breaking news
Basheer Ahmad Khan
-
ఏపీఎన్జీవో ఎన్నికల్లో నువ్వా.. నేనా
అశోక్‌బాబు ప్యానెల్‌కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన బషీర్ ప్యానెల్ సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చారని అశోక్‌బాబుపై ఆరోపణలు అందుకే వ్యతిరేక ప్యానెల్‌గా పోటీ చేస్తున్నామన్న బషీర్ ఉద్యమాన్ని అశోక్‌బాబు తన స్వార్థానికి వాడుకున్నారని మండిపాటు నామినేషన్ల ప్రక్రియ పూర్తి... వచ్చేనెల 5న ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల సంఘం ఎన్నికలకు ఆదివారం నామినేషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుత తాత్కాలిక కమిటీ అధ్యక్షుడు అశోక్‌బాబు, పలువురు సభ్యులు తిరిగి నామినేషన్లు దాఖలు చేశారు. అశోక్‌బాబు ప్యానెల్‌కు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బషీర్ నేతృత్వంలో మరో ప్యానెల్ బరిలోకి దిగింది. మొత్తం 17 మందితో ఒక్కో ప్యానెల్ ఏర్పడింది. సమైక్య ఉద్యమాన్ని దెబ్బతీసే క్రమంలో సీఎం కిరణ్.. అశోక్‌బాబును ముందుంచి తెర వెనుక చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర కోసం 66 రోజుల పాటు ఏపీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సమ్మె చేసిన ఉద్యోగులు ఉన్నట్టుండీ.. సమ్మె విరమించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. సీఎం ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు బలవంతంగా సమ్మె విరమింపజేశారని, అశోక్‌బాబు ఇందుకు మద్దతు తెలిపారని సీమాంధ్రలో ప్రజలు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో అశోక్‌బాబు రాజకీయంగా ఎదిగేందుకు ఉద్యమాన్ని, ఉద్యోగ సంఘాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారన్న ప్రచారం ఉద్యోగుల్లో బలంగా వినిపిస్తోంది. పలు జిల్లాల కార్యవర్గ సభ్యులు ఇటీవల సమావేశమై ఏపీఎన్జీవో సంఘం నాయకత్వ మార్పు తక్షణ అవసరమని తే ల్చారు. దీంతో సీమాంధ్రలోనూ పలు జిల్లాల కార్యవర్గ సభ్యులు అశోక్‌బాబుకు వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి వస్తున్నారు. ఆదివారం నాటి నామినేషన్ల ఘట్టంలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. అన్ని జిల్లా సంఘాల్లో తమకే మద్దతు ఎక్కువగా ఉందని అశోక్‌బాబు ప్యానెల్ సభ్యులు పేర్కొంటుండగా... వచ్చేనెల 5న జరిగే ఎన్నికల ఫలితాలు అశోక్‌బాబుపై వ్యతిరేకత ఎంతుందో స్పష్టం చేస్తాయని ఆయన వ్యతిరేక ప్యానెల్ సభ్యులు పేర్కొంటున్నారు. నామినేషన్లు వేసింది వీరే.. అశోక్‌బాబు ప్యానెల్లో: అధ్యక్షుడిగా అశోక్‌బాబు, సహ అధ్యక్షుడిగా పురుషోత్తంనాయుడు, ఉపాధ్యక్షులుగా రమణ, రవిశంకర్, రామకృష్ణారెడ్డి, బాజిద్, సుబ్బారెడ్డి, శివారెడ్డి, ఆశీర్వాదం, విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌రెడ్డి, నిర్వహణ కార్యదర్శిగా ఎం.వెంకటేశ్వర్‌రెడ్డి, కార్యదర్శులుగా లూక్, నర్సింగారావు, నరసింహం, గంగిరెడ్డి, కోశాధికారిగా పి.వీరేంద్రబాబు నామినేషన్లు దాఖలు చేశారు. బషీర్ ప్యానెల్లో: అధ్యక్షుడిగా బషీర్, సహాధ్యక్షుడిగా రాజకుల్లాయప్ప, ఉపాధ్యక్షులుగా విజయభాస్కర్, మహానంద నాయుడు, శివరాంరెడ్డి, నరసింహ, వెంకమరాజు, దేవరాజు, నాగరాజు, దొరైఖాన్, ప్రధాన కార్యదర్శిగా పీవీవీ సత్యనారాయణ, నిర్వహణ కార్యదర్శిగా ఏఎంఏ ప్రసాద్, కార్యదర్శులుగా పద్మావతి, రవూఫ్, వసంతరావు, సత్యనారాయణ గౌడ్, కోశాధికారిగా కృపావరం నామినేషన్ దాఖలు చేశారు. బషీర్ ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షులుగా పోటీపడిన ఇద్దరి నామినేషన్లను సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. దీంతో స్వతంత్రులుగా నామినేషన్ దాఖలు చేసిన మరో ఇద్దరిని బషీర్ ప్యానెల్ సభ్యులుగా మార్చుకున్నారు. మేమెందుకు పోటీ చేస్తున్నామంటే... సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అశోక్‌బాబు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని ఏపీఎన్జీవో సంఘ అధ్యక్ష, కార్యదర్శి పదవులకు పోటీ చేస్తున్న షేక్ అబ్దుల్ బషీర్, సత్యనారాయణ విమర్శించారు. ఏ పరిస్థితుల్లో తాము ఈ పదవులకు పోటీ చేయాల్సి వచ్చిందో వివరించారు. కొందరు రాజకీయ నేతల కనుసన్నల్లో మెలుగుతూ, వారి ఆదేశానుసారం అశోక్‌బాబు తన స్వార్థం కోసం ఉద్యమాన్ని వాడుకున్నారని దుయ్యబట్టారు. బిల్లు అసెంబ్లీకి వస్తే మెరుపు సమ్మె చేస్తామని ప్రగల్భాలు పలికిన అశోక్‌బాబు.. బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ ఆ ఊసే ఎత్తలేదని, సమైక్యాంధ్ర ముసుగులో ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర నినాదంతో ముందుకు వచ్చే పార్టీలను కలుపుకొని ఉద్యమించాలని, తామంతా ఎంతగా చెప్పినప్పటికీ అశోక్‌బాబు పట్టించుకోలేదన్నారు. అశోక్‌బాబు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఉద్యోగులు ఇప్పటికే రెండున్నర పీఆర్సీలు కోల్పోయారు. కనీసం తాత్కాలిక భృతి వస్తుందని ఆశించినా.. అందుకు ప్రభుత్వ స్థాయిలో పట్టుబట్టిన దాఖలాల్లేవు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల విషయంలో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతుంది. ఉద్యోగుల వివరాలు ఆన్లైన్లో లేకపోవడం వల్ల హెల్త్‌కార్డుల నమోదు ఉద్యోగులకు సంకటంగా మారింది. కేవలం ఎన్నికల్లో ఎలా గెలవాలన్న ఎత్తులతోనే కాలం వెళ్లదీస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తిలోదకాలిచ్చారు’’ అని వారు మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడుతున్నారు: బషీర్ ఎన్నికల్లో అక్రమంగానైనా గెలుపొందేందుకు అశోక్‌బాబు ప్రయత్నిస్తున్నారని బషీర్, సత్యనారాయణలు దుయ్యబట్టారు. సంఘంలో మొత్తం 866 మంది ఓటర్లుండగా, వీరిలో 33 మంది పేర్లు రిపీట్ అయ్యాయని వెల్లడించారు. అంటే ఓటర్ల జాబితాలో అక్రమాలు చేసి గెలిచేందుకు ఆయన పథకం వేశారని, విచ్చలవిడిగా డబ్బు వెదజల్లైనా నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. డబ్బు మూటలతో పలువురు మంత్రులు జిల్లాలకు పయనమవుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా నిజాయితీపరులైన ఎన్జీవోలు సమైక్యాంధ్రకు కట్టుబడిన వారినే ఎన్నికల్లో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీల జోక్యం లేదు: అశోక్‌బాబు ఏపీఎన్జీవోల సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీల జ్యోకం లేదని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. నామినేషన్ల పర్వం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని, ఉద్యోగులను పార్టీలు ప్రభావితం చేయలేవన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇదే బషీర్ పోటీచేశారని, మళ్లీ ఇప్పుడు పోటీకి నిలిచారని చెప్పారు. చాలా జిల్లాలకు సంబంధించిన ఉద్యోగుల మద్దతు తమ ప్యానెల్‌కే ఉందని, కొంత మంది మాత్రమే అవతలి ప్యానెల్‌కు మద్దతు తెలుపుతున్నారన్నారు. ఎవరు గెలిచినా, ఓడినా సమైక్యాంధ్ర ఉద్యమం ఆగదని, ఈ ఎన్నికలకు ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
కిష్ట్వార్లో కొనసాగుతున్న కర్ఫ్యూ
మత ఘర్షణల నేపథ్యంలో కిష్ట్వార్ పట్టణంలో విధించిన కర్ఫ్యూ ఎట్టి పరిస్థితుల్లో సడలించేది లేదని ఆ జిల్లా మేజిస్ట్రేట్ బషీర్ అహ్మద్ ఖాన్ బుధవారం స్పష్టం చేశారు. కర్ఫ్యూ సడలించిన పక్షంలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో విధించిన కర్ఫ్యూ నేటితో ఆరో రోజుకు చేరిందన్నారు. గత ఆరు రోజులుగా విధించిన కర్ఫ్యూను ఒక్క సారి కూడా సడలించలేదన సంగతిని ఖాన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదని తెలిపారు. అయితే పట్టణంలో విధించిన కర్ఫ్యూ వల్ల స్థానికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను విలేకర్ల బృందం స్థానికంగా పర్యటించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జమ్మూలోని పలు ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను కొంత సేపు సడలిస్తున్నారు. ఆ సమయంలో స్థానికులు తమకు అవసరమైన నిత్యవసర సరకులను కొనుగోలు చేస్తున్నారని జమ్మూలోని ఉన్నతాధికారి వివరించారు. అయితే గురువారం జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక విద్యార్థులు ఎవరు ఆ వేడుకలకు హాజరుకాకుడదంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15 సందర్భంగా ఏమైన ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆదికారులు వివరించారు.