breaking news
arms business
-
Russia Ukraine war: ఉక్రెయిన్ శిథిలాల్లో ఆయుధ కంపెనీల... కాసుల పంట
ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో విజేతలెవరు? రష్యా వంటి అత్యంత శక్తివంతమైన దేశం మూడు నెలలుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై పట్టు చిక్కలేదు. పైగా సైనికంగా, సాయుధ సంపత్తి పరంగా అపార నష్టం చవిచూస్తోంది. అంతర్జాతీయంగా, దౌత్యపరంగా తీవ్ర వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. అంతర్జాతీయ సాయంతో రష్యాను ఉక్రెయిన్ ఢీకొడుతున్నా, ఆ దేశం నిండా శిథిల నగరాలే దర్శనమిస్తున్నాయి. మరి ఇంతకూ ఈ యుద్ధంలో గెలుస్తున్నదెవరు? రష్యానా, ఉక్రెయినా? రెండూ కాదు. అమెరికా, పాశ్చాత్య దేశాల ఆయుధ కంపెనీలదే అసలు విజయంగా కన్పిస్తోంది... ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం వల్ల ఆయుధ కంపెనీల పంట పండుతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఈ కంపెనీల్లో తయారవుతున్నవే. ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్‌తో పాటు టాప్ సెవెన్ కంపెనీలు అమెరికావే. అమెరికా, యూరప్ల్లోని ఆయుధ కంపెనీలు చాలావరకు ప్రైవేట్ సంస్థలే. ఐదేళ్లుగా పెద్దగా వ్యాపారం సాగక సతమతమవుతున్న ఈ సంస్థలు ఉక్రెయిన్ యుద్ధం పుణ్యామా అని లాభాల బాట పట్టాయి. అమెరికాతో సహా నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంలో చాలావరకు ఆయుధాల రూపంలోనే అందుతోంది. విమాన విధ్వంసక స్ట్రింగర్, ట్యాంకు విధ్వంసక జావలిన్ ఆయుధ వ్యవస్థలను తయారు చేస్తున్నది అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్లే. యుద్ధం మొదలవగానే మార్చిలో లాక్‌హీడ్ సంస్థ షేరు విలువ ఒక్కసారిగా 16 శాతం పెరిగింది. రేథియాన్ సంస్థ షేరు విలువ 8 శాతం, యూరప్‌లో అతిపెద్ద ఆయుధ కంపెనీ బీఏఈ షేరు విలువ ఏకంగా 26 శాతం పెరిగాయి. అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్ షేరు 12 శాతం, నార్త్రోప్ గ్రూమన్ షేరు 22 శాతం పెరిగాయి. కాంగ్రెస్ సభ్యులకు కాసుల పంట అమెరికా కాంగ్రెస్ సభ్యుల్లో చాలామందికి ఆయుధ కంపెనీల్లో షేర్లున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వారికి లాభదాయకంగా మారిందన్నది బిజినెస్ ఇన్సైడర్ పత్రిక కథనం. కనీసం 20 మంది కాంగ్రెస్ సభ్యులకు, లేదా జీవిత భాగస్వాములకు లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్ సంస్థల్లో నేరుగా షేర్లున్నాయి. మరెందరో వాటిలో చాలాకాలంగా పెట్టుబడులు పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ కొత్తగా షేర్లు కొన్నవారికీ కొదవ లేదు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు మార్జోరీ టైలర్ గ్రాన్ ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 22న లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. పైగా, ‘యుద్ధం రాజకీయ నాయకులకు మంచి వ్యాపారం’ అంటూ ట్వీట్ కూడా చేశారు! టెనెసీకి చెందిన మరో రిపబ్లికన్ సభ్యురాలు డయానా హార్స్బర్జర్ తన భర్తతో కలిసి రేథియాన్ షేర్లు కొన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్‌లో ముందు పెట్టిన ప్రతిపాదనలు చకచకా ఆమోదం పొందుతున్నాయి. పైగా అడిగినంత కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. బిలియన్లు గుమ్మరిస్తున్న యూఎస్ ఉక్రెయిన్‌కు బైడెన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,000 కోట్ల డాలర్లకు పైగా నిధులిచ్చేందుకు సిద్ధమైంది. దాంతో ఉక్రెయిన్ యుద్ధం కోసం గత రెండు నెలల్లోనే అమెరికా మంజూరు చేసిన సాయం ఏకంగా 5,300 కోట్ల డాలర్లను దాటింది. ఇందులో చాలావరకు ఆయుధ రూపంలో అందేదే. గత రెండు దశాబ్దాల్లో అమెరికా ఇచ్చిన అతిపెద్ద విదేశీ సాయం ఇదే! యుద్ధం సాగే కొద్దీ ఉక్రెయిన్‌కు సాయాన్ని ఇంకా పెంచుతానంటూ హామీకూడా ఇచ్చింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఆయుధ కంపెనీలు కాసుల పంట పండించుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఇదే విధంగా జరిగింది’’ అని రిటైర్డ్ మేజర్ జనరల్ జి.