breaking news
APJENCO
-
పోలవరం ప్రాజెక్ట్ పనులకు తొలగిన అడ్డంకి
-
పోలవరం పనులకు తొలగిన అడ్డంకి
సాక్షి, అమరావతి: పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు(పీహెచ్ఈపీ) పనులను థర్డ్ పార్టీకి అప్పగించేందుకు అడ్డుగా ఉన్న ఉత్తర్వులను హైకోర్టు తొలగించింది. రివర్స్ టెండరింగ్ కింద 17.08.19న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీకి అప్పగించే ప్రక్రియను మొదలుపెట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను గురువారం ఎత్తేసింది. థర్డ్ పార్టీకి పనులను అప్పగించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్(ఐఏ)ను కొట్టేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలని కోరుతూ ఏపీ జెన్కో దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించింది. జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ నవయుగ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌కు విచారణార్హత లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ నవయుగ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఒప్పందం రద్దు ఉత్తర్వుల అమలును నిలిపేయడంతోపాటు ప్రాజెక్ట్ పనులను థర్డ్ పార్టీకి అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నవయుగ కోరిన విధంగా గత ఆగస్టు 22న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రాజెక్ట్ పనులను థర్డ్ పార్టీకి అప్పగించే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ జెన్కో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదు.. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సీతారామమూర్తి గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో మధ్యవర్తిత్వ క్లాజు ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో గుర్తు చేశారు. ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వ క్లాజు ఉన్నప్పటికీ.. దాని జోలికెళ్లకుండా హైకోర్టులో అధికరణ 226 కింద పిటిషన్ దాఖలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఒప్పందంలో మధ్యవర్తిత్వ క్లాజు ఉన్న నేపథ్యంలో, ఈ న్యాయస్థానం కూడా ఆ క్లాజువైపే మొగ్గు చూపుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారం మధ్యవర్తిత్వానికి సంబంధించిందని, అందువల్ల ఒప్పందం రద్దును సవాలు చేస్తూ నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఒప్పందం రద్దు ఉత్తర్వుల అమలు నిలుపుదలకు.. ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీకి అప్పగించకుండా ఆదేశాలివ్వాలన్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో పనుల అప్పగింతకు సంబంధించి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు గ్యారెంటీ కేసులోనూ... ఇదిలా ఉంటే, పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో నవయుగ సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకోరాదంటూ అటు బ్యాంకులను, ఇటు జెన్కోను ఆదేశిస్తూ విజయవాడ కోర్టు ఆగస్టు 13న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ జెన్కో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. బ్యాంకు గ్యారెంటీల విషయంలో మధ్యవర్తిత్వ చట్టం కింద నవయుగ దాఖలు చేసిన ఆర్బిట్రేషన్ ఓపీని రెండు వారాల్లో తేల్చాలని విజయవాడ 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిని ఆదేశించింది. అప్పటివరకు బ్యాంకు గ్యారెంటీల విషయంలో యథాతథస్థితి(స్టేటస్కో)ని కొనసాగించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. -
రివర్స్ టెండరింగ్!
