breaking news
Asha Kumari
-
మనిషి కుక్కని కరిస్తే...
జీవన కాలమ్ అధికారం తలకెక్కినప్పటి కుసంస్కారం ఇది. ఒక్కక్షణంలో గతం మసకబారుతుంది. తాము ప్రత్యేకమైన పదార్థంతో మలిచిన మహానుభావులమనే భావం ఆకాశంలో నడిపిస్తుంది. కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు. మనిషి కుక్కని కరిస్తే అది వార్త అన్నారెవరో. ఈ మధ్య ఓ సరదా అయిన సంఘటన సిమ్లాలో జరిగింది. రాహుల్‌గాంధీగారు ఎన్నికల ఫలితాల మీద జరిపే సమీక్షా సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగుగారి మేనకోడలు– ఈ మధ్యనే తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆషాకుమారి సభకి వచ్చారు. ఆమెని ఓ మహిళా కానిస్టేబుల్ ఆపారు. వాగ్వాదం పెరిగింది. అవతల కాంగ్రెసు మీటింగు జరిగిపోతోంది. ఎమ్మెల్యేగారికి కోపం పెరిగింది– తన పార్టీ మీటింగుకి హాజరు కావడానికి పోతుంటే ఓ కానిస్టేబుల్ తనని ఆపడమా! వెంటనే చాచి చెంపదెబ్బ కొట్టింది. సాధారణంగా ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఇలాంటి ముచ్చట్లు మన రాష్ట్రంలో చాలాసార్లు వింటూంటాం. పోలీసు స్టేషన్లోనే ఆఫీసర్లని కొట్టిన నాయకుల ‘పెద్దరికం’మనం చదివి మురిసిపోయాం. కానీ కథ ఇక్కడ ఆగలేదు. కానిస్టేబుల్ వెంటనే అంతే బలంగా ఎమ్మెల్యే చెంప పగలకొట్టింది. ఇప్పుడు లెక్క సరిపోయింది. ఇప్పుడు ఎవరు ఎవరి మీద ఫిర్యాదు చెయ్యాలి? ఎమ్మెల్యేగారు కొట్టారని కానిస్టేబులా? లెక్క అక్కడితో సరిపెట్టేసింది కదా! మరి ఎమ్మెల్యేగారు చెయ్యాలా? ‘మరి తమరు ముందు పీకారు కదా?’ఇదీ మీమాంస. ఈ కథ తర్వాత ఏమీ జరగలేదు. కాగా ఎమ్మెల్యే ఆషా కుమారే కాస్త ఎక్కువ బాధ పడ్డారు. ‘ఆవిడ నన్ను నానా మాటలూ అంది. అవమానపరిచింది. నేను ఆవిడ తల్లి వయసు దాన్ని. అయినా నేను ఆవేశపడకుండా ఉండాల్సింది. నేను క్షమాపణ చెప్తున్నాను.’అన్నారు ఆషాకుమారి. మన చోటా నాయకులు ఎన్నికలలో జయించగానే కాస్త గోరోజనం పెరగడం చూస్తాం. వారు సాధారణంగా నేల మీద నడవరు. వారి వెనుక చిన్న చేతి సంచి పట్టుకుని ఓ నౌకరు నడుస్తూంటాడు. వారికి చుట్టూ ప్రపంచం బొత్తిగా హీనంగా కనిపిస్తూంటుంది. వారి పక్కన నడిచే చెంచాలు వారి కంటే పెద్ద అంగలు వేస్తారు. అధికారం తలకెక్కినప్పటి కుసంస్కారం ఇది. ఒక్కక్షణంలో గతం మసకబారుతుంది. తాము ప్రత్యేకమైన పదార్థంతో మలిచిన మహానుభావులమనే భావం ఆకాశంలో నడిపిస్తుంది. ఇంగ్లీషులో ఒక వాక్యం ఉంది When you loose your temper, you loose more than temper అని.ఇది చదువుకున్న సంస్కారి అవగాహన. కానిస్టేబుల్ తల్లి వయసున్న, కొత్తగా ఎన్నికైన ఒక మాజీ ముఖ్యమంత్రిగారి మేనకోడలు– ఎంత సంయమనం, ఎంత మర్యాదని చూపించాలి! లోపలికి వెళ్లనీయని కారణంగా ఆ ఎమ్మెల్యే బయట అరగంట నిలిచిపోయిందని తెలిస్తే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం ఏమయ్యేది? ఇప్పుడు ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పవలసి వచ్చింది? మనకన్నా చిన్నవాళ్ల మీద మనం చూపే అధికారం– కుసంస్కారం. మనకన్నా పెద్దవాళ్ల మీద ఆ అధికారాన్ని చూపగలిగితే అది ‘నిజాయితీ’అనిపించుకుంటుంది. పెద్దవాళ్లు చిన్నవారి పట్ల చూపే ఆవేశం కన్నా చిన్నవాళ్లు పెద్దవారిని నిలదీసే ‘ధైర్యం’వెయ్యి రెట్లు బలమైనది. షిల్లాంగులో జరిగిన ఈ సంఘటన విశాఖపట్నంలో తుపాకీలాగ పేలింది. చిన్న ఉద్యోగి చేసిన సాహసం– పెద్ద ఉద్యోగి చేసిన అనౌచిత్యాన్ని తలదన్నింది. ఇదే– ’ loosing more than temper’అంటే. నిజమైన అధికారం తలొంచుతుంది. విర్రవీగదు. నిజమైన పెద్దరికం ‘చెప్పుకోదు’. తెలిసేటట్టు చేస్తుంది. ఒక్క ఉదాహరణ చెప్పడానికి నేనెప్పుడూ అలసిపోను. ఆఫీసులో పనివేళలు దాటిపోయాక– తప్పనిసరిగా పనిలో తలమునకలయిన ఉద్యోగి– నాలుగో ఫ్లోర్ లిఫ్టు దగ్గర నిలబడి ఉంది. మెట్లు దిగుతున్న అధికారి చూశాడు. ఆయన్ని చూసి ఈమె కాస్త కంగారుపడింది. ‘ఏమమ్మా! ఇంత ఆలస్యంగా వెళుతున్నావు?’