డి.భక్తి గత చరిత్రను గుర్తు చేశారు. యూరప్ దేశాలూ... ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న పలు యూరప్ దేశాలు తమ రక్షణ కేటాయింపులను భారీగా పెంచుకుంటున్నాయి. జర్మనీ రక్షణ కేటాయింపులు జీడీపీలో 1.5 శాతం నుంచి 2 శాతానికి పెరగనున్నాయి. జపాన్ 60 ఏళ్ల తర్వాత తమ జీడీపీలో ఒక శాతానికిపైగా నిధులను రక్షణ అవసరాలకు కేటాయించబోతోంది. అమెరికా రక్షణ నిధులు కూడా వచ్చే ఏడాది ఎన్నడూ లేనంతగా జీడీపీలో 3.5 శాతం నుంచి 5 శాతానికి చేరొచ్చన్నది బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణుల అంచనా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆయుధ వ్యాపారమే అసలు ముద్దాయి
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయి. ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధానికి పైకి కనిపిస్తున్న కారణాలకు మించి మరోటున్నది. అమెరికా, మరికొన్ని ఇతర దేశాలూ చేస్తున్న ఆయుధ వ్యాపారమే ఇందుకు అసలు కారణం. ఉక్రెయిన్‌కి రష్యా బూచిని చూపించి, 2014 నుంచి ఇప్పటి వరకు అమెరికాతోపాటూ కెనడా, చెక్ రిపబ్లిక్, పోలండ్, టర్కీ, యూఏఈ, బ్రిటన్ వంటి దేశాలు ఉక్రెయిన్‌తో ఆయుధాల వ్యాపారం చేస్తున్నాయి. ఈ దేశాలన్నీ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని ఇవ్వాళ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వీటికి చిత్తశుద్ధి ఉంటే ఆయుధ వ్యాపారాన్ని ఆపాలి. ఆయుధ వ్యాపారం ఉన్నంత కాలం... ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ‘‘యుద్ధం ఒక పెద్ద వ్యాపారం. డబ్బు పెద్ద మొత్తంలో చేతులు మారుతుంటుంది. అంతే కాదు, యుద్ధం ద్వేషాన్నీ, భయాన్నీ, అపనమ్మకాన్నీ పెంచు తుంది. ఈ యుద్ధాల్లో ఎంతో మంది సైనికులు, సాధారణ ప్రజలు అనివార్యంగా అనేక విధాలైన బాధలకు; మానసిక, శారీరక గాయాలకు... చివరకు మృత్యువుకు బలవుతారు’’ అంటూ బ్రిటిష్ సంగీత విద్వాంసుడు జాన్ అండర్సన్ యుద్ధం గురించిన ఒక సజీవ సత్యాన్ని మన కళ్ళ ముందుంచారు. తన యుద్ధాలతో యూరప్‌ను గడగడ లాడించిన ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టి ‘యుద్ధం హంత కుల వ్యాపారం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో రాచరికాలు పోయాయి, నియంతృత్వాల స్థానంలో ప్రజాస్వామ్యం నెలకొన్నది. ఈ ఆధునిక యుగంలో యుద్ధం అవసరం మారిపోయింది. 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు బ్రిటిష్ వ్యాపారులు భారత దేశంతో పాటు, ప్రపంచం మీద ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి డబ్బు, వ్యాపారంతో పాటు ఆయుధాలనూ నమ్ముకున్నారు. అయితే 1945ల తర్వాత, అంటే రెండవ ప్రపంచయుద్ధం అనంతరం చాలా దేశాలు బ్రిటిష్, ఫ్రెంచి, డచ్ తదితర సామ్రాజ్య వాద విస్తరణ వాదుల నుంచి విముక్తి పొంది, ప్రజాస్వామ్య ప్రభు త్వాలను ఏర్పరుచుకున్నాయి. ఇక ప్రపంచం శాంతియుతంగా సహ జీవనం సాగిస్తుందని అనుకున్నాం. కానీ యుద్ధాలు ఆగలేదు. గతంతో పోలిస్తే యుద్ధాలు తక్కువ జరిగినా ఆయుధ వ్యాపారం ఆగలేదు. ప్రపంచంలోని 36 దేశాలు మినహా మిగతా అన్ని దేశాలూ పెద్ద ఎత్తున సైన్యాలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ చాలా చిన్న దేశాలు. కానీ మిగతా దేశాలన్నీ కూడా సైన్యాన్నీ, ఆయుధాలనూ వీలైతే అణ్వాయుధాలనూ కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయవేదికలు, నిర్దిష్టమైన సరిహద్దులు, ప్రజలు ఎన్నుకుంటున్న ప్రభుత్వాలు ఉన్న సమయంలోనూ యుద్ధాలు తప్పవా? వాస్తవానికి యుద్ధాలు లేని ప్రపంచాన్ని నిర్మించుకునేంత ప్రజాస్వామిక భావజాలం నెలకొని ఉన్నది. కానీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి యుద్ధాలు జరుగుతున్నాయనడం కంటే యుద్ధాలు చేయిస్తున్నారు అనడం సబబుగా ఉంటుంది. ప్రస్తుతం మనం ప్రతిరోజూ ఉక్రెయిన్‌పై రష్యా దాడిని, దాని పర్యవసానాలను చూస్తున్నాం. ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. ఎంతోమంది ఆప్తులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయారు. చివరకు మన తెలుగు విద్యార్థులూ ఎంతో మంది నరకాన్ని అనుభవించారు. రష్యా – ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో పాత్రధారులుగా రష్యా, ఉక్రెయిన్లే కనిపిస్తున్నా... కని పించని కుట్రలు చేస్తోన్న అగ్రరాజ్యం అమెరికా... ఈ యుద్ధంలో ప్రప్రథమ భాగస్వామి అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అమెరికాతో సహా అనేక యూరప్ దేశాలూ ఈ యుద్ధంలో తమ వంతు మంటలు రాజేసినవే! ఈ యుద్ధానికి అసలు కారణం వ్యాపారం. ఎందుకంటే ఉక్రె యిన్‌కి రష్యా బూచిని చూపించి, అమెరికా తన ఆయుధ వ్యాపారాన్ని సమర్థంగా కొనసాగించుకుంటోంది. ఉక్రెయిన్‌కి ఆయుధాలు అంట గట్టడంలో అమెరికా చాలాకాలంగా సఫలమౌతోంది. రష్యాతో ఉక్రె యిన్ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి అమెరికాతో పాటు అనేక దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడం పెరిగింది. 2014 నుంచి, ఇప్పటి వరకు కెనడా, చెక్ రిపబ్లిక్, పోలండ్, టర్కీ, యూఏఈ, బ్రిటన్ దేశాలు ఉక్రెయిన్‌తో ఆయుధాల వ్యాపారం చేస్తున్నాయి. ఇందులో అమెరికా భాగమే అధికం. 1993లో యుఎస్ఎస్ఆర్ నుంచి ఉక్రెయిన్ విడిపోయినప్పుడు ఆ దేశం రక్షణ బడ్జెట్ స్థూల జాతీయోత్పత్తిలో 0.35 శాతం. అంటే 0.12 బిలియన్ డాలర్లన్నమాట. 2014లో అది 3 బిలియన్ డాలర్లకు పెరిగి, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.25 శాతం వరకు పెరిగింది. అంటే దాదాపు 19 రెట్లు రక్షణ బడ్జెట్ పెంచుకోవాల్సి వచ్చింది. 2015 నాటికి 2.96 బిలియన్ డాలర్ల (జీడీపీలో 3.25 శాతం)కు చేరింది. 2019 వచ్చేసరికి ఈ కేటాయింపులు 5.23 బిలియన్ డాలర్ల (జీడీపీలో 4 శాతం)కు చేరుకున్నాయి. 2014 సంవత్సరంలో రష్యాతో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం ప్రారంభమైంది. ఈ ఘర్షణల వల్ల 2014లో 28.6 శాతం ఉన్న ఉక్రెయిన్‌లోని పేదరికం 2016కి వచ్చేసరికి 58.6 శాతానికి పెరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దిగజారిపోయింది. రెండేళ్ళ క్రితం ప్రపంచాన్ని చుట్టుముట్టిన కోవిడ్ కాలంలో ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కానీ ఆయుధ కర్మాగారాలు లాభాలు గడించాయి. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో పనిచేస్తున్న స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రపంచంలో ఉన్న వంద అగ్రశ్రేణి కంపెనీలు అత్యధిక లాభాలను ఆర్జించినట్టు తెలియజేసింది. ఈ వంద కంపెనీల్లో అమెరికాకి చెందినవే 48 ఉన్నాయంటే అమెరికా ఆయుధ వ్యాపారం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్న పది అగ్రదేశాల్లో అమెరికాది అగ్రస్థానం. 2016–2020 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఆయుధాల అమ్మకంలో అమెరికా భాగం 37 శాతంగా ఉంది. 20 శాతంతో రెండో స్థానంలో రష్యా ఉంది. 