breaking news
Art director Ravindrareddy
-
షూటింగ్ సంగతి తర్వాత... సాయం ముఖ్యమనుకున్నాం
కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారు. ‘రాధేశ్యామ్’ యూనిట్ ఓ ఆస్పత్రికి 52 బెడ్లు సమకూర్చింది. అది కూడా ఈ సినిమా కోసం వేసిన ఆస్పత్రి సెట్‌కి సంబంధించిన బెడ్లు. ఇంకా స్ట్రెచర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సెలైన్ స్టాండ్లు.. ఇలా సెట్లో భాగంగా వేసినవన్నీ కూడా ఇచ్చారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ‘రాధేశ్యామ్’ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో భారీ ఆస్పత్రి సెట్ వేశారు. వీటినే ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి ఇచ్చారు. ఈ విషయం గురించి రవీందర్ రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘ఆస్పత్రి డాక్టర్ నా ఫ్రెండ్. బెడ్లు కొరత ఉందంటే.. ఓ పది ఎరేంజ్ చేశాను. అయితే అవి ‘రాధేశ్యామ్’ సెట్వి కాదు. ఆ తర్వాత ఇంకా కావాలని అడిగితే, ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు నా వైఫ్ సంధ్య సినిమా సెట్లోవి ఇవ్వొచ్చు కదా అంది. ఆస్పత్రివాళ్లతో అంటే.. ‘సినిమాకి వేసినవి కదా.. పేషెంట్లకు సౌకర్యంగా ఉంటాయో? లేదో’ అన్నారు. ఫొటో పంపించాను. నిజానికి నేను అచ్చం ఆస్పత్రికి వాడే బెడ్లులాంటివే సెట్ వేశాను. బెడ్ హైట్ ఎంత ఉండాలి? పొడవు వంటివన్నీ ముందే తెలుసుకుని వేశాను. పైగా 1970ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా కాబట్టి, అప్పటి బెడ్లు కొంచెం పెద్దగా ఉంటాయి. అలానే తయారు చేశాం. ఆస్పత్రివారికి బాగా అనిపించడంతో.. అన్నింటినీ శానిటైజ్ చేసి, 13 ట్రక్కుల్లో మొత్తం 50 బెడ్లు, ఇతర పరికరాలు పంపించాం. ఆ తర్వాత ఇంకోటి చూడండి అని ఫోన్ చేసినప్పుడు, చాలా బాధ అనిపించింది. అది మాత్రమే కాదు.. ట్రక్కులు బయలుదేరాక... ఇంకో అరగంట పడుతుందా? గంటలో చేరతాయా? అంటూ... ఆస్పత్రివారు ఆదుర్దాగా ఫోన్ చేశారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించుకోండి. ఆ తర్వాత ఇంకో బెడ్ ఉందా? అని అడిగితే, రెండు పంపించాం’’ అన్నారు. ఈ సెట్లో షూటింగ్ పూర్తయిందా? అంటే ‘లేదు. ప్రభాస్ మీద ఒక భారీ సీన్ తీయాలి. కానీ మా నిర్మాతలు అదేం ఆలోచించలేదు. ఈ సమయంలో హెల్ప్ చేయాలి. తర్వాత సంగతి తర్వాత అన్నారు. హ్యాపీగా ఇచ్చేశాం. మా యూనిట్ నుంచి ఈ విధంగా హెల్ప్ చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. -
కత్తిలాంటి కళ!
