breaking news
Arkavati d notification
-
ప్రతిధ్వనించిన ఆర్కావతి
బెంగళూరు ఆర్కావతి డీ నోటిఫికేషన్ విషయం శాసనసభలో మంగళవారం ప్రతిధ్వనించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారతీయ జనతా పార్టీ శాసనసభ నాయకుడు జగదీష్ శెట్టర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... ఆర్కావతి డీ నోటిఫికేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య హస్తం ఉందన్నారు. ఈ విషయమై జుడిషియల్ ఎంక్వెరీ జరుగుతున్న సమయంలో డీ నోటిఫికేషన్‌కు సంబంధించి దస్త్రాలల్లోని సమాచారం మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఈ విషయమై ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని శెట్టర్ పేర్కొన్నారు. ఈ సమయంలో మధ్యలో ప్రవేశించిన సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... ‘దస్త్రాల్లోని విషయాలను మార్చడానికి సాధ్యమవుతుందా? కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీకు తెలుస్తుందా లేదా? డీ నోటిఫికేషన్ విషయమై దర్యాప్తు చేస్తున్న కెంపయ్య కమిషన్ అడిగిన రూపంలో (ఫార్మట్)లో దాఖలాలు ఇవ్వడానికి కొంత ఆలస్యమవుతోంది. అంతలోనే ఇలా ఆరోపణలు చేయడం సరికాదు.’ అని పేర్కొన్నారు. సిద్ధరామయ్యకు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఒత్తాసు పలికారు -
గవర్నర్ ముగింట ఆర్కావతి
ఫిర్యాదు చేసిన కమలనాథులు బెంగళూరు : ఆర్కావతి డీనోటిఫికేషన్ అంశం రాజ్‌భవన్‌కు చేరింది. దీంతో గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఈ అంశం ఆధారపడి ఉంటుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇరకాటంలో పడేయాలనే వ్యూహ రచనలో భాగంగా రెండు నెలలుగా బీజేపీ నేతలు ఆర్కావతి డీనోటిఫికేషన్‌కు సంబంధించి సిద్ధుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాత్రకు సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని, వాటిని గవర్నర్‌కు అందజేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని సైతం బీజేపీ నేతలు తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని ముఖ్యమంత్రి సైతం ధీటుగానే సమాధానం చెబుతూ వస్తున్నారు. ఆర్కావతి లేఅవుట్లోని భూమిని తాను రీ-మాడిఫికేషన్ చేశాను తప్పితే ఒక్క గుంట భూమిని కూడా డీ-నోటిఫై చేయలేదని సిద్ధరామయ్య చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలా పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇటు బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సందర్భంలో ఆర్కావతి అంశంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని గవర్నర్ వద్ద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నట్లు సమాచారం. ఇక బీజేపీ నేతలు సైతం ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌చేసే దిశగా దృష్ట సారించాల్సిందిగా గవర్నర్‌ను కోరినట్లు తెలుస్తోంది. ప్రాసిక్యూట్ చేయమని కోరబోము: ప్రహ్లాద్ జోషి ఆర్కావతి డీ-నోటిఫికేషన్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా తాము గవర్నర్‌ను కోరబోమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. గవర్నర్ వి.ఆర్.వాలా పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, బీజేపీ నేత ఆర్.అశోక్‌తో కలిసి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ...గతంలో బీజేపీ న్యాయవిభాగంలో ఉన్న ఓ న్యాయవాది స్వతంత్రంగా ఈ విషయంపై గవర్నర్ అనుమతి కోరనున్నారని తెలిపారు. కాగా ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని బీజేపీ సానుభూతి పరుడైన న్యాయవాది నాటరాజ శర్మ చేసిన వినతిని గవర్నర్ తిరస్కరించారు. శుక్రవారం మద్యాహ్నం 2.30గంటలకు అపాయింట్మెంట్ కోరినప్పటికీ గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం.