బ్యాంకింగ్ దెబ్బ- మార్కెట్లు డీలా
ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ కౌంటర్లలో తలెత్తిన అమ్మకాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి సెన్సెక్స్ 143 పాయింట్లు క్షీణించి 36,594 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 10,768 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు డీలాపడటంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా మిడ్ సెషన్లో సెన్సెక్స్ 36,401 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే తొలుత 36,749 వద్ద గరిష్టానికీ చేరింది. ఈ బాటలో 10,764 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 10,819 వద్ద గరిష్టాన్ని తాకగా.. 10,713 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా గురువారం యూఎస్ మార్కెట్లు నీరసించాయి.
ఐటీ అక్కడక్కడే
ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ 2.5 శాతం స్థాయిలో వెనకడుగు వేసింది. మెటల్, ఆటో, మీడియా సైతం 0.7 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే ఫార్మా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ 0.7 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఐటీ 0.2 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, గెయిల్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫ్రాటెల్, టైటన్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ 3.2-2 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఆర్ఐఎల్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, బ్రిటానియా, ఎయిర్టెల్, టీసీఎస్, కోల్ ఇండియా, నెస్లే, పవర్‌గ్రిడ్ 3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి.
పీఎన్బీ డౌన్
డెరివేటివ్ కౌంటర్లలో పీఎన్బీ, టాటా పవర్, ఎంజీఎల్, కెనరా బ్యాంక్, యూబీఎల్, ఐసీఐసీఐ ప్రు, భారత్ ఫోర్జ్, ఆర్బీఎల్ బ్యాంక్, జూబిలెంట్ ఫుడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ 5.4-3.2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఐడియా, జిందాల్ స్టీల్, మైండ్‌ట్రీ, ఎస్బీఐ లైఫ్, బయోకాన్, హెచ్‌పీసీఎల్, ఐబీ హౌసింగ్ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1662 నష్టపోగా.. 1001 లాభపడ్డాయి.
డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 213 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 803 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 995 కోట్లు, డీఐఐలు రూ. 853 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. అయితే మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 830 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 784 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.