breaking news
anti venom
-
కాటేస్తే.. వెంటనే తీసుకు రండి
సాక్షి, కృష్ణా జిల్లా: వర్షాలు పడుతుండడంతో పాములు రెచ్చిపోతున్నాయి. జిల్లాలోని మొవ్వ మండలంలో పాము కాట్లు పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే ఐదుగురు పాము కాటుకు గురయ్యారు. గత మూడు రోజులుగా చూస్తే మొత్తం 26 మంది పాము కాటుకు బలయ్యారు. ఈ నేపథ్యంలో మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లను అదనంగా నిల్వ చేసింది. దీంతో బాధితులు ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు. పాములు కాటేసిన వెంటనే ఆలస్యం చేయకుండా బాధితులను ఆసుపత్రికి తీసుకొస్తే ప్రాణాపాయ నుంచి కాపాడతామని డాక్టర్ శొంఠి శివరామకృష్ణ తెలిపారు. -
ఏంటా పని... చావును చేతిలో పట్టుకున్నావే!
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వైరల్ వీడియో కోసమని ఇటీవలే ఓ వ్యక్తి క్రూయిజ్ షిప్‌లోని 11వ అంతస్తు నుంచి నీళ్లలో దూకిన సంగతి తెలిసిందే. అయితే అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడినప్పటికీ నెటిజన్ల చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. తాజాగా ఓ టూరిస్టు కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. దాని విషానికి విరుగుడు లేదు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఓ వ్యక్తి బీచ్‌లో సరదాగా నడుస్తూ అత్యంత విషపూరితమైన నీలం రంగు వలయాలు కలిగి ఉన్న ఆక్టోపస్(బ్లూ రింగ్డ్)ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత దానితో ఆటలాడుతూ టిక్ టాక్ వీడియో రూపొందించి.. ‘ఈ బుజ్జి ఆక్టోపస్’ ఎంత బాగుందో అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు టూరిస్టు తీరుపై మండిపడుతున్నారు. ‘ ఏంటా పని. అది విషపూరితమైన ఆక్టోపస్రా నాయనా.. దాని విషానికి విరుగుడు కూడా లేదు.. చావును చేతిలో పట్టుకోవడం సరదా అనుకుంటున్నావా’ అంటూ ఒకరు చీవాట్లు పెడితే.. ‘ ఇంతటి పిచ్చి పనిచేసిన నువ్వు ఇంకా బతికి ఉన్నావంటే నిజంగా అదృష్టం అంటే నీదే’ అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా చూడటానికి ఎంతో అందంగా కనిపించే బ్లూ రింగ్డ్ ఆక్టోపస్‌లు అత్యంత విషపూరితమైనవి. వాటి విషం మానవ శ్వాస కోశ వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తుంది. బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ విషం గనుక ఎక్కినట్లైతే నిమిషాల వ్యవధిలో మనుషులు ప్రాణాలు కోల్పోతారు. వీటి విషానికి ఇంతవరకు విరుగుడు కనుగొనలేదు. -
కాటేస్తే.. కాటికే.!
సాక్షి కడప: ప్రస్తుత సీజన్లో విషసర్పాల సంచారం అధికమైంది. గడ్డిపొదల చాటున.. దంతెల మాటునో.. పాత గోడల సందుల్లోనో..కుళ్లిన వ్యర్థ పదార్థాల మధ్యనో సర్పాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. పైగా వర్షం పడిన సందర్భంలో ఉక్కపోతకు లోపల ఉండలేక రోడ్లపైకి రావడం మనకు కనిపిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం బారిన పడక తప్పదు. అయితే అక్కడక్కడ పాముకాటుతో ప్రాణాలు పోతున్నాయి. జిల్లాలో కొన్నిచోట్ల విషానికి విరుగుడు ఇంజక్షన్లు లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరించి అన్నిచోట్ల మందులు ఉండేలా చర్యలు చేపట్టాలి. సీజన్లో పాములతో ప్రమాదం ప్రమాదమే. జూన్ నుంచి డిసెంబరు వరకు విష సర్పాలు ఎక్కువగానే సంచరిస్తుంటాయి. ఎందుకంటే వర్షాకాలంతోపాటు చలికాలంలో గడ్డి బాగా పెరగడం, ముళ్ల పొదలు, పంట పొలాలు కూడా పచ్చగా ఉండడంతో వాటి మధ్య ఉండటానికి అవకాశం ఉంటుంది. రాత్రి పూట కూడా పొలాల్లో...గట్లమీద, కాలువల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. జూన్ నుంచి డిసెంబరు వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు కురిసిన సమయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తేనే ప్రమాదాన్ని పసిగట్టగలం. జిల్లాలో అనేక రకాల పాములు మన ప్రాంతంలో కట్లపాము, నాగుపాము, రక్తపింజిరి, జర్రిపోతు, కోడె నాగు, పసిరిక పాము తదితర జాతికిచెందిన పాములే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అటవీ ప్రాంతంలో కొండచిలువ లాంటి పాములు అరుదుగా కనిపిస్తున్నా జనవాసాల్లోకి రావడం తక్కువే. అందులోనూ కొన్ని పాముల్లో విషం ఉంటే, మరికొన్ని పాముల్లో విషం ఉండదని పరిశోధకులు వివరిస్తున్నారు. పాముకాటేస్తే పరేషాన్ జిల్లాలో పాము కాటుకు గురైన వారికి వేయాల్సిన యాంటీ వీనమ్ మందులను కొన్ని పీహెచ్‌సీల్లో సంబంధిత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కొనుగోలు చేస్తే.. కొన్నిచోట్ల స్టాకు లేదని తెలుస్తోంది. ఎక్కడైనా మారుమూల పల్లెల్లో పాముకాటుకు గురైన వారు నేరుగా పీహెచ్‌సీకి వస్తారు. తర్వాతే ఎక్కడైనా పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వచ్చిన