breaking news
Anto Joseph
-
నటిపై అత్యాచారం: ఆ రాత్రి ఏం జరిగిందంటే..!
పల్సర్ సునీకి ఫోన్ చేయడంపై నిర్మాత వివరణ కొచ్చి: మలయాళ కథానాయిక కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నిర్మాత అంటో జోసెఫ్ పేరు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి పల్సర్ సునీకి చివరిసారిగా ఫోన్ చేసింది జోసెఫ్‌నేనని తేలడంతో ఆయన ప్రమేయంపై అనేక కథనాలు వస్తున్నాయి. వ్యక్తిగత కక్షతోనే నటిపై ఈ దుర్మార్గాన్ని చేయించాడా? అని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథనాల నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. గత శుక్రవారం నటి కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురయిన అనంతరం ఏం జరిగిందో వివరించారు. ఆయన ఏమన్నారంటే.. 'ఘటన జరిగిన తర్వాత మొదట దర్శకుడు లాల్ నాకు ఫోన్ చేశారు. నా ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండటంతో నేను ఎత్తలేదు. ఆ తర్వాత రెంజీ పనిక్కర్ నాకు ఫోన్ చేసి.. జరిగిన ఘటన గురించి చెప్పారు. సాధ్యమైనంత త్వరగా లాల్ ఇంటికి రమన్నారు. దీంతో నేను ఎమ్మెల్యే పీటీ థామస్‌తోపాటు లాల్ ఇంటికి చేరుకున్నాను. పోలీసులు, (నటి డ్రైవర్) మార్టిన్ అప్పటికే అక్కడ ఉన్నారు. పీటీ థామస్ మార్టిన్‌ను ప్రశ్నించాడు. అతని దగ్గరి నుంచి పల్సర్ సుని నంబర్ తీసుకున్నాను. నా నంబర్ నుంచి మార్టిన్ సునికి ఫోన్ చేశాడు. మొదట అతను లిఫ్ట్ చేయలేదు. కానీ ఆ తర్వాత కాల్‌బ్యాక్ చేసి నువ్వు ఎవరు అని అడిగాడు. నా గురించి చెప్పడంతో వెంటనే పెట్టేశాడు. అంతే తప్ప అతనికితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలిపాను. అది దారుణమైన ఘటన. ఇలాంటి ఘటన ఏ అమ్మాయికి కూడా జరగకూడదు' అని అంటో జోసెఫ్ పేర్కొన్నారు. కారులో దుండగులు తనను లైంగికంగా వేధింపులకు గురిచేసిన అనంతరం నటి దర్శకుడు లాల్ దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే తాను పల్సర్ సునికి ఫోన్ చేశానని జోసెఫ్ చెప్తున్నారు. -
ఆ నటిపై అత్యాచారం వెనుక ఓ సినీ ప్రముఖుడు!
వెలుగులోకి వచ్చిన కుట్ర కోణం కోచి: ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి కేసు దర్యాప్తులో పలు సంచలన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఓ సినీ ప్రముఖుడి హస్తం ఉందని అనుమానాలు వెలువడుతున్నాయి. ఈ ఘటన వెనుక ప్రముఖ మలయాళ నిర్మాత అంటో జోసెఫ్ ప్రమేయమున్నట్టు తాజాగా కథనాలు వస్తున్నాయి. నటి కిడ్నాప్, అత్యాచారం జరిగిన రోజు రాత్రి.. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన రౌడీ షీటర్ సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునితో జోసెఫ్ ఫోన్లో తరచూ మాట్లాడినట్టు పలు మీడియా చానెళ్లు తెలిపాయి. నిర్మాత జోసెఫ్ సహాయంతోనే పల్సర్ సుని తప్పించుకున్నట్టు వెల్లడించాయి. 'నిర్మాత అంటో జోసెఫ్‌ను ఇంకా పోలీసులు ఎందుకు ప్రశ్నించడం లేదు.. చివరిసారిగా అతనితో మాట్లాడిన తర్వాతే పల్సర్ సుని తన ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసినట్టు కాల్ రికార్డ్స్‌తోపాటు, పోలీసులు ధ్రువీకరిస్తున్నారు' అని సీనియర్ జర్నలిస్టు ఉల్లేక్ ఎన్పీ ఫేస్బుక్లో ప్రశ్నించారు. ఈ కేసులో సినీ ప్రముఖుల హస్తముందని అనుమానాలు వెలువడటంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని కేరళ క్రైంబ్రాంచ్ ఐజీ దినేంద్ర కశ్యప్ చెప్పారు. సినీ పరిశ్రమలోని కొంతమంది జోక్యం సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. నేరసామ్రాజ్యంతో సినీ చీకటి సంబంధాలు! ప్రముఖ నటి కిడ్నాప్, అత్యాచారం ఘటన నేపథ్యంలో కేరళ చిత్రపరిశ్రమకు, నేరసామ్రాజ్యానికి ఉన్న చీకటి సంబంధాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్సర్ సుని ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతడు, ఇతర సహా నిందితులు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగానే..మరోవైపు మాలీవుడ్‌తో నేరసామ్రాజ్యానికి ఉన్న చీకటి సంబంధాలు చర్చనీయాంశమయ్యాయి. నటులు, సినీ ప్రముఖులు తమ సొంత భద్రత కోసం నేరచరిత్ర కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్న సంగతి పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమేనని, భారీమొత్తంలో డబ్బుతో ప్రయాణించాల్సి ఉండటంతో క్రిమినల్స్‌ని నటులు తమ బాడీగార్గులుగా నియమించుకుంటారని ఓ పోలీసు అధికారి తెలిపారు. చాలామంది ప్రముఖ నటులకు, సినీ పెద్దలకు క్రిమినల్స్ డ్రైవర్లుగా, బాడీగార్డులుగా ఉన్నారని ప్రముఖ న్యాయవాది హరీశ్ వాసుదేవన్ 'ఆసియా నెట్' చానెల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. రౌడీషీటర్లు, నేరగాళ్లతో ప్రముఖ నటులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారిని తమ డైవర్లు, బాడీగార్డులుగా నియమించుకోవడమే కాదు.... ఏకంగా బహిరంగ కార్యక్రమాలు, అవార్డు వేడుకలకు వారితోపాటు హాజరవుతుంటారని చెప్పారు. భూముల కొనుగోళ్లు, మనీ లెండింగ్ వంటి వ్యవహారాల్లో నటులు నేరగాళ్ల సహాయం తీసుకుంటున్నారని తెలిపారు.