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్(జలాశయం), జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. ఆ పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) గెజిట్ నోటిఫికేషన్లో సెక్షన్ 9(1) ప్రకారం కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయాలన్నా, కొత్తగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలన్నా కేంద్ర జల్ శక్తి శాఖ, పీపీఏల అనుమతి తప్పనిసరి. టీడీపీ ప్రభుత్వ హయాంలో పీపీఏ అనుమతి లేకుండా హెడ్ వర్క్స్‌లో రూ. 1,385 కోట్ల విలువైన పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ నుంచి తప్పించి.. వాటికి నవంబర్ 27, 2017న ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ పద్ధతిలో టెండర్లు పిలవడాన్ని కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో హెడ్ వర్క్స్ పనుల్లో ట్రాన్స్ట్రాయ్ సంస్థతో చేసుకున్న రెండు ఒప్పందాలు.. నవయుగ సంస్థతో రూ. 2,917.78 కోట్ల అంచనా వ్యయంతో చేసుకున్న మూడు ఒప్పందాలు.. బీకెమ్ సంస్థతో రూ. 387.56 కోట్ల వ్యయంతో చేసుకున్న ఒక ఒప్పందం వెరసి ఆరు ఒప్పందాలను పూర్తిగా రద్దు చేసుకుని.. హెడ్ వర్క్స్‌లో మిగిలిన పనుల విలువ రూ. 3,305.34 కోట్ల (టెండర్ డిస్కౌంట్ 14.0555 శాతం కలిపితే రూ. 3,529.31 కోట్లు) అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని పీపీఏ, కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. అనుసంధానాలు (కనెక్టివిటీస్) కుడి, ఎడమ కాలువల పనుల్లో అక్రమాలపై నిపుణుల కమిటీ విచారణ చేస్తోంది. వీటిపై ఇచ్చే నివేదిక ఆధారంగా వాటిని కూడా రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే ప్యాకేజీగా.. జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఏపీ జెన్కో సారథ్యం వహిస్తోంది. హెడ్ వర్క్స్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు అంతర్భాగమైన నేపథ్యంలో వాటిని హెడ్ వర్క్స్‌లో కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించవచ్చునని, దీనివల్ల సమన్వయలోపం తలెత్తదని.. ఇది ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. కేంద్రం నుంచి అనుమతిరాగానే హెడ్ వర్క్స్ (రూ.3,305.34 కోట్లు).. జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల(రూ. 3,220.22 కోట్లు)కు ఒకే ప్యాకేజీ కింద రూ. 6,525.56 కోట్లను ఐబీఎం (అంతర్గత అంచనా విలువ)గా నిర్ణయించి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జలవిద్యుదుత్పత్తి కేంద్రం బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. హెడ్ వర్క్స్ బిల్లులను యథావిథిగా కేంద్రం చెల్లిస్తుంది. నిగ్గుతేలిన అక్రమాలు.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లోని అక్రమాలపై విచారణకు ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తొలుత పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులపై విచారణ చేసిన ఆ కమిటీ.. కాంట్రాక్టర్లకు రూ. 2,346.85 కోట్లను టీడీపీ సర్కార్ అదనంగా దోచిపెట్టినట్లు తేల్చింది. ఆ కమిటీ ఈనెల 13న ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ప్రస్తుతం హెడ్‌వర్క్స్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌తో ఫిబ్రవరి 6, 2013, అక్టోబర్ 7, 2016న చేసుకున్న రెండు ఒప్పందాలను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసుకోకుండానే.. హెడ్ వర్క్స్‌లో స్పిల్ వే పనుల్లో రూ. 1,244.36 కోట్ల విలువైన పనులను ఫిబ్రవరి 17, 2018న, రూ. 921.87 కోట్ల విలువైన పనులను మే 11, 2018న.. రూ. 751.55 కోట్ల విలువైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులను నవంబర్ 22, 2018న నవయుగకు ఎల్ఎస్–ఓపెన్ విధానంలో అప్పగిస్తూ టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ. 387.56 కోట్ల విలువైన గేట్ల పనులను బీకెమ్ సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ నవంబర్ 11, 2018న ఒప్పందం చేసుకుంది. ఆరు ఒప్పందాల వల్ల వేర్వేరు కాంట్రాక్టర్లు పని చేయడంలో సమన్వయలోపం ఏర్పడుతోంది. దీని వల్ల పోలవరం హెడ్ వర్క్స్‌లో అనుకున్న ప్రగతి లేదు. ఇదే అంశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అనేక సందర్భాల్లో ఎత్తిచూపారు. హెడ్ వర్క్స్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలంటే అన్ని పనులు ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను నవయుగకు అప్పగిస్తూ డిసెంబర్ 20, 2017న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలోనే హెడ్ వర్క్స్.. జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించి కాంట్రాక్టర్‌కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రివర్స్ టెండరింగ్‌కు కసరత్తు.. దేశంలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, సోలార్ పవర్ కార్పొరేషన్లు మాత్రమే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. మొట్టమొదట రాష్ట్రంలోనే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలుచేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులోనూ తొలిగా పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రివర్స్ టెండరింగ్‌కు జలవనరుల శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ నాటికి కొత్త కాంట్రాక్టర్ పోలవరం పనుల్లో కాంట్రాక్టర్లకు టీడీపీ సర్కార్ దోచిపెట్టిన సొమ్మును రికవరీ చేయడానికి చర్యలు చేపడుతోంది. రివర్స్ టెండరింగ్‌తో భారీ మొత్తంలో ప్రజాధనం ఆదా అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా మిగిలే నిధులతో మరిన్ని ప్రాజెక్టుల పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు అక్టోబర్ నాటికి రివర్స్ టెండరింగ్‌ను పూర్తి చేసి కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించింది. కొత్త కాంట్రాక్టర్‌తో నవంబర్ నుంచి పనులు ప్రారంభింపజేసి.. జూన్, 2021 నాటికల్లా పనులు పూర్తి చేసి, పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రివర్స్ టెండరింగ్ ఇలా.. ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లోనే రివర్స్ టెండరింగ్ విధానాన్ని చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించిన విలువనే అంటే రూ. 6,525.56 కోట్లను ఐబీఎంగా నిర్ణయించి రివర్స్ టెండర్లు పిలుస్తారు. అదే సమయంలో ప్రైస్ బిడ్ తెరిచే రోజున ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లోనే ఆక్షన్ (వేలం) నిర్వహిస్తారు. ఒక టైమ్ స్లాట్ కేటాయించి నిర్వహించే వేలంలో అతి తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా నిర్ణయిస్తారు. రివర్స్ టెండరింగ్‌లో తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా నిర్ణయిస్తారు. వేలంలో ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ కోట్ చేసిన ధర కన్నా రివర్స్ టెండరింగ్ విధానంలో ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ కోట్ చేసిన ధర ఎక్కువగా ఉంటే, వేలంలో ఎల్–1గా నిలిచిన ధరకు పనులు చేయాలని రివర్స్ టెండరింగ్‌లో ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్‌కు ప్రతిపాదిస్తారు. ఇందుకు అంగీకరిస్తే రివర్స్ టెండరింగ్‌లో ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగిస్తారు. లేదంటే వేలంలో ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగిస్తారు. -
జెన్కోలో జబర్దస్తీ!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీజెన్కో)లో జబర్దస్తీ నడుస్తోంది. ఓ అధికారిణికి పదోన్నతి కల్పించేందుకు వీలుగా మెడికల్ సెలవులో వెళ్లాలంటూ మరో అధికారిపై ఒత్తిళ్లు వస్తున్నాయి. కొత్తగా నియమితులైన డెరైక్టర్ ఒకరు సదరు అధికారిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేయడం జెన్కోలో చర్చనీయాంశమయ్యింది. మొన్నటివరకు ఆరోగ్యం సరిగా లేక సెలవులో ఉన్న ఓ అధికారి.. కొద్దిరోజుల క్రితమే డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతిపై తిరిగి ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా ఉన్న అధికారిణి ఒకరు మొన్నటివరకు డిప్యూటీ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఆమె పదవీ విరమణ చేసేలోపు డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి లభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తిరిగి మెడికల్ సెలవులో వెళ్లాలంటూ ఆ డిప్యూటీ సెక్రటరీపై డెరైక్టర్ ఒకరు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. ఆ అధికారి తర్వాత పదోన్నతిలో ఉన్న సదరు అధికారిణి కోసమే ఈ తతంగమంతా నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న డిప్యూటీ సెక్రటరీపై తెస్తున్న ఒత్తిళ్ల వల్ల మళ్లీ అనారోగ్యానికి గురైతే అందుకు ఎవరిది బాధ్యత అని పలువురు జెన్కో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పదోన్నతి ఆశిస్తున్న సదరు అధికారిణిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రతి బదిలీకి డబ్బులు డిమాండ్ చేస్తారని, ఉద్యోగుల బదిలీలపై మేనేజింగ్ డెరైక్టర్ ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనర్హులకు సైతం ఆమె పదోన్నతులు ఇచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు ఉన్న సదరు అధికారిణిని కొత్తగా నియమితులైన డెరైక్టర్ వెనుకేసుకురావడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకుని డెరైక్టర్‌గా వచ్చిన తర్వాత ఇలా వ్యవహరించడం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.