134 బంతుల్లో 66; 5 ఫోర్లు)ను కమిన్స్ అవుట్ చేయగా, కొద్ది సేపటికే స్టబ్స్ (8)ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా మరో 41 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో వైపు మార్క్రమ్ మూడో రోజు తరహాలోనే పట్టుదలగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అతనికి బెడింగ్హామ్ (21 నాటౌట్) అండగా నిలిచాడు. ఎట్టకేలకు కొత్త బంతిని తీసుకున్న వెంటనే తొలి ఓవర్లోనే మార్క్రమ్ను హాజల్‌వుడ్ వెనక్కి పంపించినా...అప్పటికే ఆలస్యమైపోయింది. విజయానికి మరో 5 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, స్టార్క్ వేసిన బంతిని వెరీన్ కవర్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో సఫారీ శిబిరంలో వేడుక మొదలైంది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్ 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) హెడ్ (బి) హాజల్‌వుడ్ 136; రికెల్టన్ (సి) క్యారీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (సి) క్యారీ (బి) కమిన్స్ 66; స్టబ్స్ (బి) స్టార్క్ 8; బెడింగ్హామ్ (నాటౌట్) 21; వెరీన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (83.4 ఓవర్లలో 5 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–9, 2–70, 3–217, 4–241, 5–276. బౌలింగ్: స్టార్క్ 14.4–1–66–3, హాజల్‌వుడ్ 19–2–58–1, కమిన్స్ 17–0–59–1, లయన్ 26–4–66–0, వెబ్‌స్టర్ 5–0–13–0, హెడ్ 2–0–8–0. -
దక్షిణాఫ్రికా లక్ష్యం 148
సెంచూరియన్: పేసర్ల ప్రతాపంతో దక్షిణాఫ్రికా–పాకిస్తాన్ల తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసేలా ఉంది. ఇక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సఫారీల ఎదుట 148 పరుగుల లక్ష్యం నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 127/5తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 223 పరుగులకు ఆలౌటైంది. బవుమా (53), డికాక్ (45) రాణిం చారు. దీంతో ఆ జట్టుకు 42 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం ఒలివియర్ (5/59) మరోసారి దెబ్బకొట్టడంతో రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 190 పరుగులకే ఆలౌటైంది. ఇమాముల్ హక్ (57), షాన్ మసూద్ (65) అర్ధ శతకాలు చేశారు. ఒలివియర్ ఈ మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు పడగొట్టడం విశేషం. మరోవైపు పాక్ పేసర్లు ఆమిర్, షాహిన్ షా ఆఫ్రిదిలను ఎదుర్కొంటూ నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించడం దక్షిణాఫ్రికాకూ సవాలే. -
ఆదుకున్న డికాక్, బవుమా
దక్షిణాఫ్రికా 349/9 ∙ కివీస్‌తో రెండో టెస్టు వెల్లింగ్టన్: న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తడబడిన దక్షిణాఫ్రికాను క్వింటన్ డికాక్ (118 బంతుల్లో 91; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), బవుమా (160 బంతుల్లో 89; 9 ఫోర్లు) ఆదుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శుక్రవారం 24/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట నిలిచే సమయానికి 9 వికెట్లకు 349 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్ (3/52), వాగ్నర్ (3/96)లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఒక దశలో 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రబడ (9), ఆమ్లా (21), డుమినీ (16), డుప్లెసిస్ (22) విఫలమయ్యారు. ఈ దశలో డికాక్, బవుమా ఏడో వికెట్‌కు 160 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రస్తుతం ఫిలాండర్ (36 బ్యాటింగ్), మోర్కెల్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.