breaking news
all of a sudden inspection
-
గిరిజన విద్యార్థులపై నిర్లక్ష్యమా..?
ఆగ్రహించిన కలెక్టర్ కృష్ణభాస్కర్ మరిమడ్ల(కోనరావుపేట) : ‘గిరిజన విద్యార్థులకు సరైన వసతులు లేవు. భోజనం సక్రమంగా పెట్టడంలేదు.. కనీసం విద్యాబుద్ధులు కూడా నేర్పించడంలేదు.. ఒక్క గణిత సమస్యకూ విద్యార్థులకు సమాధానం చెప్పడం లేదు. రోజూ ఏం చదు వు చెబుతున్నారు..? మీరేం చేస్తున్నారు.. గిరి జన విద్యార్థులంటే ఇంత నిర్లక్ష్యమా..?’ అని కలెక్టర్ కృష్ణభాస్కర్ ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పదో తరగతి విద్యార్థులను గణితశాస్త్రంపై ప్రశ్నలు అడిగారు. ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వంటశాలలో భోజనం తయారీని పరిశీలించారు. ఎంతమంది విద్యార్థుల కోసం భోజనం తయారు చేస్తున్నారని ప్రశ్నించగా సిబ్బంది, ప్రిన్సిపాల్ సరైన సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాల పైనే దృష్టి పెట్టారని, సిబ్బంది, నిర్వాహకులు ఇలా నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీఈవో రాధాకిషన్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రాయ్ ఉన్నారు. -
సర్కారు బడిపై నమ్మకం పెంచాలి
► జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ► ప్రాథమిక పాఠశాల తనిఖీ నేరడిగొండ : ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా పని చేయాలని ఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, మధ్యాహ్న భోజనం అందుతున్న తీరుపై విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో బోధనతోపాటు పరిసరాలు సక్రమంగా ఉండవనే అపనమ్మకం ప్రజల్లో ఉందని, దాన్ని పోగొట్టేలా అందరూ పని చేయూలని తెలిపారు. పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. పరిసరాల్లో అపరిశుభ్రత ఉండకుండా చూడాలని ఎంఈవో భూమారెడ్డిని ఆదేశించారు. కార్యాలయాల్లో తనిఖీ మండలంలోని తహసీల్దార్, ఎంపీడీవో, పశువైద్యశాలలను తనిఖీ చేశారు. పశువైద్య శాల మూసి ఉండడంతో వెంటనే తెరిపించి రికార్డులు పరిశీలించారు. వైద్యాధికారి ఉదయం వచ్చి మధ్యాహ్నం వెళ్లిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉంచాలని అన్నారు. ప్రతి శుక్రవారం మండలంలోని గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్న గ్రామదర్శిని కార్యక్రమంపై మండల ప్రత్యేక అధికారి మధుసూదనచారిని అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎంపీడీవో మహ్మద్ రియాజొద్దీన్, సూపరింటెండెంట్ చక్రపాణి, పంచాయతీ కార్యదర్శి నర్సారెడ్డి పాల్గొన్నారు. అవకతవకలు జరగకుండా చూడాలి ఇచ్చోడ : వ్యవసాయ మార్కెట్ యార్డులో అవకతవకలు జరగకుండా చూడాలని ఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. రైతులు విక్రయిస్తున్న పత్తికి వ్యాపారులు డబ్బు ఏ రూపంలో ఇస్తున్నారని ఆరా తీశారు. మార్కెట్లో ఉన్న వెబ్రిడ్డికి స్టాంపింగ్ అందుబాటులో ఉంచకపోవడంతో మార్కెట్ కార్యదర్శి రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక తహశీల్దార్ మోహన్‌సింగ్ పాల్గొన్నారు.