తొలి తెలంగాణ ఉద్యమనేత కన్నుమూత
మహబూబ్‌నగర్: 1969లో తొలి తెలంగాణ ఉద్యమనేత, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మసూద్ అలీ ఫారూఖీ(85) గురువారం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో కన్నుమూశారు. ప్రమాదవశాత్తు వెన్నెముకకు గాయం కావడంతో కొంతకాలంగా ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలి పారు. తొలితరం న్యాయవాదుల్లో ప్రముఖుడిగా పేరొందిన ఫారూఖీ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్కు లీగల్ అడ్వయిజర్‌గా పనిచేశారు.
1969 తెలంగాణ ఉద్యమంలో ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఆందోళనకారుల్లో స్ఫూర్తిని నింపారు. 80ఏళ్లకు పైబడిన వయస్సులో కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. 60ఏళ్ల క్రితమే జిల్లా కేంద్రంలో తొలి ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించి వందలాది మంది విద్యార్థులను ఆంగ్ల భాషలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన ఆల్‌మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.