2011–15 వరకు అమెరికా భాగస్వామ్యం 32 శాతంగా మాత్రమే ఉండేది. 2011–2015 మధ్య రష్యా ఆయుధ వ్యాపార అమ్మకాలు 26 శాతంగా ఉండేవి. దీన్ని బట్టి ఆరు శాతం అమ్మకాలను రష్యా కోల్పోయింది. ఫ్రాన్స్ (8.2 శాతం), జర్మనీ (5.5 శాతం) వరుసగా మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించాయి. చైనా (5), బ్రిటన్ (6), స్పెయిన్ (7), ఇజ్రాయెల్ (8), దక్షిణ కొరియా(9), ఇటలీ (10) ఆయుధ వ్యాపారంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డబ్బుల్లో ఆయుధ వ్యాపారాన్ని లెక్కిస్తే, 2020లో ప్రపంచం మొత్తం ఆయుధాలు, రక్షణ మీద పెట్టిన ఖర్చు 1.951 ట్రిలియన్ డాలర్లు. ఇందులో అమెరికా ఒక్కటే చేసిన ఖర్చు 778 బిలియన్ డాలర్లు. ఖర్చులో చైనా 252 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. మనదేశం 72.9 బిలియన్ డాలర్ల ఖర్చుతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా (61.7 బిలియన్ డాలర్లు), బ్రిటన్ (59.2 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (57.5 బిలియన్ డాలర్లు), జపాన్ (49.1 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా (45.7 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. అయితే ఇందులో ఒక ముఖ్యమైన అంశమేమిటంటే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, రష్యా లాంటి దేశాలు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడులు పెట్టి అంతకంతకు ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాయి. కానీ ఇండియా లాంటి పేదదేశం ఆయుధాలను కొనడానికి మాత్రమే లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఆయుధాలను దిగుమతి చేసుకుంటోన్న దేశాల్లో సౌదీ అరేబియా, భారత్, ఈజిప్టు, ఆస్ట్రేలియా, చైనా, అల్జీరియా, దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ, పాకిస్తాన్‌లు వరుసగా మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. అంటే అమెరికా యూరప్ దేశాలు తమ ఆయుధాల వ్యాపారానికి ఆసియాను కేంద్రంగా ఉప యోగించుకుంటున్నాయన్నమాట! యుద్ధం ఏదైనా అది లక్షలాది మంది ప్రజల ప్రాణాల హననం. కోట్లాది మందిని దిక్కులేని వారిగా తయారుచేసే దుర్మార్గ వ్యాపార వ్యసనం. యుద్ధం వద్దనుకుంటే ఆయుధ వ్యాపారం ఆగిపోవాలి. ఆయుధాల వ్యాపారం కొనసాగినంత కాలం ఏదో ఒక మూల యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉంటాయి. కాదు యుద్ధాన్ని రగిలిస్తూనే ఉంటారు. అందులో పేద దేశాల ప్రజలెప్పుడూ బలౌతూనే ఉంటారు. ఇదే ప్రతి యుద్ధం నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
గుంటూరు జిల్లాలో ఆయుధాల వ్యాపారం
-
గుంటూరు జిల్లాలో ఆయుధాల వ్యాపారం
శావల్యాపురంలో తపంచాల వ్యాపారం అంశం కలకలం రేపింది. గుంటూరు జిల్లా వినుకొండలో అమ్మేందుకు రెండు తపంచాలను తీసుకెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు, తుపాకుల వాడకాలు పెరిగిపోయాయి. గంజి మురళీధరరావు అనే వ్యక్తి తుపాకుల వ్యాపారం చేయాలని భావించి, పానీపూరీ విక్రయించే సందీప్‌కుమార్ అనే వ్యాపారిని సంప్రదించాడు. అతడి ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుధీర్ కుమార్‌ను కలిసి, ఒక్కోటీ రూ. 30 వేల చొప్పున రెండు తపంచాలు కొన్నాడు. వినుకొండలోని ఓ వ్యాపారికి వీటిని విక్రయించేందుకు మారుతి కారులో తీసుకెళ్తుండగా పోలీసులు మార్గమధ్యంలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. వీరి కారును కూడా తనిఖీ చేయగా, రెండు తపంచాలు దొరికాయి. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా.. గతంలో కూడా వీళ్లు ఈ తరహా వ్యాపారం చేశారని తెలిసింది.