breaking news
Ambassadors of India
-
మీరే మా రాయబారులు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులే దేశానికి నిజమైన రాయబారులని ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడంలో వారి పాత్ర ఎంతో ఉందని కితాబిచ్చారు. కెన్యా రాజధాని నైరోబీలో ప్రారంభమైన శ్రీ కచ్చి లేమా పటేల్ సమాజ్ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. కెన్యా స్వాతంత్య్ర పోరాటంలో కచ్చి లేమా నాయకులు కీలక పాత్ర పోషించిన సంగతిని గుర్తుచేశారు. 2001లో భూకంపానికి గురైన గుజరాత్‌లోని కచ్ ప్రాంత పునర్నిర్మాణానికి ఆ సంస్థ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. ఒకప్పుడు ఎడారిని తలపించిన కచ్‌ను దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ భారత్‌లో పర్యటించని కచ్చి లేమా సభ్యులు అలహాబాద్ కుంభమేళాకు వచ్చి భారత సాంస్కృతిక, వారసత్వ గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆహ్వానించారు. -
రాష్ట్రాభివృద్ధికి సహకరించండి
బెంగళూరు: వివిధ దేశాల్లోని భారత రాయబారులు దేశ అభివృద్ధితో పాటు కర్ణాటక అభివృద్ధికి సైతం సహకారాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోరారు. నెదర్ల్యాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, ఐర్ల్యాండ్, కొరియా, మొజాంబిక్ దేశాల్లో భారత రాయబారులతో సీఎం సిద్ధరామయ్య గురువారమిక్కడి క్యాంపు కార్యాలయం కృష్ణాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రపంచ దేశాలకు భారత్‌ను పరిచయం చేయడంతో పాటు ఇక్కడున్న అవకాశాల గురించి తెలియజెప్పాలని కోరారు. అదే సందర్భంలో కర్ణాటకలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సైతం తెలియజేసి ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రస్తుతం కర్ణాటక దేశంలోనే మూడో స్థానంలో ఉందని వారికి వివరించారు. రానున్న పదేళ్లలో రాష్ట్రంలో రెండు ప్రముఖ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. తుమకూరు జిల్లాలో దేశంలోనే అతిపెద్దదైన ఉత్పదనా కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు భారత రాయబారులకు సీఎం సిద్ధరామయ్య వివరించారు.