breaking news
banthi flower
-
బంతి విలాపం... చాందినీ వికాసం
నాటురకం బంతిపూలు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సాగు చేసిన రైతులు వాటిని రోడ్డుపై పారబోస్తున్నారు. దీంతో అన్నదాతలకు నష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఈ పూలతోటలు సాగు అధికంగా ఉంటుంది. అయితే హైబ్రిడ్ రకం పూలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటోంది. రైతులు ఈ హైబ్రిడ్ రకం పూల తోటలు సాగు చేస్తే లాభాలు పొందుతారని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూలసాగు ఎక్కువగా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఉంటుంది. ఈ దఫా ఈ ప్రాంతంలో నాటు రకాలైన బంతి, చామంతిని సాగుచేసిన పూలరైతులు తీవ్ర నష్టాలబాటలో పయనిస్తున్నారు. బంతిపూలు కిలో రూ.4 కూడా పలకపోవడంతో కొనేవారు లేక పూలను రైతులు రోడ్డుపై పారబోస్తున్నారు. ఇదే సమయంలో చామంతిలో హైబ్రిడ్ రకాలైన సెంట్ రెడ్, ఎల్లో, వైట్, వైలట్ రకాలను సాగు చేసిన రైతులు లక్షాధికారులుగా మారుతున్నారు. ఇవి వారం రోజులైనా వాడకుండా ఉండడంతో, బొకేలకు, ఫంక్షన్ హాళ్ల అలంకరణకు వాడుతుండడంతో వీటికి మంచి డిమాండ్ ఉంది. దీంతో వీటి ధర ప్రస్తుతం కిలో రూ.వందకు పైమాటే. పూల రైతులు వారి పొలంలో కాస్త పెట్టుబడి ఎక్కువగా పెట్టి నాటీ రకాల బదులు డిమాండ్ ఎక్కువగా ఉన్న హైబ్రిడ్ రకాలను సాగుచేస్తే లాభాల పట్టేవారు. కానీ రైతులు అప్డేట్ కాకపోవడమే నష్టాలకు కారణమవుతోంది. లక్ష పెట్టుబడితో రూ.3 లక్షల లాభం హైబ్రిట్ రకాల పూల సాగు పంటకాలం నాలుగునెలలు. రెండో నెల నుంచే పూలు కోతకొచ్చి రెండునెలల పాటు కోతలు ఉంటాయి. ఎకరా పొలంలో 7 నుంచి 9వేల హైబ్రిడ్ రకాల సీడ్స్ అవసరం ఉంటుంది. ఒక్కో సీడ్ రూపాయిగా కర్ణాటకలోని తుముకూర్, తమిళనాడులోని రాయకోట నర్సరీలో వీటిని విక్రయిస్తున్నారు. ఎకరా పొలానికి పెట్టుబడిగా మల్చింగ్‌తో సహా రూ.లక్ష దాకా అవుతోంది. పంట బాగా వస్తే ఎకరానికి 30 టన్నుల ఉత్పత్తి ఉంటుంది. ప్రస్తుతం హైబ్రిడ్ రకాల పూల ధరలు కిలో రూ.100 వరకు ఉన్నాయి. ఈ లెక్కన 30 టన్నులకు రూ.3 లక్షలు వస్తుంది. అదే నాటి రకం పూలైతే.. నాటి రకమైన బంతి 70 రోజులకు కోతకొచ్చి ఆపై 40 రోజులు కటింగ్‌లు ఉంటాయి. అదే చామంతి అయితే 90 రోజులకు కోతకు వచ్చి ఆరునెలలు కటింగ్ ఉంటాయి. వీటి సాగు కోసం ఎకరా పొలంలో రైతు పంట పెట్టుబడిగా రూ.50వేలు పెట్టాలి. పంట దిగుబడి బాగా వస్తే పదిటన్నుల పూల ఉత్పత్తి ఉంటుంది. ఇప్పుడు ఉన్న ధర కిలో రూ.4తో రూ.40వేలు మాత్రమే దక్కుతుంది. దీంతో రైతుకు నష్టం తప్పదు. అందువల్ల రైతులు వారిపొలంలో నాటి రకాల పూలకు బదులు హైబ్రిడ్ రకాల పూలను సాగు చేసుకుంటే నికర లాభాలు రావడం తథ్యం.హైబ్రిడ్ పూల సాగులో లాభాలు.. పూలను సాగుచేసే రైతులు సంప్రదాయ రకాలైన బంతి, చామంతిని ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నారు. వీటికి ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అదే హైబ్రిడ్ రకాలైన కస్తూరి చాందిని రకాలైన సెంట్ రెడ్, వైట్, ఎల్లో, వైలట్ రకాలను సాగుచేసిన రైతులు లాభాల బాటలో ఉన్నారు. ఎందుకంటే ఈ రకం పూలు వారం రోజులైనా వాడకుండా ప్లాస్టిక్ పూలవలే వికసిస్తూ ఉంటాయి. వీటిని దూర ప్రాంతాలకు సైతం రవాణా చేసేందుకు వెలుసుబాటుగా ఉంటుంది. అదే నాటి రకాలు మూడురోజుల్లోనే వాడిపోతుంటాయి. దీంతో పూల వ్యాపారులు సైతం హైబ్రిడ్ రకాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ఈ రకం పూలను బొకేలకు సైతం ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉండడంతో ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.