breaking news
Assocham-PWC report
-
ఓటీటీ దిగ్గజంగా భారత్
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ దేశీ వీడియో ఓవర్ ది టాప్ (ఓటీటీ) మార్కెట్ 2022 నాటికి అంతర్జాతీయంగా టాప్ 10 మార్కెట్లలో ఒకటిగా ఎదగనుంది. అప్పటికి భారత వీడియో ఓటీటీ మార్కెట్ పరిమాణం 823 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5,363 కోట్లు) చేరనుంది. పరిశ్రమల సమాఖ్య అసోచాం, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘భారత వీడియో ఓటీటీ మార్కెట్ ప్రస్తుతం శైశవ దశలో ఉంది. అంతర్జాతీయంగా ఈ మార్కెట్ వృద్ధి బాటలో సాగుతోంది. 2017–2022 మధ్య కాలంలో ఈ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 22.6% వృద్ధి నమోదు చేయనుంది. ఇదే వ్యవధిలో 10.1 శాతం వృద్ధితో అంతర్జాతీయ వీడియో ఓటీటీ మార్కెట్లకు సంబంధించి టాప్ 10లో ఒకటిగా నిలుస్తుంది‘ అని నివేదిక పేర్కొంది. దేశీయంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఓటీటీ సేవలు అందిస్తున్నాయి. పలు అంశాల ఊతం.. దేశీయంగా ఓటీటీ మార్కెట్ వృద్ధికి పలు అంశాలు దోహదపడనున్నాయి. నిరంతరాయ కనెక్టివిటీ, కంటెంట్ వినియోగానికి మొబైల్ సాధనాలను ఎక్కువగా ఉపయోగించడం పెరుగుతుండటం, కస్టమరు వ్యక్తిగత అభిరుచులకు అనుగుణమైన కంటెంట్‌ను అందించే వీలు ఉండటం మొదలైనవి వీటిలో ఉన్నాయి. మరోవైపు 2022 నాటికి స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య 12.9% వార్షిక వృద్ధి రేటుతో 85.9 కోట్లకు చేరుతుందనేది నివేదిక అంచనా. 2017లో వీరి సంఖ్య 46.8 కోట్లు. వీవోడీకు స్మార్ట్‌ఫోన్స్ తోడ్పాటు.. డేటా టారిఫ్‌లు భారీగా తగ్గిపోవడం, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుతుండటంతో ప్రధానంగా వీడియో ఆన్ డిమాండ్ (వీవోడీ) మార్కెట్‌కు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ‘భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆన్లైన్ వీడియోలను వీక్షించేందుకు అనువైన డివైజ్‌ల లభ్యత పెరుగుతుండటం వీవోడీ పరిశ్రమకు తోడ్పడుతుంది. కంటెంట్ వినియోగం ఎక్కువగా స్మార్ట్‌ఫోన్స్‌తోనే జరుగుతోంది‘ అని నివేదిక వివరించింది. స్మార్ట్ ఫోన్స్ కాకుండా ట్యాబ్లెట్స్ కూడా వీవోడీ పరిశ్రమకు కీలకంగా మారుతున్నాయి. స్మార్ట్ఫోన్స్తో పోలిస్తే హెచ్డీ కంటెంట్ చూడటానికి ట్యాబ్లెట్స్ అనువుగా ఉంటాయని అసోచాం–పీడబ్ల్యూసీ అధ్యయనం తెలిపింది. వినోద, మీడియా పరిశ్రమలో టీవీ అతి పెద్ద ప్రధాన విభాగమని, భవిష్యత్‌లోనూ అలాగే కొనసాగుతుందని వివరించింది. 2017–2022 మధ్య కాలంలో భారత టెలివిజన్ పరిశ్రమ 10.6 శాతం వార్షిక వృద్ధితో 13.3 బిలియన్ డాలర్ల నుంచి 22 బిలియన్ డాలర్లకు చెందుతుందని నివేదిక పేర్కొంది. ఇదే వ్యవధిలో అంతర్జాతీయంగా టీవీ పరిశ్రమ వృద్ధి సగటు అత్యంత తక్కువగా 1.4 శాతంగా మాత్రమే ఉండగలదని వివరించింది. ‘కంటెంట్ పరిశ్రమలో పెను మార్పులు వస్తున్నప్పటికీ భారత్‌లో సంప్రదాయ వినోద సాధనాల ఆధిపత్యమే కొనసాగుతుందని దీన్ని బట్టి తెలుస్తోంది. అత్యం త చౌకగా కంటెంట్‌ను వినియోగించుకోవడానికి అనువైన సాధనాల్లో టీవీ ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో వినోదానికి ఇదే ప్రధాన వనరుగా ఉంటోంది‘‡అని నివేదిక వివరించింది. 50 కోట్లకు ఆన్లైన్ వీడియో వీక్షకులు: గూగుల్ 2020 నాటికి భారత్‌లో ఆన్లైన్ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 50 కోట్లకు చేరుతుందని టెక్ దిగ్గజం గూగుల్ ఒక నివేదికలో వెల్లడించింది. భారతీయ వినియోగదారులు సమాచారాన్ని సేకరించుకోవడాన్ని, కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆన్లైన్ వీడియోలు గణనీయంగా మారుస్తున్నాయని వివరించింది. భారతీయులు సెర్చి చేసే కంటెంట్‌పై బ్రాండ్స్‌కు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి రూపొందించిన నివేదిక ప్రకారం.. ఆన్లైన్ వీడియో సెర్చిలో మూడింట ఒక వంతు వినోద సంబంధమైనవే అంశాలే ఉంటున్నాయి. లైఫ్ స్టయిల్, విద్య, వ్యాపారం వంటి అంశాలు గత రెండేళ్లలో 1.5 నుంచి 3 రెట్లు దాకా వృద్ధి నమోదు చేశాయి. కార్ల కొనుగోళ్ల నిర్ణయాలను ఆన్లైన్ వీడియో గణనీయంగా ప్రభావితం చేస్తోంది. కొనుగోలు చేసే కారుపై అధ్యయనం చేసేందుకు కార్ల కొనుగోలుదారుల్లో 80 శాతం మంది ఇదే మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి పది మంది కొత్త ఇంటర్నెట్ యూజర్లలో తొమ్మిది మంది భారతీయ ప్రాంతీయ భాషా కంటెంట్‌ను ఉపయోగిస్తున్నారు. గూగుల్ నివేదికలోని మరికొన్ని విశేషాలు.. ► ఏటా 4 కోట్ల మంది భారతీయులు కొత్తగా ఇంటర్నెట్ వినియోగదారులుగా మారుతు న్నారు. ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి భారత్‌లోనే ఉంటోంది. ► దేశీయంగా ప్రతీ యూజరు సగటున నెలకు 8 జీబీ మొబైల్ డేటాను వినియోగిస్తున్నారు. సంపన్న దేశాల్లో వినియోగానికి ఇది సరిసమానం. ► ఆన్లైన్ సెర్చి విషయంలో ప్రస్తుతం మెట్రోయేతర ప్రాంతాలు .. మెట్రో నగరాలను మించుతున్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా బీమా, సౌందర్యం, పర్యాటకం వంటి అంశాల గురించి సమాచారం కోసం సెర్చి చేస్తున్నారు. గూగుల్ ప్లాట్‌ఫాంపై నమోదయ్యే బ్యాంకింగ్, ఆర్థిక, బీమా సేవలకు సంబంధించిన సమాచార సేకరణలో 61 శాతం భాగం మెట్రోయేతర ప్రాంతాల నుంచే ఉంటోంది. వాహనాలకు సంబంధించి ఇది 55 శాతంగా ఉంది. -
ఆన్లైన్లో సగటు కొనుగోళ్లు రూ.10 వేలు!
2015లో ఒక్కో కస్టమర్ చేయనున్న వ్యయం ఇది.. ఈ ఏడాది సగటు ఖర్చు రూ.6 వేలు అసోచాం-పీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ-కామర్స్ రంగం దూసుకుపోతోంది. వచ్చే ఏడాది వివిధ ఉత్పత్తుల కోసం భారతీయ ఆన్లైన్ కస్టమర్ సగటున రూ.10 వేలు ఖర్చుచేయనున్నట్లు అసోచాం-పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ షాపర్ల ఈ ఏడాది సగటు వ్యయం రూ.6 వేలుగా లెక్కగట్టింది. భారత్‌లో ఆన్లైన్ మార్కెట్ హవా ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ అంకెలే నిదర్శనం. దేశంలో ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం రూ.24,000 కోట్లుంది. నివేదిక ప్రకారం.. ఆన్లైన్లో 2014లో సుమారు 4 కోట్ల మంది కస్టమర్లు పలు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మెరుగైన రవాణా, బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ సౌకర్యమున్న మొబైల్స్ విస్తృతి కారణంగా కస్టమర్ల సంఖ్య 2015లో 6.5 కోట్లకు ఎగబాకుతుంది. మొత్తం ఈ-కామర్స్ మార్కెట్ రూ.1.02 లక్షల కోట్లుంది. 35% వార్షిక వృద్ధి రేటుతో అయిదేళ్లలో వ్యాపార పరిమాణం రూ.6 లక్షల కోట్లకు చేరుతుంది. మొబైల్స్ హవా.. ఆన్లైన్ రిటైల్ వ్యాపారంలో దుస్తులు అగ్రస్థానాన్ని కొనసాగిస్తాయి. దుస్తులతోపాటు కంప్యూటర్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలు మార్కెట్ వృద్ధికి దోహదం చేయనున్నాయి. యాక్సెసరీస్‌తో కలిపి వీటి వాటా ప్రస్తుతం 39 శాతముంది. 2015లో 42 శాతానికి చేరనుంది. ఇక స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ కొనుగోలుదారులు ఈ-రిటైల్ వృద్ధికి కీలకం కానున్నారు. ఇప్పటికే మొబైల్ ఫోన్ల వాటా 11 శాతముంది. 2017 నాటికి 25 శాతానికి చేరనుందని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. అజీమ్ ప్రేమ్‌జీ, రతన్ టాటా వంటి ప్రముఖ ఇన్వెస్టర్లను పరిశ్రమ ఆకట్టుకుందని అన్నారు. దేశంలో అమెజాన్ వంటి అంతర్జాతీయ కంపెనీల కంటే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు తమ హవాను కొనసాగిస్తున్నాయి. ట్రావెల్ వాటా 75 శాతం.. ట్రావెల్, టూరిజం వ్యాపారంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌లో మొత్తం ట్రావెల్ సంబంధ వ్యాపారంలో 75 శాతం ఈ-కామర్స్ వేదికగా జరుగుతోంది. కాగా, దేశంలో ఇంటర్నెట్ వినియోగదార్లలో మూడింట ఒక వంతు ఆన్లైన్ కొనుగోళ్లు జరుపుతున్నారు. తొలిసారి ఆన్లైన్ కొనుగోలుదార్ల కంటే పాత కస్టమర్లు అధికంగా వ్యయం చేస్తున్నారట. ఈ-టైలింగ్లో గిడ్డంగుల నిర్వహణ, సరుకు రవాణాలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రెండు విభాగాల్లోనే 2017-20 నాటికి ఒక లక్ష మంది అదనంగా అవసరమని అంచనా.