సినిమాలో ఫైటింగ్ సన్నివేశం వచ్చిందంటే మనకి చెమటలు పట్టేస్తాయి. ఫ్యాక్షన్ సినిమాలైతే ... కత్తులతో పొడుచుకోవడం, గొడ్డళ్లతో నరుక్కోవడం. అవన్నీ డమ్మీ ఆయుధాలన్న సంగతి మరిచిపోతుంటాం. వాటిని నిజమైన ఆయుధాల్లా తీర్చిదిద్దిన కళాకారుల నైపుణ్యం అది. కత్తి, గొడ్డలి, బల్లెం, రాడ్... అన్నీ డమ్మీవే. ప్రముఖ ఆర్ట్ డెరైక్టర్ రవీంద్రరెడ్డిని పలకరిస్తే వీటికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిదే ట్రెండ్... సినిమాల్లో ఫైటింగ్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఒకప్పుడు ఆయుధం లేకుండా పాతికమంది విలన్లని చితక్కొట్టడం హీరో ప్రత్యేకత. దశాబ్దం క్రితం పరిచయమైన ఫ్యాక్షన్ ఫైటింగ్‌ల వల్ల డమ్మీ ఆయుధాలకు గిరాకీ పెరిగింది. శివ సినిమాలో హీరో ఆయుధం సైకిల్ చైన్... అక్కడి నుంచి హీరో చేతిలో ఏదో ఒకటి వెరైటీ ఆయుధం ఉండటం ట్రెండ్‌గా మారింది. కత్తులు, గొడ్డళ్లతో సరిపెట్టకుండా రాజమౌళి వంటి దర్శకులు కొత్తరకం ఆయుధాలకు తెరతీశారు. ఆయుధాలకు సంబంధించి బాగా పేరు తెచ్చిన సినిమాలు ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, మర్యాద రామన్న... ఇంకా చాలా ఉన్నాయి. చూడ్డానికి నిజమైనవాటిలా కనిపించే ఆ ఆయుధాల వెనుక చాలా శ్రమ దాగి ఉంది. మూడు రకాలు... డమ్మీ ఆయుధాలకు వాడే మెటీరియల్‌లో ముఖ్యమైంది లెటెక్స్. ద్రవరూపంలో ఉండే ఈ మెటీరియల్‌ని పైపూతగా వాడతారు. ఆయుధాల రూపంలో మలచడానికి హోమ్షీట్, రబ్బర్షీట్, సాఫ్ట్బోర్డు, థర్మోకోల్ని వాడతారు. ‘‘హీరో చేతిలో ఉండే కత్తిని తయారుచేయాలంటే ముందు పేపర్‌పై ఆకారాన్ని గీసుకుని, దానికి తగ్గట్టు మూడు రకాల షీట్లను కట్ చేసుకుని, కత్తిలా ఉండే రూపం ఇస్తాం. ఆ తర్వాత రంగు వేసి పైన నున్నగా కనిపించడానికి లెటెక్స్ పూస్తాం. ఇలా గొడ్డలి, రాడ్లు, ఊచలు, గునపాలు, బల్లెం... ఫైటింగ్ సీన్లో ఏ యే ఆయుధాలు అవసరమో అన్నీ చేస్తాం. అయితే ఎక్కువగా వాడే ఆయుధం మధ్యలో విరిగిపోతే ఇబ్బంది కాబట్టి, అదనంగా నాలుగైదు చేసి పెట్టుకుంటాం. అలాగే లాంగ్షాట్కి, క్లోజప్ షాట్‌కి వేరువేరు ఆయుధాలు తయారుచేస్తాం. లాంగ్షాట్కి తక్కువరకం మెటీరియల్ వాడినా సరిపోతుంది. క్లోజప్‌లో కనిపించే ఆయుధాలకు ఖర్చు ఎక్కువవుతుంది’’ అంటూ డమ్మీ ఆయుధాల వెనుక తమ కృషిని గురించి చెప్పారు రవీంద్రరెడ్డి. ఆయుధాలకు సంబంధించి ఎన్నెన్నో విషయాలు వివరించారు ఈ ఆర్ట్ డెరైక్టర్. సినిమాల్లో కనిపించే అబద్ధపు ఆయుధాల వెనకున్న కృషికి నిజమైన సాక్ష్యాలు ఇక్కడ ఇచ్చిన బొమ్మలు. - భువనేశ్వరి