హైబ్రిడ్ రకాలనే సాగు చేయాలి నాటి రకాలైన బంతీ, చామంతిలను సాగుచేసినష్టాలు బాట పట్టాం. అందుకే తమిళనాడులోని రాయకోట నుంచి సెంట్ ఎల్లో, వైట్, రెడ్ రకాల హైబ్రిడ్ రకాల పూలను సాగుచేసి నికర లాభాలను పొందుతున్నాం. రైతులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ డిమాండ్ ఉన్న పూలను సాగుచేయడం అలవర్చుకోవాలి. అప్పుడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. – రవీంద్ర, పూలరైతు, కూర్మాయి గ్రామం, పలమనేరు మండలంఅవగాహన కల్పిస్తూనే ఉన్నాం..సంప్రదాయ రకాలైన బంతి పూలకు ఇప్పుడు కాలం చెల్లింది. వీటికి ఎప్పుడు ధరలుంటాయో తెలియని పరిస్థితి. అందువల్ల రైతులు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న హైబ్రిడ్ రకాల పూలను సాగు చేసుకోవడం మేలు. ఎందుకంటే అదే పొలంలో కాస్త ఎక్కువగా పెట్టుబడి పెట్టి నికరంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిపస్తూనే ఉన్నాం. – డా.కోటేశ్వర్రావు, సహాయ సంచాలకులు, ఉద్యానశాఖ -
టమాటాకు రక్షణ బంతి
తెల్లదోమ టమాటా పంటకు తీవ్రనష్టం కలిగిస్తుంటుంది. ఈ తెల్లదోమ ద్వారా వైరస్లు, మోల్డ్ వంటి తెగుళ్లు టమాటాకు సోకి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. అయితే, టొమాటా మొక్కల పక్కన బంతి మొక్కలు పెంచితే చాలు తెల్లదోమ బెడద తీరిపోతుందని పెద్దలు చెబుతుంటారు. బంతి మొక్క ఆకులు, పూల ద్వారా వెలువరించే వాసనలు తెల్లదోమను పారదోలుతుంటాయని కూడా మనకు తెలుసు. ఇంతకీ బంతి చెట్లు వెలువరించే వాసనల్లో ఏ రసాయనం ఉంది? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. దీనిపై గతంలో పెద్దగా అధ్యయనాలు జరగలేదు. ఇటీవల ఇంగ్లండ్‌లోని న్యూక్యాజిల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ నేచురల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో అధ్యయనం జరిగింది. లిమొనెనె అనే రసాయనాన్ని బంతి మొక్కలు గాలిలోకి వదులుతూ ఉంటాయని, ఈ వాసన తెల్లదోమకు నచ్చక దూరంగా వెళ్లిపోతాయని తేలింది. ఈ వాసన పీల్చిన తెల్లదోమలు చనిపోవు. దీని వల్ల టమాటాల నాణ్యత కూడా ఏ మాత్రం తగ్గడం లేదని గుర్తించారు. రసాయనిక పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఇదే తరహాలో తెల్లదోమను పారదోలే స్ప్రేను తయారు చేయడానికి అవకాశం ఉందా అన్న అంశంపై అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కొలిన్ టోష్, నియల్ కాన్బాయ్ దృష్టి సారిస్తున్నారు. బత్తాయి, నారింజ, నిమ్మ పండ్ల తొక్కల్లో కూడా లిమొనెనె పుష్కలంగా ఉంటుందట. ఉద్యాన తోటల్లో బంతి మొక్కలు వేసుకుంటే తేనెటీగలు కూడా వస్తాయి. ఉద్యాన తోటల సాగులో ఒకే రకం పంటను సాగు చేయడానికి బదులు.. కలిసి పెరుగుతూ పరస్పరం చీడపీడల నుంచి రక్షించుకునే రకరకాల పంటలను పక్క పక్కన నాటుకోవడం మేలన్న విషయాన్ని ఈ అధ్యయనం తేల్చిచెప్పడం విశేషం. -
బంతిపూల ‘సిరులు’
బంతి పూల సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. వరుస పండుగల నేపథ్యంలో డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పలుకుతున్నాయి. డీ.హీరేహాళ్ మండలం బాదనహాళ్ సమీపంలో రైతు బసవరాజు ఎకరా విస్తీర్ణంలో పూలు విరగకాశాయి. కోతకు 250 కిలోల నుంచి 300 కిలోల వరకు పూలదిగుబడి వస్తోంది. గత వినాయక చవితి నుంచి ఇప్పటిదాకా 15 కోతలు కోసినట్లు రైతు తెలిపాడు. గతంలో కిలో రూ.30 ప్రకారం అమ్ముడుపోయాయని, ప్రస్తుతం పొలంవద్దకే వచ్చి కిలో రూ.70కు కొనుగోలు చేస్తున్నారని చెప్పాడు. ఇప్పటిదాకా ఖర్చులుపోను లక్షరూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు వివరించాడు. దీపావళి వరకు పూలకు డిమాండ్ ఉంటుందని, మరో రూ.1.50 లక్షల వరకు ఆదాయం రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేశాడు.