బైరా చేరికతో వైఎస్సార్ సీపీ బలోపేతం
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: విలువలు గల నాయకులు, తెలివిగల ప్రజలు ఉంటే ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి చెప్పారు. హైకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బైరా వెంకటకృష్ణ శుక్రవారం నియోజకవర్గంలోని వేలాది మంది అనుచరులతో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సభలో పార్టీ లో చేరిన వెంకటకృష్ణ అనుచరులను సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ముఖ్యఅతిథి అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ బైరా వెంకటకృష్ణ చేరికతో పార్టీలో నూతన ఉత్సాహం ఏర్పడిందన్నారు. నీతి, నిజాయితీ, కొత్త ఆలోచనలు, రాజకీయాల్లో అత్యంత అవసరమని తెలిపారు.
పార్టీలో చేరిన బైరా వెంకటకృష్ణ అనుచరులు రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ బైరా వెంకటకృష్ణ చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. అతి తక్కువ కాలంలో నియోజకవర్గంలోని వేలాదిమంది అభిమానాన్ని పొందడం విశేషమన్నారు. బైరా వెంకటకృష్ణ మాట్లాడుతూ దివంగత నేత సోమేపల్లి సాంబయ్య అడుగుజాడల్లో విలువలతో కూడిన రాజకీయాలు నడుపుతున్న మర్రి రాజశేఖర్‌ను తాను మొదటి నుంచి అభిమానిస్తున్నట్లు చెప్పారు.
వంగవీటి మోహనరంగా ఆశయాలకు అనుగుణంగా అనేకమంది ఆయన వారసులు వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్నారని, వారితో పాటే తాను పార్టీలో చేరినట్లు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో న్యాయవాదులు రోశిరెడ్డి, సుధాకరరెడ్డి, సతీష్‌కుమార్, వినోద్‌కుమార్, ఎంవీ కృష్ణ, సంఘమిత్ర, కాలేషావలి, నాగేంద్రబాబు, టి.శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గుమ్మా పెద్దిరాజు, కె భూషణం, కేఎస్ఆర్ బుల్లి, షుకూర్, మస్తాన్‌వలి, బుక్కాపురం సర్పంచి శ్రీనివాసరావు, ఉపసర్పంచి వెంకటకృష్ణ, కట్టుబడివారిపాలెం వార్డు సభ్యులు శ్రీనివాసరావు, రాంబాబు, శ్రీను, గంగన్నపాలెంకు చెందిన బ్రహ్మం, వివిధ గ్రామాలకు చెందిన వేలాది మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ ఏవీఎం సుభానీ, యడ్లపాడు మండల కన్వీనర్ చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు విడదల కమలేంద్ర, న్యాయవాది తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన కార్యకర్తలు.. బైరా వెంకటకృష్ణ నివాసం పురుషోత్తమపట్నం నుంచి వేలాదిమందితో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో పురుషోత్తమపట్నం నుంచి గడియారస్తంభం, కళామందిర్‌సెంటర్, చౌత్రా సెంటర్, ఎన్ఆర్టీ సెంటర్ల మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పట్టణంలో ఎటుచూసినా ర్యాలీతో జనసంద్రంగా మారింది. చిలకలూరిపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.ప్రశాంతి పురు షోత్తమపట్నంకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ వెంకటరావు, భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.