బాధితులకు సకాలంలో విషానికి విరుగుడు మందు అందేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖపై ఉంది. రికార్డుల్లో మరణం లేదు జిల్లాలో ఈ జూన్ నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖ జాబితాలో కేవలం ముగ్గురు మాత్రమే పాముకాటుకు గురైనట్లు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. వారు కూడా పాముకాటుకు గురైన తర్వాత కోలుకున్నట్లు చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు పరిధిలోని రెడ్డివారిపల్లెకు చెందిన వృద్ధురాలు రామసుబ్బమ్మ (70), అదే మండలంలోని అరవీడు పంచాయతీకి చెందిన శశికళ జులై నెలలో పాముకాటుకు గురై తుదిశ్వాస వదిలారు. అలాగే బద్వేలులోని విద్యానగర్‌కు చెందిన కె.నాగమ్మ (65) అనే మహిళ అక్టోబరు 4న పాముకాటుతో తనువు చాలించింది. ఇంకా జిల్లాలో అనేక మంది విష సర్పాల కాటుకు గురైనా అధికారిక లెక్కల్లో మాత్రం కేవలం ముగ్గురే ఉండడం చూస్తే విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ముంపు వాసులను బెంబేలెత్తిస్తున్న పాములు జిల్లాలోని గండికోట ముంపు గ్రామాల పరిధిలో పాములు హడలెత్తిస్తున్నాయి. గండికోట జలాలు ఇప్పటికే గ్రామాలను చుట్టుముట్టడంతో పాముల సంచారం ఎక్కువైంది. నీళ్లలోనుంచి పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని ముంపు బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విష సర్పాలు..పాముకాటుపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాలివీడు మండలం అరవీడు పంచాయతీ కూర్మయ్యగారిపల్లెకు చెందిన కె.శశికళ జులై 29న పాముకాటుకు గురైంది. ఆమె వారు సాగు చేసిన బొప్పాయి తోటలో గడ్డి తీస్తుండగా రక్తపింజరి సర్పం కాలికి కాటేసింది. వెంటనే భర్త మల్రెడ్డి ఆమె ఇంటికి రాగానే నేరుగా కుటుంబీకులు బెంగళూరుకు తీసుకెళ్లి వైద్యం అందించారు. మూడు రోజుల తర్వాత ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. పులివెందుల నియోజకవర్గంలోని ఓ పీహెచ్సీ పరిధిలో ఇటీవల ఓ రైతు దానిమ్మ తోటకు మందు పిచికారీ చేస్తున్నాడు. చెట్టు మీద ఉన్నదో లేక కింద ఉన్నదో తెలియదుగానీ ఒక కాలికి పురుగు కాటు వేసింది. తర్వాత కొద్దిసేపటికీ మరో కాలికి కాటేయడంతో భయపడిన ఆయన 24 గంటల ఆస్పత్రికి పరుగులు తీశాడు. అప్పటికే ముఖమంతా వాపు వచ్చి మొత్తం చెమటలతో శరీరమంతా తడిసిపోయింది. ఒకింత భయంతో ఆందోళన చెందుతున్న ఆయనకు ధైర్యం చెప్పి పీహెచ్సీ వైద్యులు ఇంజక్షన్ అందించారు. మందుల కొరత లేదు జిల్లాలో పాముకాటుకు సంబంధించి ఎక్కడా కూడా మందుల కొరత లేదు. అన్నిచోట్ల పాము కాటు విషం విరుగుడుకు వాడే మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు మూడు కేసులే నమోదయ్యాయి. అందులోనూ మరణాలు లేవు. – డాక్టర్ ఉమాసుందరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, వైఎస్సార్ జిల్లా -
పాము కాటుకు సరికొత్త విరుగుడు
ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులు పాము కాటుకు బలై మరణిస్తే ఎంతో బాధగా ఉంటుంది. ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా వేలాది పెంపుడు జంతువులు ఇలా పాముల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక మీదట ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు ఈ తరహా పాము కాటుకు విరుగుడు చికిత్సను కనుగొన్నారు. చాలా తక్కువ ఖర్చుతో, అత్యంత సమర్థంగా పనిచేసే విషం విరుగుడు మందును కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ప్రధానంగా పిల్లులు, కుక్కలను పాము కాటు బారి నుంచి కాపాడుతుంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పది రకాల పాములు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఇవి తరచు పెంపుడు జంతువులను కాటేయడం.. వాటికి చికిత్స లేక అవి మరణించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. దీంతో శాస్త్రవేత్తలు విక్టోరియా ప్రాంతంలోని చిన్న చిన్న బయోటెక్ కంపెనీలతో సమన్వయం చేసుకుని.. ప్రధానంగా ఈస్ట్ బ్రౌన్, టైగర్ పాముల కాటు నుంచి పెంపుడు జంతువులను రక్షించే మందును తయారుచేశారు. చాలాకాలంగా తాను పిల్లులు, కుక్కల కోసం విషం విరుగుడు చికిత్సను కనుగొనేందుకు పరిశోధనలు సాగిస్తున్నానని, అయితే సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తల నైపుణ్యం ఆ మందు తయారీకి ఎంతగానో ఉపయోగపడిందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త పడులా చెప్పారు. తుది పరీక్షలు ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాలో ఈ మందు అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మందును మరికొంత అభివృద్ధి చేస్తే మనుషులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుందని అంటున్నారు.