breaking news
bangaru palyam
-
జులై 9న చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి,తిరుపతి: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులకు ఆర్థిక కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆరుకాలం కష్టపడి పండించిన మామిడి పంటను కొనేవారు కరువవడంతో రైతు కంట కన్నీరు కారుతోంది. బరువెక్కిన హృదయంతో వెనుదిరిగి వెళుతున్న రైతులు ఈ ప్రభుత్వంలో బతకలేమని మామిడి చెట్లను నరికివేస్తున్నారు. ఈ క్రమంలో జులై 9న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తురు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ను సందర్శించనున్నారు. అక్కడ మామిడి రైతులను పరామర్శించనున్నట్లు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్లలో సాగు చేసిన మామిడి పంటను కొనేవారు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే పారబోస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే మామిడి రైతులు నష్టాలతో కుదేలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకుని, ప్రభుత్వ మెడలు వంచి గిట్టుబాటు రేటు కల్పించేందుకు వైఎస్ జగన్ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారని వెల్లడించారు. ఇంకా వారేమన్నారంటే..98 శాతం పల్ప్ ఫ్యాక్టరీలు టీడీపీకి చెందిన వారివే : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిరాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, పొగాకు, మిర్చి, పత్తి, మామిడి, చెరకు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లా మామిడిపంటకు ప్రసిద్దిగాంచింది. ఈ ప్రాంతంలో అనేక పల్ప్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పలు రాష్ట్రాలు, దేశాలకు కూడా ఎగుమతులు జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. జిల్లాలోని ప్రధాన మామిడి మార్కెట్ల వద్ద ఎక్కడ చూసినా మామిడి పంటతో కూడిన లారీలు, ట్రాక్టర్లే బారులు తీరి కనిపిస్తున్నాయి. రైతుల నుంచి పల్ప్ కొనుగోలు చేయాల్సిన ఫ్యాక్టరీలు గత ఏడాది ఉత్పత్తి చేసిన పల్ప్ నిల్వలే అధికంగా ఉండటం వల్ల ఈ ఏడాది మళ్ళీ పల్ప్ ఉత్పత్తి చేస్తే తమకు నష్టం వస్తుందని చెబుతున్నాయి. దీనిలో అధికశాతం పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోళ్ళు నిలిపివేశాయి. ఫలితంగా మార్కెట్లో మామిడి కొనేవారు లేక, రైతులు తెచ్చిన పంటను రోడ్ల మీద పారవేసి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ రైతులు ఇంత దారుణంగా నష్టపోలేదు. గతంలో మామిడికి రేటు పడిపోయినప్పుడు కోల్డ్ స్టోరేజీలను నిర్మించి, పల్ఫ్‌ను స్టోరేజీ చేసేందుకు సదుపాయాలు కల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. పైగా పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉందని పథకం ప్రకారం ఒక తప్పుడు ప్రచారాన్ని ఎల్లో మీడియా ద్వారా ప్రారంభించారు. ఈ జిల్లాలో 98 శాతం పల్ప్ ఫ్యాక్టరీలు తెలుగుదేశంకు చెందిన వారివే. వారికి చెందిన పల్ప్ ఫ్యాక్టరీలతో కొనుగోళ్లు చేయించలేక, ప్రతిదానికీ వైఎస్సార్సీపీపై నెపాన్ని నెట్టేయడం, ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. సమస్యను పరిష్కరించలేక, దానిపై ఎదురుదాడి చేయడం చంద్రబాబుకు అలవాటు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు, వారి పక్షనా పోరాడేందుకు జగన్ ఈ ప్రాంతంలో మామిడి మార్కెట్‌ను సందర్శించి, రైతులతో మాట్లాడనున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.