breaking news
ameer peta
-
మైత్రీవనం వద్ద అదే సీన్
ఒకే ఒక్క గంట కురిసిన జడివాన అమీర్‌పేట్‌ను గడగడలాడించింది. జనసంద్రంగా ఉండే ప్రధాన రహదారి జలసాగరంగా మారిపోయింది. ఎప్పటిలాగానే మైత్రీవనమ్ చౌరస్తా గో‘దారి’ని తలపించింది. మైత్రీవనం వద్ద భారీగా చేరిన నీటితో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. దీని ప్రభావం అటు ఎస్ఆర్నగర్, ఇటు పంజగుట్ట జంక్షన్లపై కూడా పడింది. చౌరస్తాలో నిలబడి విధులు నిర్వర్తించేందుకు కూడా ఆస్కారం లేకపోవడంతో ట్రాఫిక్ సిబ్బంది సైతం చేతులెత్తేశారు. వేసవి కాలం ప్రారంభంలో కురిసిన కొద్దిసేపు వర్షానికే మైత్రీవనం చౌరస్తా మునిగిపోవడం వెనుక నాలా పూడికతీత పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడమే కారణమని పలువురు పేర్కొంటున్నారు. గత ఏడాది మైత్రీవనం నుంచి డీకే రోడ్డు మీదుగా లీలానగర్ వరకు సుమారు రూ.26 లక్షల నిధులతో పూడికతీత పనులు చేపట్టారు. వాటిపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం వాటి పనితీరు ఏ స్థాయిలో ఉందో బయటపడింది. ఫలితంగా ఇక్కడ భారీ పైప్లైన్లు నిర్మించినా ప్రయోజనం లేకపోయింది. -
తెగిన చేయి అతికింది
సాక్షి, హైదరాబాద్: ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని తెగిపోయిన ఓ బాలిక చేతిని అమీర్‌పేట్‌లోని ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అతికించారు. బాధితురాలు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. గురువారం ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అనురాగ్ చిత్రాన్షి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్‌రెడ్డి చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మణికట్టు పైభాగంలో తెగిన భాగాలను ఆరు గంటల వ్యవధిలో, కింది భాగాలను 16 గంటల వ్యవధిలో అమర్చవచ్చని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన తనిష్క(9) హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్‌లోని తన తాత గంగాధర్ ఇంట్లో ఉండగా డిసెంబర్ 10వ తేదీన బాలిక కుడిచేయి ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. విషయం తెలియక కింది అంతస్థులో ఉన్నవారు బటన్ నొక్కడంతో లిఫ్ట్ వేగంగా కదలి బాలిక మణికట్టు పైభాగం వద్ద పూర్తిగా తెగిపోయింది. రక్తమోడుతున్న పాపతో పాటు తెగిపడిపోయిన భాగాన్ని ఘటన జరిగిన 20 నిమిషాల్లోనే చికిత్స కోసం సమీపంలోని ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తెగిపడిన చేతిని శుభ్రపరిచి ఐస్ గడ్డలతో నింపిన థర్మాకోల్ బాక్స్‌లో భద్రపరిచారు. మ. 2.30 గం.కు పాపను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. వైద్యులు సుమారు 8 గంటల పాటు శ్రమించి విరిగిపోయిన చేతి ఎముకతో పాటు సిరలు, ధమనులు, కండరాలను యథావిథిగా అమర్చి కుట్లు వేశారు. ఇలా అతికించిన ఆరు గంటల్లోనే ధమనుల్లో రక్త ప్రసరణ తిరిగి ప్రారంభమైంది. బాలిక చేయి అతుక్కున్నప్పటికీ అరచేతిలో ఇంకా స్పర్శ రాలేదు. భవిష్యత్తులో చేతికి స్పర్శ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ సతీష్‌రెడ్డి చెప్పారు. శస్త్ర చికిత్స కోసం రూ.2 లక్షలు ఖర్చు అయినట్లు బాలిక తాత గంగాధర్ తెలిపారు.