breaking news
avuku tunnel contractor
-
అసాధ్యం నేడు సుసాధ్యం
సాక్షి, అమరావతి: గత పాలకులు అసాధ్యమని వదిలేసిన పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా సుసాధ్యం చేస్తోంది. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు సొరంగం పనులు ఇందుకు తార్కాణం. బలహీనమైన మట్టిపొరలు పనులకు అడ్డంకిగా మారాయనే సాకుతో మిగిలిన 165 మీటర్ల పొడవున సొరంగాన్ని తవ్వలేక గత సర్కార్ చేతులెత్తేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిమాలయాల్లో సొరంగాలు తవ్వడానికి ఉపయోగిస్తున్న పోర్ ఫిల్లింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మట్టిపొరలు పడిపోయిన ప్రాంతంలో సొరంగాన్ని తవ్వడం ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేస్తోంది. వైఎస్సార్ హయాంలోనే సింహభాగం పనులు.. శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీలను తరలించడం ద్వారా వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్ఎంసీ) నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు తరలించేలా కాలువ తవ్వే క్రమంలో అవుకు వద్ద 6 కి.మీ. పొడవున జంట సొరంగాల (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యం)ను తవ్వాలి. ఇందులో 5.835 కి.మీ. పొడవున సొరంగాల తవ్వకం పనులను 2009 నాటికే పూర్తి చేశారు. రెండు సొరంగాల్లోనూ 165 మీటర్ల మేర మాత్రమే పనులు మిగిలాయి. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ సొరంగాల్లో మిగిలిన పనులను పూర్తి చేయలేక చేతులెత్తేసింది. చివరకు ఒక సొరంగంలో బలహీన పొరలు ఉన్న ప్రాంతం నుంచి కాలువ(లూప్) తవ్వి చేతులు దులుపుకొంది. హిమాచల్ నుంచి నిపుణులు.. అవుకు సొరంగాన్ని పూర్తి చేయడం ద్వారా వచ్చే సీజన్లో ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి ద్వారా తరలించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనాన్ని ఉపయోగించడం ద్వారా సొరంగాన్ని పూర్తి చేయడంపై కర్నూలు ప్రాజెక్టŠస్ సీఈ మురళీనాథ్‌రెడ్డి దృష్టి సారించారు. హిమాలయాల్లో సొరంగాలను తవ్వడంలో ఉపయోగించే ‘పోర్ ఫిల్లింగ్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవుకు సొరంగంలో వినియోగించాలని నిర్ణయించారు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి నిపుణులను రప్పించి పనులను ప్రారంభించారు. పోర్ ఫిల్లింగ్ పరిజ్ఞానంతో పనులు ఇలా.. సొరంగంలో మట్టిపొరలు బలహీనంగా ఉండి పడిపోయిన ప్రాంతంలోకి పైపులను చొప్పిస్తారు. వాటి ద్వారా పాలీయురిథిన్ ఫోమ్‌ను అధిక ఒత్తిడితో పంపుతారు. ఈ ఫోమ్ మట్టిపొరల్లోకి చేరడంతో పొరలు పటిష్టవంతమవుతాయి. భవిష్యత్‌లో కూడా మట్టిపొరలు పడిపోకుండా ఇనుపచువ్వల (సెల్ఫ్ డ్రిల్లింగ్ యాంకర్ బోల్ట్స్)ను దించుతారు. దీంతో బలహీనంగా ఉన్న మట్టిపొర కాంక్రీట్ దిమ్మె తరహాలో పటిష్టంగా మారుతుంది. ఆ తర్వాత సొరంగాన్ని తవ్వుతారు. అవుకు సొరంగంలో గత సర్కార్ అసాధ్యమని వదిలేసిన పనులను ఈ విధానంలో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన 2.5 మీటర్ల పని విజయవంతంగా పూర్తయింది. దీంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. వచ్చే సీజన్లో గాలేరు–నగరి ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేయనున్నారు. -
అ‘ధనం’పై పట్టువీడని మంత్రి
