ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
                  
	
		మూడు నెలల తరువాత వెలుగు చూసిన హత్యోదంతం

	కోలారు : వివాహేతర సంబంధం కొనసాగించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది.  ఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఈ హత్యోదంతం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు..విజయపుర తాలూకా గురప్పనమఠ ప్రాంతానికి చెందిన హరీష్ (29)కు సవిత (25)అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. వీరు విజయపురం సమీపంలోని భట్రేనహళ్లి వద్ద నివాసం ఉండేవారు.
	
	వివాహానికి ముందే సవితకు సునీల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది.  వివాహం తర్వాత కూడా దాన్ని కొనసాగించింది. విషయం తెలిసి భర్త నిత్యం గొడవ పడేవాడు. దీంతో సవిత ప్రియుడుతో కలిసి వెళ్లిపోగా మనో వేదనకు గురైన హరీష్ ఆత్యహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. తర్వాత పెద్దలు కల్పించుకొని సవితను కాపురానికి పంపారు. అయినప్పటికీ సవిత నడవడికలో మార్పు రాలేదు.
	
	ఈక్రమంలో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన సవిత సునీల్‌తో కలిసి పథకం రచించింది. అందులో భాగంగా హరీష్‌తో స్నేహంగా ఉండాలని సునీల్‌కు సూచించింది. అదే సమయంలో హరీష్‌కు డబ్బు అవసరం కాగా భార్య సలహాతో సునీల్‌ను ఆశ్రయించాడు. కేబి హొసహళ్లిలో డబ్బు ఇస్తానని  హరీష్‌ను సునీల్ గత ఏప్రిల్ 7న ఆ గ్రామానికి తీసుకెళ్లాడు.  అదే రోజు హరీష్‌ను గ్రామ సమీపంలోని చెరువువద్దకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో తూగుతున్న సమయంలో గొంతు, ఎద భాగంలో సునీల్ కత్తితో పొడిచి హత్య చేశాడు.  
	
	అనంతరం మృతదేహాన్ని వంద మీటర్ల దూరంలోని నీటికుంట వద్దకు తీసుకెళ్లి మృతదేహానికి రాళ్లు కట్టి నీటిలోకి తోసేశాడు. ఆ తర్వాత సవిత తన భర్త కనిపించలేదని విజయపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు  చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సునీల్‌ను అదుపులోకి విచారణ చేపట్టడంతో హత్యోదంతం వెలుగు చూసింది.  
	
	సునీల్ ఇచ్చిన సమాచారంతో బుధవారం ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు తహశీల్దార్ సమక్షంలో హరీష్ మృతదేహాన్ని వెలికి తీసి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు.  ఘటనా స్థలాన్ని దొడ్డబళ్లాపురం డీవైఎస్పీ కోనప్పరెడ్డి, విజయపుర సీఐ మహేష్‌కుమార్, వేమగల్ ఎస్ఐ యశ్వంత్ పరిశీలించారు. నిందితులు సవిత, సునీల్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.