breaking news
baddebt
-
ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్..రూ. 51,424 కోట్లు మొండి బాకీలు వసూలు!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 180 దివాలా పరిష్కార ప్రణాళికలకు ఆమోదముద్ర వేసింది. ఇంత అత్యధిక సంఖ్యలో ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించడం ఇప్పటివరకూ ప్రథమం. దీనితో మొత్తం రూ. 51,424 కోట్ల మొండి బాకీలు వసూలయ్యాయి. చివరిసారిగా 2019 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 1.11 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రావడం ఇదే తొలిసారి. అప్పట్లో 77 ప్రణాళికలకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. వీటిలో ఎస్సార్ స్టీల్, మోనెట్ ఇస్పాత్ వంటి భారీ ప్రతిపాదనలు ఉన్నాయి. తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో ఎన్సీఎల్టీ 1,255 దివాలా ప్రక్రియ దరఖాస్తులను విచారణకు స్వీకరించింది. రూ. 1,42,543 కోట్లకు క్లెయిమ్‌లు రాగా అందులో 36 శాతం సొమ్మును రుణదాతలకు పొందగలిగారు. దివాలా బోర్డు ఐబీబీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ►2023 ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకూ ఎన్సీఎల్టీ 678 ప్రణాళికలను క్లియర్ చేసింది. రుణదాతలు రూ. 2.86 లక్షల కోట్లు రాబట్టుకోగలిగారు. ►ఎన్సీఎల్టీకి దేసవ్యాప్తంగా 31 బెంచ్‌లు ఉండగా, వాటిలో 28 పనిచేస్తున్నాయి. ట్రిబ్యునల్‌లో న్యాయమూర్తులు, సహాయక సిబ్బంది కొరత ఉంది. ప్రెసిడెంట్ సహా 63 మంది జ్యుడిషియల్, టెక్నికల్ సిబ్బందిని మంజూరు చేయగా ప్రస్తుతం 37 మందే ఉన్నారు. గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం 15 మంది సిబ్బందిని నియమించింది. ఎన్సీఎల్టీ బెంచ్ పనిచేయాలంటే కనీసం ఒక జ్యుడిషియల్, ఒక టెక్నికల్ సభ్యులు ఉండాలి. ►ఎన్సీఎల్టీ బెంచ్‌లు ఇప్పటివరకు 6,567 కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రణాళికలను (సీఐఆర్‌పీ) పరిశీలించగా వాటిలో 4,515 సీఐఆర్పీలపై విచారణ ముగిసింది. ► తయారీ, రియల్ ఎస్టేట్ రంగాల సంస్థలు అత్యధికంగా సీఐఆర్పీపరమైన ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. మొత్తం కేసుల్లో తయారీ రంగ వాటా 39 శాతం, రియల్ ఎస్టేట్ 21 శాతం, నిర్మాణ రంగం 11 శాతం, హోల్‌సేల్..రిటైల్ ట్రేడ్ వాటా 10 శాతంగా ఉంది. ►నిర్దేశిత గరిష్ట గడువు 330 రోజుల్లోగా తగిన కొనుగోలుదారు ఎవరూ ముందుకు రాకపోవడంతో 76 శాతం పైగా కేసులు లిక్విడేషన్‌కు దారి తీశాయి. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
శోభనాద్రిపురం (రామన్నపేట) : అప్పులబాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శోభనాద్రిపురంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాసుల భిక్షం (55) తనకున్న రెండెకరాల పొలంతో పాటు, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని కొంతకాలంగా వరిని సాగుచేస్తున్నాడు. పెట్టుబడులు, కౌలు చెల్లించేందుకుగాను సీసీ బ్యాంకుతో పాటు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద కూడా అప్పులు చేశాడు. ఆ అప్పులను ఎలా తీర్చలని కొద్ది రోజులుగా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. తీవ్ర మనోవేధనతో ఉన్న భిక్షం ఎప్పటిలాగే ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్ద వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటి ఆయన నోటి నుంచి నురుగులు రావడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్‌లో రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడని తెలిపారు. మృతుడి కుమారుడు కాసుల ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్యారసాని శీనయ్య తెలిపారు. కాగా, మృతుడికి భార్య సావిత్రమ్మతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి... అప్పులబాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కాసుల భిక్షం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకుడు మేక అశోక్‌రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య కోరారు. ఏరియా ఆస్పత్రిలో ఉన్న భిక్షం మృతదేహాన్ని వారు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని కోరారు. వారి వెంట పబ్బతి లింగయ్య, కాసుల సైదులు, గోగు లింగస్వామి, ముక్కాముల మల్లేశం ఉన్నారు.