ఉత్పాదకత పెంపే సవాలు!
సాక్షితో బీఏఎస్ఎఫ్ ప్రెసిడెంట్ మార్కస్
• అదే మనకున్న ప్రత్యామ్నాయం కూడా
• సవాళ్లు అధిగమిస్తే భవిష్యత్ ఇక్కడే
• ఆసియా ‘ఆగ్రి గేట్‌వే’గా ఇండియా
• టెక్నాలజీకి సై అంటున్న అన్నదాత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
ప్రపంచవ్యాప్తంగా జనాభా ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ప్రజల ఆహారపుటలవాట్లు మారుతున్నాయి. కానీ జనాభాకు తగ్గట్టుగా సాగు విస్తీర్ణం పెరగడం లేదు. ఉన్న స్థలంలోనే ఆహారధాన్యాల అధికోత్పత్తి సాధించటమే ఏకైక ప్రత్యామ్నాయమని, అతిపెద్ద సవాల్ కూడా అదేనని ఈ రంగంలో ఉన్న ‘బీఏఎస్ఎఫ్’ చెబుతోంది. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదని కంపెనీ క్రాప్ ప్రొటెక్షన్ విభాగం ప్రెసిడెంట్ మార్కస్ హెడెట్ చెప్పారు. వినియోగదారులు అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను.. అదికూడా అందుబాటు ధరలోనే కోరుతున్నారని చెప్పారు. పట్టణీకరణ, వాతావరణ మార్పులు, తరచూ మారే ప్రభుత్వ నిబంధనలతో వ్యవసాయ రంగం ఒత్తిడికి లోనవుతోందని అన్నారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వూ్య లో వ్యవసాయ రంగం తీరుతెన్నులు, భారత మార్కెట్ గురించి మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే..
ఉత్పాదకత తక్కువే..
భారత్‌లో 195 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. ఏ పంట తీసుకున్నా ఉత్పాదకత తక్కువగా ఉంది. వరి ఇక్కడి ప్రధాన పంట. హెక్టారుకు 3.4 టన్నులే పండుతోంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఇంతకు రెండింతలకుపైగా ఉత్పాదకత ఉంది. అత్యుత్తమ వంగడాలు, మోతాదుకు తగ్గట్టుగా ఎరువులు, పురుగు మందులు వాడాలి. దీనికితోడు టెక్నాలజీ వినియోగంతో ఉత్తమ ఫలితాలను రాబట్టొచ్చు. ఇందుకు రైతులకు నిరంతరం శిక్షణ అవసరం. ఈ విషయంలో కంపెనీలతోపాటు ప్రభుత్వమూ తన వంతు పాత్ర పోషించాల్సిందే. వ్యవసాయానికి అనువైన దేశమిది. ఆసియా ద్వారంగా భారత్ నిలిచింది. అన్నీ అనుకూలిస్తే చైనా, బ్రెజిల్‌తో పోటీపడే సత్తా భారత్‌కు ఉంది. పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్లు, వరి, మిరప పంటలకు ఇక్కడి మార్కెట్ అనువైనది. ఇప్పటికే భారత్ నుంచి ద్రాక్ష, బాస్మతి బియ్యం, మిరప ఎగుమతి అవుతోంది.
స్మార్ట్ రైతులూ ఉన్నారు..
దేశంలో స్మార్ట్ఫోన్ల వినియోగం ఎక్కువే. రైతులూ వీటిని వాడుతున్నారు. కొత్త టెక్నాలజీ వినియోగంలో భారత రైతులు ఎప్పుడూ ముందుంటారు. యాప్స్, డిజిటల్ టూల్స్‌ను వాడుతున్నారు. ద్రాక్ష, యాపిల్ రైతులైతే వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ పేజీలతో పోటీపడుతున్నారు. ఉత్పత్తి, డిమాండ్, సరఫరా, ధర, వాతావరణం, మార్కెట్ తీరు తెలుసుకునేందుకు స్మార్ట్ఫోన్లపై ఆధారపడుతున్నారు. ఒక ప్రాంతంలో ఉన్న రైతులు ఇలా సమష్టిగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు టెక్నాలజీ దోహదం చేస్తోంది. భారత్‌లో పొలం నుంచి మార్కెట్‌కు వెళ్లేసరికి 40 శాతం పంట వృథా అవుతోంది. ఈ నష్టాన్ని కట్టడి చేయడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో చిన్న రైతులే ఎక్కువ. లాభాలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఇప్పుడిప్పుడే ఒక ప్రాంతంలో ఉన్న చిన్నరైతులు ఏకమై సమష్టి వ్యవసాయం చేస్తున్నారు. ఇది శుభపరిణామం.
పెద్ద నోట్ల రద్దు తర్వాత..
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయానికి నిధుల కేటాయింపులూ పెరుగుతున్నాయి. దీనికితోడు పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగు వ్యవస్థలోకి భారీగా నిధులు వచ్చి చేరాయి. దీని పర్యవసానంగా రానున్న రోజుల్లో రైతులకు రుణాల లభ్యత అధికమవుతుంది. ముఖ్య విషయమేమంటే వ్యవసాయ రంగంలో పెట్టుబడికి భద్రమైన దేశమిది. ఇక్కడ 9 ఉత్పత్తి కేంద్రాలను బీఏఎస్ఎఫ్ నిర్వహిస్తోంది. పరిశోధన, అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నాం. భారత్‌లో రెండు ఆర్అండ్డీ కేంద్రాలున్నాయి. మొత్తం ఆదాయంలో 26 శాతం పరిశోధన, నూతన ఉత్పత్తుల అభివృద్ధికి వెచ్చిస్తున్నాం. యాక్టివ్ ఇంగ్రీడియెంట్ అభివృద్ధికి రూ.2 వేల కోట్లకుపైగా వ్యయం అవుతోంది. దీనిని తీసుకురావడానికి 10 ఏళ్లపాటు శ్రమించాల్సి వస్తోంది. రెగ్యులేటరీ నియంత్రణలు తరచూ మారడం కంపెనీలకు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.