breaking news
Akbar Al Baker
-
డెలివరీ ఆలస్యం.. 7 వేల కోట్ల నష్టం!
పారిస్: కంపెనీ తీసుకున్న ఆర్డర్ల డెలివరీలో ఆలస్యం కారణంగా ఎయిర్‌బస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోనుంది. నాలుగు భారీ జెట్ విమానాల కొనుగోలు కోసం చేసిన ఆర్డర్లను ఖతార్ ఎయిర్వేస్ వెనక్కి తీసుకుని ఎయిర్‌బస్ సంస్థకు ఊహించని షాకిచ్చింది. డెలివరీలో ఆలస్యం అయినందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఖతార్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఖతార్ ఎయిర్‌లైన్స్ ఆర్డర్ల రద్దు కారణంగా ఎయిర్‌బస్ సంస్థకు భారత కరెన్సీలో సుమారు రూ. 7,751 కోట్ల (1.2 బిలియన్ డాలర్ల) మేర నష్టం వాటిల్లనుంది. 'ఎయిర్‌బస్ సంస్థకు మేం నాలుగు జెట్ విమానాల కోసం ఆర్డరిచ్చాం. అయితే సాంకేతిక లోపాలు తలెత్తడం, ఆర్డర్ సకాలంలో ఇవ్వకపోవడం లాంటి వాటికి ఎయిర్‌బస్ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాం. కానీ డెలివరీ ఆలస్యమైన కారణంగా మా ఆర్డర్లను రద్దు చేసుకున్నామని' ఖతార్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అక్బర్ అల్ బకార్ వివరించారు. మరోవైపు గత బుధవారం 140 ఎయిర్‌బస్ జెట్ విమానాల కొనుగోలుకు చైనా ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఎయిర్‌బస్ ప్రతినిథి ఒకరు మాట్లాడుతూ.. ఏ350-900 జెట్ విమానాలను సరైన సమయంలో డెలివరీ ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నించాం. కానీ కుదరలేదు. వేరొక ఆర్డరిచ్చే కంపెనీకి వీటిని రీ డిజైన్ చేసి వారికి అనుకూలమైన మార్పులతో విక్రయించాల్సి ఉంటుంది. ఇది అంత సులువైన విషయం కాదు. జరిగే నష్టాన్ని ఎంతో కొంత మేర తగ్గించుకునేందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అధిక ఆర్డర్ల కారణంతో పాటు పరికరాల కొరత, అత్యంత నాణ్యత కోసం పాకులాడటం వల్లే ఈ తప్పిదం జరిగిందని కంపెనీ పేర్కొంది. -
‘ఖతార్’ దిగుతోంది!
⇒ దేశీయంగా విమానయాన సంస్థను ఏర్పాటు చేస్తామంటున్న ఖతార్ ఎయిర్వేస్ ⇒ 100% విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్న కొత్త విధానం ⇒ వంద జెట్‌లైనర్ విమానాలకు ఆర్డర్! లండన్: భారత్ విమానయాన రంగంలో ల్యాండ్ అయ్యేందుకు ఖతార్ ఎయిర్వేస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ దిశగా భారీ ప్రణాళికలను రూపొందిస్తున్న కంపెనీ.. ఈ ఏడాది చివరికల్లా వంద కొత్త జెట్‌లైనర్ విమానాలకు ఆర్డర్ పెట్టనుంది. వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో కార్యకలాపాల జోరు పెంచడానికి, ఇంగ్లండ్‌లో త్వరలో ఏర్పాటు చేయనున్న రెండు కొత్త వైమానిక మార్గాల కోసం ఇంత భారీ స్థాయిలో విమానాలను ఆర్డర్ చేయనున్నామని ఖతార్ ఎయిర్వేస్ సీఈఓ అక్బర్ అల్ బకర్ మంగళవారం చెప్పారు. ఇక్కడ జరిగిన ఖతార్–యూకే బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో పాల్గొన్న తర్వాత విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ వివరాలు ఆయన వెల్లడించారు. భారత్‌లో విమానయాన సంస్థను ఏర్పాటు చేయనున్నామని గత నెలలోనే ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. నిబంధనల మార్పుతో... భారత్‌లో ప్రవేశంపై ఖతార్ భారీగానే ఆశలు పెట్టుకున్నది. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత విమానయాన రంగంలో విదేశీ సంస్థలను అనుమతించే విషయంలో నిబంధనలను మరింతగా సరళీకరిస్తారన్న ధీమాను బకర్ తాజాగా లండన్‌లో వ్యక్తం చేశారు. ఖతార్ ప్రభుత్వ వెల్త్ ఫండ్‌తో కలసి భారత్‌లో విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు బకర్ కొద్దిరోజుల క్రితం వెల్లడించారు.. ఈ మేరకు త్వరలో భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామని కూడా అల్ బాకర్ చెప్పారు. కాగా ఈ సంస్థ ఇప్పటికే భారత్‌లోని న్యాయ నిపుణులతో కొత్త విమానయాన సంస్థ ఏర్పాటు కోసం సన్నాహాలు ప్రారంభించిందని సమాచారం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనల ప్రకారం దేశీ విమానయాన సంస్థల్లో విదేశీ సంస్థలకు వాటా పరిమితి 49% వరకే ఉంది. అయితే విదేశీ సావరిన్ వెల్త్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు వంద శాతం వరకూ వాటా కొనుగోలు చేయవచ్చని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సరళీకరించింది. దీన్ని ఆసరాగానే చేసుకుని ఖతార్ ఎయిర్వేస్ భారత్‌లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. గతంలోనూ ప్రయత్నాలు... అబుదాబికి చెందిన ఇతిహాద్ ఎయిర్వేస్ కంపెనీ భారత్‌కు చెందిన జెట్ ఎయిర్వేస్లో 24% వాటా కొనుగోలు చేసిన తర్వాత ఖతార్ ఎయిర్వేస్ కూడా భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించింది. ఇండిగో విమానయాన సంస్థను నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 2015లో ఐపీఓకు వచ్చినప్పుడు షేర్లను కొనుగోలు చేయాలని భావించింది. అయితే, సకాలంలో తగిన అనుమతులు రాక ఆ ప్రయత్నం విఫలమైంది. కాగా ఆసియాలోని ఇతర దిగ్గజ విమానయాన సంస్థలు ఇప్పటికే భారత్‌లోని జాయింట్ వెంచర్ల(జేవీ) భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. టాటా సన్స్ ఏర్పాటు చేసిన ‘విస్తార’లో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు, టాటా సన్స్ మరో జేవీ ఎయిర్ఏషియా ఇండియాలో మలేసియా ఎయిర్ఏషియా బెహద్కు 49% చొప్పున వాటాలున్నాయి. అడ్డుకుంటున్న దేశీ విమానసంస్థలు దేశీయ విమానయాన సంస్థల్లో యాజమాన్య హక్కులుండేలా విదేశీ సంస్థలకు అనుమతిని ఇస్తుండటంపై భారతీయ విమానయాన కంపెనీల సమాఖ్య(ఎఫ్ఐఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ఏడాది జనవరిలోనే పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఇదే అంశంపై ఎఫ్ఐఏ ప్రతినిధులు పౌర విమానయాన కార్యదర్శి ఆర్.ఎన్. చౌబేతో కూడా సమావేశమై తమ అభ్యంతరాలను వినిపించారు. దేశీయ విమాన సంస్థల్లో వంద శాతం యాజమాన్య హక్కులను విదేశీ ఇన్వెస్టర్లకు కట్టబెడితే అది దేశ భద్రతకు, రక్షణకు పెను ముప్పు అవుతుందనేది ఈ కంపెనీల వాదన. ఎఫ్ఐఏలో స్పైస్‌జెట్, జెట్ ఎయిర్వేస్, ఇండిగో, గో ఎయిర్ వంటి సంస్థలకు సభ్యత్వం ఉంది. అవసరమైతే కోర్టు ద్వారా అయినా ఖతార్ ఎయిర్వేస్ను అడ్డుకుంటామని ఎఫ్ఐఏ అంటోంది. ఎయిర్ ఏషియా ఇండియాలో మలేసియా ఎయిర్ఏషియా బెర్హద్కు, విస్తారలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లకు 49 శాతంవాటాను అనుమతించినందుకు ఇప్పటికే పౌర విమానయాన మంత్రిత్వ శాఖను ఎఫ్ఐఏ కోర్టుకు లాగింది.