అన్నారాయన. ఏదో నసిగింది. లిఫ్టు వచ్చేదాకా ఆయనా ఆమెతో నిలబడ్డారు– ఆమె అక్కరలేదంటున్నా. లిఫ్టులో ఆమెతో పాటు దిగి– ఆమెను కారు ఎక్కించి వెళ్లారు. ఆ ఉద్యోగి పేరు సుధ. తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని పెళ్లి చేసుకుని ‘సుధా నారాయణమూర్తి’అయ్యారు. ఆ అధికారి జేఆర్డీ టాటా. ఈ దేశంలో ‘భారతరత్న’గౌరవాన్ని పుచ్చుకున్న ఒకే ఒక్క వ్యాపారి ఆయన. మన కంటే చిన్నవాడిమీద విరుచుకుపడే ఆవేశం ‘ఆవేశం’అనిపించుకోదు. ‘ఉడుకుమోతుతనం’అనిపించుకుంటుంది. 1990లో అహమ్మదాబాదు సమీపంలో జరిగిన రైలు ప్రయాణంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఒక ప్రయాణికురాలి కోసం ఫస్టుక్లాసు కూపేలో ఉన్న ఇద్దరు నాయకులు– ఆమెకు బెర్తు ఇచ్చి– కంపార్టుమెంటులో నేల మీద దుప్పటి పరుచుకుని పడుకున్నారు. వారిద్దరు– శంకర్‌సింగ్ వాఘేలా, నరేంద్రమోదీ అనే కార్యకర్త. వారిద్దరిలో ఒకాయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మరొకాయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశపు ప్రధాని అయ్యారు. ఈ విషయాన్ని వారిద్దరు చెప్పుకోలేదు. తర్వాత రైల్వే బోర్డు జనరల్ మేనేజర్ అయిన ఆ ప్రయాణికురాలు వ్రాశారు. గొల్లపూడి మారుతీరావు -
నన్ను క్షమించు.. చేయి జారాను : ఎమ్మెల్యే
సాక్షి, షిమ్లా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఆ పార్టీ నేత ఆశాకుమారి క్షమాపణలు చెప్పారు. అలా ఎందుకు తాను చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఆ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆమె(మహిళా కానిస్టేబుల్) నన్ను తిట్టింది. నన్ను తోసింది. ఆమె నన్ను వెళ్లకుండా నిలువరించాల్సింది.. నాకు ఆమె తల్లికున్న వయసు ఉంటుంది. అయితే, ఈ సమయంలో నేను నా సహనాన్ని కోల్పోకుండా ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవాల్సి ఉండాల్సింది. నేను అందుకు క్షమాపణలు చెబుతున్నాను' అని మీడియా సాక్షిగా తెలిపారు. సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాయలం దగ్గరకు ఆశాకుమారి చేరుకున్నారు. అయితే పోలీస్ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగలకొట్టారు. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్ కూడా ఆమె చెంప వాయించింది. దీంతో ఆశాకుమారి ఆగ్రహంతో ఊగిపోగా.. కార్యకర్తలు ఆమెను పక్కకు తీసుకెళ్లారు. -
కాంగ్రెస్ మరో వివాదాస్పద నిర్ణయం
ఛండీగర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కొత్తవారికి అధ్యక్ష బాధ్యతలు వచ్చాయి. అంతకుముందు ఈ బాధ్యతలు నిర్వర్తించిన కమల్ నాథ్ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ చట్ట సభ సభ్యురాలు ఆశా కుమారీని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కమల్ నాథ్ కు 1984 సిక్కు ఊచకోత కేసుతో సంబంధం ఉందని పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో ఆపార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆశాకుమారీ పై కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన కేసులో ఫిబ్రవరిలో న్యాయస్థానం ఏడాది పాటు ఆమెకు జైలు శిక్ష విధించింది. 1998 లో డల్హౌసీలోని ప్రభుత్వ, అటవీ భూమిని ఆక్రమించిన కేసులో ఆమెపై ఈ కేసు నమోదైంది. దీంతో ఆశాకుమారి నియామకం కూడా ఆ పార్టీకి మరో కొత్త సమస్య తెచ్చిపెట్టవచ్చేమోనని పలువురు చర్చించుకుంటున్నారు.