‘అవుకు’ కాంట్రాక్టర్‌కు అదనపు సొమ్ము చెల్లింపు దిశగా మళ్లీ చర్యలు రూ. 44 కోట్లు అప్పనంగా ఇచ్చేయడానికి దారులు వెతుకుతున్న మంత్రి? సాక్షి, హైదరాబాద్: ఇరిగేషన్లో ఓ ఫైలు ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించినా కేబినెట్ ఆమోదం పొంది ఉత్తర్వులు కూడా జారీ అయిపోవడాన్ని మనం చూశాం. అదే శాఖలో అలాంటిదే మరో ఉదంతమిది. అవుకు సొరంగం పనుల్లో అదనపు చెల్లింపుల వ్యవహారం స్టాండింగ్ కమిటీ ముందుకు పదేపదే వస్తున్నది. ఒకసారి కూడదు అని సిఫార్సు చేసినా మరలా అదే కమిటీకి పరిశీలన నిమిత్తం జలవనరుల శాఖ ఎందుకు పంపుతోంది అనేది గ్రహించడానికి ఎక్కువ శ్రమించనక్కరలేదు. అందులో ఎందరో ‘ప్రయోజనాలు’ ఇమిడి ఉంటాయి మరి.. ఆ సంగతేమిటో చూద్దామా.. కర్నూలు జిల్లాలోని అవుకు సొరంగంలో అవినీతి ప్రవహించాల్సిందేనని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పట్టుబడుతున్నారని ఆ శాఖలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్లు అదనంగా చెల్లించే దిశగా పావులు కదుపుతుండడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు. అవుకు సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు అదనపు చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం కావడాన్ని తప్పుబడుతూ అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే. అదనపు చెల్లింపులు అంశంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాలంటూ సీఎం రమేష్ రాసిన లేఖను రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ)కి ప్రభుత్వం నేవిదించింది. అదనంగా కాంక్రీట్ పనులు చేసినా ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్) పరిమాణం కంటే పెరగనందున.. అదనంగా చెల్లించడానికి నిబంధనలు అంగీకరించవని, చెల్లించాలనుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఎస్ఎల్ఎస్సీ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎస్ఎల్ఎస్సీ సిఫారసుతో సంతృప్తి చెందని మంత్రి.. ఏదో విధంగా చెల్లింపులు చేయడానికి దారులు వెతికారు. అడ్డదారిలో చెల్లిస్తే అవినీతి బయటపడుతుందని జంకినట్లు సాగునీటి శాఖ అధికార వర్గాల సమాచారం. దాంతో ఎస్ఎల్ఎస్సీకి మరోసారి ఇదే అంశాన్ని నివేదించాలని నిర్ణయించారు. ఈసారి సానుకూలంగా సిఫారసు వచ్చే విధంగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఎస్ఎల్ఎస్సీ సిఫారసు మేరకే అదనపు చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకోవడానికి వీలు ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. రూ. 44 కోట్లు అదనం గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) వరద కాల్వ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా రూ. 401 కోట్ల విలువైన అవుకు టన్నెల్-2 పనిని ప్యాకేజీ 30 కింద ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో ఎన్సీసీ-మేటాస్ జాయింట్‌వెంచర్‌కు 2007లో ప్రభుత్వం అప్పగించింది. సొరంగం తవ్వకంలో ఎలాంటి ప్రతికూల అంశాలు, ప్రతిబంధకాలు ఎదురైనా పూర్తి బాధ్యత తీసుకొని పని పూర్తి చేస్తామని ప్రభుత్వానికి కాంట్రాక్టర్ అండర్ టేకింగ్ కూడా ఇచ్చారు. ఒప్పందంలో ఉన్న దానికంటే 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అదనంగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, దానికి ఒప్పంద విలువ కంటే రూ. 44 కోట్లు అదనంగా చెల్లించాలని కాంట్రాక్టర్‌ను ప్రభుత్వాన్ని కోరితే.. ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమయింది. సాధారణంగా ఈపీసీ విధానంలో అదనపు చెల్లింపులకు అవకాశం లేదు. ఇదే విషయాన్ని.. నిబంధనలకు విరుద్ధంగా అదనపు చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమయిందని పేర్కొంటూ అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే. అధికార పార్టీ ఎంపీ రాసిన లేఖ బయటకు పొక్కిన నేపథ్యంలోనే గత ఏడాది ఈ అంశాన్ని ప్రభుత్వం ఎస్ఎల్ఎస్సీకి నివేదించింది. ప్రభుత్వం ఆశించినట్లుగా కాకుండా, భిన్నంగా సిఫారసు రావడంతో, కొంతకాలం ఆగి మళ్లీ ఇప్పుడు తాజాగా రెండోసారి ఎస్ఎల్ఎస్సీకి నివేదించడం గమనార్హం.