breaking news
Anantha-Amravati Express Way
-
మళ్లీ తెరపైకి అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే
సాక్షి, అమరావతి: అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే భూసేకరణపై మొన్నటివరకు నాన్చివేత వైఖరి అవలంబించిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు భూముల్ని సేకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బలవంతంగానైనా పేదల భూముల్ని లాక్కునేందుకు రంగంలోకి దిగింది. దీనికిగాను డిప్యుటేషన్‌పై రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటీ కలెక్టర్ల నియామకాలు చేపట్టింది. బుధవారం నలుగురు డిప్యూటీ కలెక్టర్లను భూసేకరణ కోసం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ చివరలో రెవెన్యూ అధికారులు భూమిని గుర్తించి నివేదికను అందించారు. కేంద్రంతో ఒప్పందం ప్రకారం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలి. గుంటూరు జిల్లాలో 32 గ్రామాల పరి«ధిలో 4,035 ఎకరాలు, ప్రకాశంలో 66 గ్రామాలకు చెందిన 8,098 ఎకరాలు, వైఎస్సార్ కడపలో 31 గ్రామాల్లోని 2,771 ఎకరాలు, కర్నూలు జిల్లాలోని 45 గ్రామాలకు చెందిన 4,284 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 24 గ్రామాల పరిధిలో 2,542 ఎకరాల భూమి తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుంటూరు మినహా తక్కిన నాలుగు జిల్లాల్లో అటవీ భూమి 4,009 ఎకరాలు కావాలి. భూసేకరణ చేపట్టేందుకు ఈ ఏడాది జూలైలో ప్రయత్నించిన ప్రభుత్వానికి అన్ని చోట్లా వ్యతిరేకత ఎదురైంది. పెగ్మార్కింగ్కు వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. భూసేకరణపై వెనకడుగు వేసిన ప్రభుత్వం అవసరమైన నిధులు కేంద్రమే సమకూర్చాలని మెలిక పెట్టింది. దీనికి కేంద్రం అంగీకరించలేదు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టుకు రూ.29,557 కోట్ల మేర వ్యయం అవుతుందని అప్పట్లో తేల్చారు. ఆ తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందా? అని ప్రశ్నిస్తే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ తమ ప్రతిపాదనలోనే లేదని స్పష్టం చేయడం తెలిసిందే. భూసేకరణకు డిప్యుటేషన్‌పై నియమించిన డిప్యూటీ కలెక్టర్లు వీరే.. కాగా భూసేకరణకు డిప్యుటేషన్‌పై రెవెన్యూ శాఖ డిప్యూటీ కలెక్టర్లు ప్రభాకరరావు, బి.పుల్లయ్య, ఎం.వెంకటేశ్వర్లు, ఎస్.రాఘవేంద్రలను స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఆర్ అండ్ బీ ఈఎన్సీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
‘ఆర్వీ’కి అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే
ఎన్హెచ్ఏఐతో కలసి పెగ్ మార్కింగ్‌కు కసరత్తు సాక్షి, అమరావతి: అనంతపురం–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అలైన్మెంట్ బాధ్యతల్ని ప్రభుత్వం ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగించింది. రాజధానికి సీడ్ యాక్సెస్ రోడ్డు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీతో పాటు అనంత– అమరావతి రోడ్డు డీపీఆర్ బాధ్యతల్ని గతంలో ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగించిన ప్రభుత్వం తాజాగా అలైన్మెంట్ బాధ్యతల్ని కూడా అదే సంస్థకు అప్పగించింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేయించాల్సిన అలైన్మెంట్, భూసేకరణ తదితర బాధ్యతల్ని ఏకంగా కన్సల్టెన్సీకి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు అలైన్మెంట్, భూ సేకరణ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టాల్సి ఉంది. ఈ రహదారికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నందున మొత్తం పనులు ఎన్హెచ్ఏఐ పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. అయితే ఆర్వీ అసోసియేట్స్ ఎన్హెచ్ఏఐతో కలిసి సర్వే నిర్వహిస్తుందని ఆర్అండ్బీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.