దద్దమ్మ ప్రభుత్వమిది : భూమన కరుణాకర్రెడ్డికూటమి ఏడాది పాలన సందర్భంగా అబద్దాలతో పండుగలు చేసుకుంటున్న సీఎం చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కన్నీరు, వారి కష్టాలు కనిపించడం లేదు. మార్కెట్లో కేజీ రూ.2 లకు కూడా ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ తరుణంలో మద్దతుధరను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? గతంలో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిబడింది వైఎస్సార్, వైఎస్ జగన్.చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్లలో మామిడి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం తోటల్లోని మామిడిని కోయడం కూడా నష్టదాయకమేనంటూ రైతులు చెట్లమీదనే వదిలేస్తున్నారు. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి. కానీ చంద్రబాబు మాత్రం తనకు నిత్యం భజన చేసే ఈనాడు పత్రిక, టీవీ5 మీడియాల ద్వారా మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణమంటూ దిగజారుడు ప్రచారం చేయిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది ఎవరో కూడా వారికి తెలియదా? పల్ప్ ఫ్యాక్టరీలు గత ఏడాది నిల్వలను చూపి, కొత్తగా మామిడి కొనుగోళ్ళు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలో కూడా తెలియకుండా పాలన చేస్తున్నారా? తూతూ మంత్రంగా జిల్లా కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయించి, ప్రభుత్వం మద్దతుధర ఇస్తుంది, ఫ్యాక్టరీలు కేజీ రూ.4 కి కొనుగోలు చేయాలని చెప్పి వెళ్ళిపోయారు. అంతేకానీ ఫ్యాక్టరీలను ఒత్తిడి చేసి, పంటను కొనుగోలు చేయించడం లేదు. ఈ దారుణమైన పరిస్థితుల్లో రైతులు స్వచ్ఛందంగా రైతులు మామిడి తోటలను నరికేస్తున్నారు. గిట్టుబాటుధర కల్పించలేని దద్దమ ప్రభుత్వం చంద్రబాబుది. స్వయంగా మామిడి రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్‌కు రానున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
బంగారుపాళ్యం దొంగలకు సంకెళ్లు
బంగారుపాళ్యంలో సంచలనం కలిగించిన బంగారు నగల చోరీ కేసును చిత్తూరుకు కొత్తగా వచ్చిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ సవాలుగా తీసుకోవడంతో పోలీసులు ఎనిమిది రోజుల్లోనే ఛేదించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి దొంగల భరతం పట్టారు. రూ.1.62 కోట్ల విలువ చేసే 5.25 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైతే.. వారంలోనే నిందితులను పట్టుకోవడంతో పాటు 90 శాతం ఆభరణాలను రికవరీ చేసి శభాష్ అనిపించుకున్నారు. చిత్తూరు అర్బన్: బంగారుపాళ్యం వద్ద ఈనెల 8న జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసులో మహారాష్ట్రలోని ‘పరందా’ ముఠాకు చెందిన గుండిభా (35), శివాజీరామ డికులే (32), సతీష్ రామ్‌దాస్ సుఖేల్ (25), రాందాస్ గుర్రప్ప పవర్ (45), చగస్ గుండిభా సుఖాలే (42), అర్జున్ రమ జూదవ్ (40), రామారావు సుఖాలే (34)లను అరెస్టు చేసి బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో మీడియాకు ఎస్పీ వివరాలను వెల్లడించారు. వీరిపై మహారాష్ట్ర, విజయవాడలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. చోరీ జరిగిన తీరు.. భావేష్ అనే వ్యక్తి ముంబయ్‌లో పెద్ద బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతను చెన్నై, విజయవాడ, వైజాగ్‌లోని పలు దుకాణాలకు బంగారు ఆభరణాలను విక్రయిస్తుంటాడు. ఈనెల 7న తన సిబ్బంది కేదార్, సంజయ్ ద్వారా చెరో 8 కిలోల బంగారు ఆభరణాలను ఇచ్చి విజయవాడకు పంపించాడు. ఇక్కడ కొంత బంగారాన్ని విక్రయించిన వీరు, అదే రోజు విశాఖకు వెళ్లి అక్కడ మరికొన్ని ఆభరణాలు విక్రయించారు. మిగిలిన పది కిలోలకు పైగా బరువున్న బంగారు ఆభరణాలను కేదార్, సంజయ్ చెరో బ్యాగులో ఉంచుకుని విశాఖ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు వోల్వో బస్సు ఎక్కారు. ముంబయ్ మార్కెట్లలోని బంగారు దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించే పరందా ముఠా, భావేష్ దుకాణ సిబ్బందిని వెంబడిస్తూ వచ్చారు. విశాఖలో వీరితో పాటు ఇద్దరు ముఠా సభ్యులు బస్సు టికెట్లు బెంగళూరుకు బుక్ చేసుకోగా ముందరి సీట్లు వచ్చాయి. అక్కడి నుంచి కేదార్, సంజయ్ ఎక్కడైనా ఏమరుపాటుగా ఉంటారోనని గమనిస్తూ వచ్చిన దొంగలకు 8న ఉదయం ఆ అవకాశం బంగారుపాళ్యం వద్ద లభించింది. అప్పటికే తిరుపతిలో 12, చిత్తూరులో 2 సీట్లు ఖాళీ అవడంతో దొంగలు వెనుకవైపు కూర్చున్నారు. బస్సు బంగారుపాళ్యం సమీపంలోని ఫుడ్‌ప్లాజా వద్ద ఆగింది. బ్యాగులో ఉన్న ఆభరణాలు భద్రమని చెప్పి కేదార్ కిందకు దిగడం, నిద్రమత్తులో ఉన్న సంజయ్ దుప్పటి కప్పుకోవడంతో వెనుకనే ఉన్న దొంగలు బ్యాగును తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా బస్సు దిగేశారు. అప్పటికే విశాఖ నుంచి స్కార్పియోలో బస్సును అనుసరిస్తున్న పరందా ముఠా, బంగారుపాళ్యంలో తమ సహచరులను ఎక్కించుకుని వాహనంలో తిరుపతికి వచ్చేశారు. తిరుపతిలోని శ్రీనివాసం వద్ద తొమ్మిది మంది ముఠా సభ్యులు ఆభరణాలు పంచుకుని అటునుంచి కడప మీదుగా ముంబయ్ పారిపోయారు. చోరీ జరిగిన మరుసటి రోజు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శభాష్ పోలీసులు మరోవైపు ఈ కేసు ఛేదనలో కృషి చేసిన పలమనేరు ఇన్చార్జ్ డీఎస్పీ ఎన్టివి.రామ్‌కుమార్, పలమనేరు రూరల్ సీఐ శ్రీనివాస్, బంగారుపాళ్యం, పంజాణి, గంగవరం, గుడిపాల ఎస్ఐలతో పాటు సిబ్బంది దేవరాజులురెడ్డి తదితరులకు ఎస్పీ నగదు రివార్డులు అందచేసి ప్రత్యేకంగా అభినందించారు. పట్టుబడింది ఇలా... తొలుత చోరీలో కేదార్, సంజయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. తీరా సీసీ ఫుటేజీలు పరిశీలించడంతో ఓ ముఠా స్కార్పియో వాహనంలో వెంబడిస్తుండటాన్ని గుర్తించి చోరీ జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ తరహా ఘటనలు మరెక్కడైనా జరిగాయా? అని ఆరా తీశారు. విజయవాడలో ఏడాదిన్నర క్రితం 9 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురవడాన్ని గుర్తించి అక్కడ అరెస్టయి బెయిల్‌పై వెళ్లిన నిందితులపై ఖాకీలు దృష్టి సారించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు మహారాష్ట్రలో తన బ్యాచ్‌మేట్స్ ఉండటంతో దొంగల ఫొటోలు పంపడంతో పాటు చిత్తూరు నుంచి 50 మంది అధికారులు, సిబ్బందిని ముంబయ్, విజయవాడ, విశాఖ, అహ్మద్‌నగర్, ఔరంగాబాద్, పుణే ప్రాంతాలకు పంపించారు. నిందితులను పట్టుకోవడానికి గాలింపు ముమ్మరం చేశారు. తీరా పరందా అనే గ్రామానికి చెందిన తొమ్మిది మంది ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి, పెద్దపంజాణి వద్ద నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.35 కోట్ల విలువ చేసే 4.372 గ్రాముల ఆభరణాలు, ఓ స్కార్పియో వాహనం సీజ్ చేశారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందని, త్వరలోనే వీరి నుంచి బంగారు రికవరీ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. -
ఇన్నోవా-లారీ ఢీ: ముగ్గురి మృతి
చిత్తూరు: బంగారుపాల్యం మండలం మొగిలి ఘాట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఇన్నోవా, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులు కర్ణాటకకు చెందిన నరేష్, సురేష్, నయిల్గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.