breaking news
All India Congress Party
-
ఇవేం ద్వంద్వ ప్రమాణాలు?
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ జైలులో నిర్బంధంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేలా అనుమతించాలని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ కోరడాన్ని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ జైల్లో ఉన్న చిదంబరంను విడుదల చేసి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. వెంటనే స్పందించిన విజయసాయిరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వం ప్రమాణాలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వ హయాంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో అక్రమంగా 16నెలలపాటు నిర్బంధించారని, అపుడు ఇదే చిదంబరం యూపీయే ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉండి సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్‌కు బెయిల్ రానీయకుండా చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కనీసం పార్లమెంటు సమావేశాలకు హాజరుకానీయాలని కోరినా అదే సీబీఐని అడ్డుపెట్టుకుని హాజరుకానీయకుండా చేసిన చరిత్ర చిదంబరానిది, కాంగ్రెస్ పార్టీదని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి చరిత్ర ఉన్న చిదంబరాన్ని ఇపుడు పార్లమెంటు సమావేశాలకు హాజరుకానీయాలంటూ కాంగ్రెస్ నాయకులు అనుమతి కోరడం విడ్డూరంగా ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని అఖిలపక్ష సమావేశంలో తాము స్పష్టంచేశామని ఆయన విలేకరులకు వివరించారు. కాగా, ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని వ్యాఖ్యానించారని విజయసాయిరెడ్డి తెలిపారు. -
సగంమంది సీఎంలు మహిళలే ఉండాలి: శోభా ఓజా
అదే రాహుల్ గాంధీ కోరిక ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా సాక్షి, హైదరాబాద్: మంచి నేతలు తయారు కావాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆకాంక్ష అని, అది మహిళలకే సాధ్యమవుతుందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా ఓజా చెప్పారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందుకు పోతోందని, ఈ తరుణంలో మహిళల భాగస్వామ్యం కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలన్నదే కాంగ్రెస్ కోరికని తెలిపారు. 105వ అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం గాంధీభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన మహిళా కార్యకర్తలతో ఆమె ఇష్టాగోష్టి నిర్వహించారు. క్రమశిక్షణ కొరవడిన జిల్లా నేతలు రాజీనామా చేయాల్సిందేనని హెచ్చరించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలో చెప్పాలంటూ మహిళలకు హితవు పలికారు. దేశంలో ముఖ్యమంత్రుల్లో సగం మంది మహిళలే ఉండాలన్నది రాహుల్‌గాంధీ ఆకాంక్షని చెప్పారు. జిల్లాల్లో రెండేసి సీట్లు చొప్పున మహిళలకు కేటాయిస్తే కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని రాష్ర్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత చెప్పారు. మహిళా జర్నలిస్ట్ ఉమాసుధీర్, వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న జానకిలను ఈ సందర్భంగా సన్మానించారు.