breaking news
anndmk
-
బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టుకు జయలలిత!
చెన్నై:బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ కోసం సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు. అంతే కాకుండా ప్రత్యేక కోర్టు విధించిన శిక్షపై కూడా స్టే విధించాలని ఆమె కోర్టుకు విన్నవించనున్నారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన వ్యూహాలపై జయలలిత తరుపు న్యాయవాదులు చర్చించారు. మంగళవారం బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయసలహాదారులు పేర్కొన్నారు. మూడేళ్ల కన్నా ఎక్కువకాలం శిక్ష పడితే హైకోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వాలని సీనియర్ న్యాయవాది బి.కుమార్ తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టుకు దసరా సెలవులు. -
తమిళనాట విధ్వంసకాండ
-
తమిళనాట విధ్వంసకాండ
రాష్ట్రవ్యాప్తంగా జయ అభిమానుల ఆందోళనలు బస్సుల దహనం, ద్విచక్ర వాహనాల ధ్వంసం డీఎస్పీపైనే పెట్రోలు పోసిన నిరసనకారులు చెన్నై . ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడం తమిళనాట విధ్వంసానికి దారితీసింది. అన్ని జిల్లాల్లోనూ అన్నాడీఎంకే శ్రేణులు, జయలలిత అభిమానులు చెలరేగిపోయారు. కోర్టు తీర్పు కోసం శనివారం ఉదయం నుంచే ప్రజలు, పార్టీ శ్రేణులు ఉత్కంఠతో టీవీలకు అతుక్కుపోయారు. జయను కోర్టు దోషిగా ప్రకటించినట్లు మధ్యాహ్నం వార్తలు వెలువడగానే అమ్మ అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. రైల్‌రోకో, రాస్తారోకోలు నిర్వహించారు. చెన్నైలో రోడ్లపై తిరుగుతున్న అనేక బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. కరుణానిధి, స్టాలిన్, అళగిరి, సుబ్రహ్మణ్యస్వామి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆందోళనలతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలను ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు సైతం నిలిచిపోయాయి. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వచ్చే బస్సులను ముందుజాగ్రత్త చర్యగా నిలిపేశారు. కాంచీపురంలో 8 బస్సులను తగులబెట్టారు. తిరువళ్లూరులో ఆందోళనకారులను అడ్డుకున్న టౌన్ డీఎస్పీ చంద్రశేఖరన్‌పై అల్లరిమూకలు పెట్రోలు పోసి నిప్పంటించే యత్నం చేశాయి. అయితే పోలీసులు, స్థానికులు ఆయన్ను రక్షించారు. జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం ఆందోళనలతో అట్టుడికింది. అమ్మ మద్దతుదారులు మధురైలోని కరుణ పెద్దకుమారుడు అళగిరి ఇంటిపైనా, చెన్నైలోని సుబ్రహ్మణ్యస్వామి నివాసంపైనా రాళ్ల వర్షం కురిపించారు. చెన్నై గోపాలపురంలో కమలకన్నన్ అనే అన్నాడీఎంకే కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి యత్నించాడు. చెన్నైలోని జయ నివాసం వద్ద మీడియా ప్రతినిధులపై ఆందోళనకారులు దాడులకు పాల్పడి కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లో 20 మంది వరకూ గాయపడ్డారు. రాష్ట్రం మొత్తం మీద వెయ్యి మందికిపైగా అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మ మద్దతుదారుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రవాప్తంగా పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. మరోవైపు అన్నాడీఎంకే కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో డీఎంకే కార్యాలయాలు, ఆ పార్టీ సీనియర్ నేతలకు అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి భద్రతను పెంచారు. శాంతిభద్రతలపై గవర్నర్ సమీక్ష తమిళనాడులో తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడటంతో చెలరేగిన అల్లర్లపై రాజ్‌భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితిని అధికారులు గవర్నర్‌కు వివరించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు.