breaking news
asa Activists
-
రూ.3వేలు గౌరవ వేతనాలు ఇవ్వాలి
ఆశ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలి తక్షణం వేతన బకాయిలు చెల్లించాలి అరకు ఎంపీ కొత్తపల్లి గీత డిమాండ్ పాడేరు: ఏజెన్సీలోని గిరిజనుల ఆరోగ్యానికి అనుక్షణం శ్రమిస్తున్న ఆశ కార్యకర్తలకు వెంటనే నెలకు రూ. 3 వేలు చొప్పున గౌరవ వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత డిమాండ్ చేశారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆశ కార్యకర్తలు బకాయి వేతనాలు, గౌరవ వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో సోమవారం చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని తెలుసుకున్న ఆమె ఈ సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ ఏపీఓతో ఫోన్లో చర్చించారు. వారికి ఐటీడీఏ చెల్లించాల్సిన బకాయి వేతనాల మంజూరులో ఏర్పడిన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చే అతి తక్కువ రూ.400 వేతనం కూడా నెల నెలా పంపిణీ చేయకపోవడం అన్యాయమన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఆమె తప్పు పట్టారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య కార్యక్రమాలకు రూ.కోట్లు నిధులు మంజూరు చేస్తున్నా ఆశాలకు ఇచ్చే తక్కువ వేతనాలు సొమ్ము ఎందుకు మంజూరు చేయడం లేదని ఎంపీ ప్రశ్నించారు. ఆశ కార్యకర్తలంతా వెట్టి చాకిరీకి గురవుతున్నారని వారందరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తాను ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని ఆమె చెప్పారు. గౌరవ వేతనాల సొమ్మును పెంచి, నెల నెలా సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. చదువుకున్న ఆశ కార్యకర్తలను వైద్య సిబ్బందిగా నియమకాలు జరిపేందుకు కూడా ప్రభుత్వంకు నివేదిక ఇస్తామని ఆమె చెప్పారు. గ్రామాల్లో వెట్టి చాకిరీ చేస్తూ చివరకు ఇచ్చే అతి తక్కువ వేతనాలకు కూడా ఆశ కార్యకర్తలు ఉద్యమాలు చేసుకోవలసిన దుస్థితి రావడం బాధాకరం అన్నారు. ఆశ కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు. -
ఆశతీరక ఆగ్రహం
వేతన బకాయిల కోసం కదం తొక్కిన ఆశ కార్యకర్తలు ఐటీడీఏ ముట్టడి ఉద్రిక్తం ఏపీఓ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమణ పాడేరు : అసలే చాలీచాలని వేతనం. రూ.400 గౌరవ వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నా...అదీ సకాలంలో అందని దుస్థితి. బకాయిలు అడిగితే ఇదిగో అదిగో అంటూ తిప్పలు పెట్టే ఐడీడీఏ...దీంతో కడుపు మండిన ఆశ కార్యకర్తలు ఐటీడీఏను చుట్టుముట్టారు. 14 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని ఆశ కార్యకర్తలంతా ఈ ఆందోళనలో కదం కలిపారు. సీఐటీయు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న సుమారు 1500 మంది ఆశ కార్యకర్తలు సోమవారం ఉదయాన్నే పాడేరుకు చేరుకొని ఐటీడీఏ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. బకాయి వేతనాలు, టీఏ, డీఏలు వెంటనే చెల్లించాలని నెలకు రూ.3 వేలు చొప్పున వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆశల నినాదాలతో ఐటీడీఏ ప్రాంతం దద్దరిల్లింది. ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాడేరు ఎస్ఐ ధనుంజయ్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ఐటీడీఏ చుట్టూ భద్రతా చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం వరకు ధర్నా కార్యక్రమంతో తమ సమస్యలపై నినాదాలు చేస్తున్నా ఐటీడీఏ అధికారుల్లో కదలిక లేకపోవడంతో వారిలో ఆగ్రహం పెల్లుబికింది. వీరంతా ఒక్క ఉదుటున ఐటీడీఏ కార్యాలయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే రెండు గేట్లను మూసివేయడంతో బయట నుంచే ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. తమకు బకాయి వేతనాలు పూర్తిగా చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని ఇక్కడే మకాం ఉంటామంటూ మహిళలు గర్జించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమావేశం నిమిత్తం విశాఖపట్నం వెళ్లిపోవడంతో ఇక్కడ ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు ఫోన్ ద్వారా ఆయనకు ఆశ కార్యకర్తల ఆందోళన విషయాన్ని తెలియపరిచారు. ఐటీడీఏ పీఓకూడా ఈ సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆందోళన కారులతో చర్చలు జరపాలని ఐటీడీఏ పీఓను ఆదేశించారు. దీంతో ఏపీఓ పీవీఎస్ నాయుడు సీఐటీయు, గిరిజన సంఘం, ఆశ కార్యకర్తల సంఘం నాయకులను చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటికే 4 నెలల గౌరవ వేతనాలు ఆశ కార్యకర్తల బ్యాంకు అకౌంట్లలో జమచేశామని, మిగిలిన 9 నెలల వేతనాలను కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేసేలా జిల్లా కలెక్టరు చర్యలు తీసుకుంటారని ఏపీఓ హామీ ఇచ్చారు. అనంతరం ఆశ కార్యకర్తల ధర్నా కార్యక్రమానికి కూడా ఏపీఓ చేరుకొని బకాయి వేతనాల చెల్లింపులకు ఐటీడీఏ చేపట్టే అత్యవసర చర్యలను వివరించారు. అయినప్పటికి కొంత మంది ఆశ కార్యకర్తలు సంతృప్తి చెందలేదు. వేతనాల చెల్లింపులను పక్కనపెట్టి రాత్రి పగలు తేడా లేకుండా సాటి గిరిజనుల వైద్యానికి శ్రమిస్తున్నామని, శ్రమకు తగ్గ వేతనాలు రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ కార్యకర్తలకు వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఏపీఓ తెలపడంతో ఆశ కార్యకర్తలంతా ఈ ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, డివిజన్ కార్యదర్శి ఆర్.శంకరరావు, జిల్లా నాయకులు ఎంఎం శ్రీను, పాలికి లక్కు, సుందరరావు, ఆశ కార్యకర్తలసంఘం జిల్లా అధ్యక్షురాలు బి.రామలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఇ.ప్రభ, పాడేరు డివిజన్ అధ్యక్షురాలు వై.మంగమ్మ, అన్ని మండలాలనాయకులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.