breaking news
Alibaba investments
-
భారత్‌లో ఆలీబాబా క్లౌడ్ సర్వీసులు
న్యూఢిల్లీ: చైనీస్ దిగ్గజం ఆలీబాబా తాజాగా భారత్‌లో తమ క్లౌడ్ సర్వీసులు అందించనుంది. ఇందులో భాగంగా ముంబైలో కొత్తగా డేటా సెంటర్ ప్రారంభిస్తోంది. ఇది వచ్చే నెలకల్లా అందుబాటులోకి రాగలదని ఆలీబాబా క్లౌడ్ (ఆలీబాబా గ్రూప్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం) తెలిపింది. భారత్‌లోని చిన్న, మధ్య తరహా సంస్థల్లో క్లౌడ్ కంప్యూటింగ్‌కి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ముంబైలోని డేటా సెంటర్ తోడ్పడుతుందని వివరించింది. అయితే, దీనిపై ఎంత ఇన్వెస్ట్ చేసినదీ కంపెనీ వెల్లడించలేదు. ‘ఆలీబాబా క్లౌడ్ గ్లోబలైజేషన్ వ్యూహంలో.. భారత్ కీలక మార్కెట్. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటం, భారతీయ సంస్థలు కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాలని ఆకాంక్షిస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో ఇక్కడ భారీగా వ్యాపార అవకాశాలు ఉన్నాయి‘ అని ఆలీబాబా క్లౌడ్ ప్రెసిడెంట్, ఆలీబాబా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సైమన్ హు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులు అందిస్తున్న టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లతో ఆలీబాబా పోటీపడనుంది. సర్వీస్ ప్లానింగ్, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ ప్రణాళిక అమలుకు అవసరమైన సహకారం మొదలైనవి అందించేందుకు ఆలీబాబా క్లౌడ్ స్థానికంగా ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని సైమన్ వివరించారు. భారత్‌లో సేవల కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో భాగమైన గ్లోబల్ క్లౌడ్ ఎక్స్చేంజ్ (జీసీఎక్స్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం జీసీఎక్స్కి చెందిన క్లౌడ్ ఎక్స్ ఫ్యూజన్ సర్వీసు ద్వారా ఆలీబాబా క్లౌడ్ ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ సేవలను నేరుగా పొందవచ్చని సైమన్ వివరించారు. అటు టాటా కమ్యూనికేషన్స్‌తో కూడా ఇదే తరహా ఒప్పందం ఉంది. కంప్యూటింగ్, స్టోరేజీ, బిగ్ డేటా ప్రాసెసింగ్ తదితర సర్వీసులు ఆలీబాబా క్లౌడ్ సూట్ ద్వారా అందుకోవచ్చు. ప్రస్తుతం ఇది 33 జోన్లలో అందుబాటులో ఉంది. -
స్నాప్‌డీల్‌లో ఆలీబాబా పెట్టుబడులకు బ్రేక్
కంపెనీ వాల్యుయేషన్‌పై ప్రతిష్టంభన న్యూఢిల్లీ: ఈకామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌లో చైనా దిగ్గజం ఆలీబాబా పెట్టుబడులు పెట్టేందుకు వాల్యుయేషన్లు అడ్డంకిగా మారాయి. స్నాప్‌డీల్ భారీ స్థాయిలో విలువను డిమాండ్ చేస్తుండటంతో ఇరు సంస్థల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం. స్నాప్‌డీల్‌లో 500-700 మిలియన్ డాలర్ల పెట్టుబడితో వాటాలు కొనుగోలు చేయాలని ఆలీబాబా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కంపెనీ విలువ 4-5 బిలియన్ డాలర్ల మేరంటుందని ఆలీబాబా లెక్క గట్టింది. కానీ తమ వేల్యుయేషన్ 6-7 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని స్నాప్‌డీల్ పట్టుపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని వల్ల రెండు సంస్థల మధ్య చర్చలు నిల్చిపోయినట్లు పేర్కొన్నాయి. స్నాప్‌డీల్ ఇప్పటిదాకా సుమారు 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్, దేశీ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఈ సంస్థలో ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఇందులో వాటాలను కొనుగోలు చేసిన పక్షంలో ఆలీబాబాకు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం దొరికేది. ఆలీబాబా ఇప్పటికే మొబైల్ కామర్స్ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో 25 శాతం వాటాలను కొనుగోలు చేసింది. మరోవైపు భారత్‌లోని ఈకామర్స్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనేక ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఆసక్తిగా ఉన్నప్పటికీ వేల్యుయేషన్లు అసాధారణ స్థాయుల్లో ఉంటుండటం వల్ల ఆచితూచి వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.