తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే.. సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన చందనోత్సవంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా.. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.. భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలుముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లా?. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.మరోవైపు, సింహాచలం ఘటనపై వీహెచ్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని.. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది.సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త.. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని.. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది.. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు’’ అంటూ వీహెచ్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.