breaking news
Ajit khan
-
మురికి కాలువ పక్క నిద్రించిన విలన్.. భార్య చనిపోతే డబ్బుల్లేక!
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కోట్లు వెనకేస్తారనుకుంటారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని భ్రమిస్తుంటారు. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొన్ని దశాబ్దాలు వెనక్కు వెళ్తే ఒకప్పుడు నటులు ఎంత దుర్భర జీవితం అనుభవించారో కళ్లకు కట్టినట్లు వివరించాడు దివంగత విలన్ అజిత్ తనయుడు షెహజాద్ ఖాన్. అతడు మాట్లాడుతూ.. 'సూపర్ హిట్ మూవీ నయా డౌర్(ఈ మూవీకి అజిత్ సహాయక నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నాడు) తర్వాత నాన్న కెరీర్ పతనం కావడం ప్రారంభమైంది. నాలుగైదేళ్లపాటు అతడికి అవకాశాలు రాలేదు. ఏ పనీ చేయలేదు. హీరోల వల్లే నాన్నకు కష్టాలు.. ఇందుకు ప్రధాన కారణం.. హీరోలకున్న భయమే! నాన్న సినిమాలో ఉంటే ఎక్కడ వారిని డామినేట్ చేస్తాడో అని భయపడ్డారు. ఆయనతో పని చేస్తే తనకే గుర్తింపు వస్తుంది, తనకే అవార్డులిచ్చేస్తారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోరని ఫీలయ్యారు. అందుకని అవకాశాలివ్వలేదు. అలా ఎన్నో కష్టాలు చూశాడు. కెరీర్ ప్రారంభంలో అయితే అంతకన్నా ఎక్కువే చూశాడు. ఓరోజు ముంబైలో మొహమ్మద్ అలీ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడున్న మురికి కాలువను చూపిస్తూ దీని పక్కనే పడుకున్నానని చెప్పాడు. ఆస్తులు లాక్కున్న బంధువులు హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చిన కొత్తలో రోడ్డుపైనే నిద్రపోయానన్నాడు. తన కాలేజీ పుస్తకాలు అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ముంబైకి వచ్చాడు' అని తెలిపాడు. మొదట్లో కష్టాలతోనే సావాసం చేసిన అజిత్ సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కాడు. 1960, 70వ దశకంలో టాప్ విలన్‌గా రాణించాడు. 1998లో మరణించాడు. కొంతకాలానికి ఆయన మూడో భార్య సారాకు క్యాన్సర్‌కు సోకింది. ఆ సమయంలో ఆమె వైద్య ఖర్చులు భరించడానికి షెహజాద్ అన్నయ్య ముందుకురాలేదట! ఆస్పత్రి బిల్లు కూడా కట్టలే! 'నాన్న పోయాక ఆయన కూడబెట్టిన డబ్బునంతా అన్నయ్య, బంధువులే పంచుకున్నారు. దీంతో అమ్మకు మంచి వైద్యం అందించడం నాకెంతో కష్టమైంది. అమ్మ చనిపోయినప్పుడు రూ.5000 ఆస్పత్రి బిల్లు కట్టడానికి కూడా అన్నయ్య నిరాకరించాడు. కానీ ఆమె ఆస్తులు, నగలు మాత్రం అన్నీ తీసుకున్నాడు' అని విచారం వ్యక్తం చేశాడు. కాగా షెహజాద్ అందాజ్ అప్నా అప్నా అనే సినిమాలో భల్లా అనే పాత్రతో ఫేమస్ అయ్యాడు. ఇతడు కూడా నటుడిగా రాణిస్తున్నాడు. చదవండి: సౌత్ ఇండస్ట్రీలో నటికి చేదు అనుభవం.. ఆఫీసుకు రమ్మని చివరకు.. -
గోల్కొండ లయన్.. హైదరాబాదీ అజిత్‌ఖాన్
‘సారా షెహర్ ముఝే లయన్ కే నామ్ సే జాన్తా హై’... మూడున్నర దశాబ్దాల కిందట బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన డైలాగ్ ఇది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘కాళీచరణ్’ సినిమాలో ఈ డైలాగ్ పలికిన విలన్ పాత్రధారి అజిత్‌ఖాన్. బాలీవుడ్లో ప్రాణ్ తర్వాత స్టైలిష్ విలన్‌గా ప్రేక్షకాదరణ పొందిన ఖ్యాతి అజిత్ ఖాన్‌కే దక్కుతుంది. అజిత్‌ఖాన్ అసలు పేరు హమీద్ అలీఖాన్. బాలీవుడ్లో వెలుగు వెలిగిన అజిత్ మన హైదరాబాదీనే. నిజాం జమానాలో చరిత్రాత్మకమైన గోల్కొండ ప్రాంతంలో 1922 జనవరి 27న పుట్టాడు. విద్యాభ్యాసమంతా వరంగల్‌లో సాగింది. అజిత్ తండ్రి బషీర్ అలీఖాన్ నిజాం సైన్యంలో పనిచేసే వారు. ఇంటి నుంచి పారిపోయి ముంబైకి... హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అజిత్ నటనపై మక్కువతో ఇంటి నుంచి పారిపోయి ముంబై చేరుకున్నాడు. ప్రయాణ ఖర్చుల కోసం కాలేజీ పుస్తకాలను అమ్మేశాడు. ముంబైలో చాలా ప్రయత్నాలు చేశాక చివరకు 1946లో ‘షాహే మిశ్రా’లో గీతాబోస్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత సికందర్, హతిమ్తాయ్, ఆప్ బీతీ, సోనేకీ చిడియా, చందాకీ చాంద్నీ వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. హీరోగా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో నెమ్మదిగా విలన్ వేషాలు వేయడం ప్రారంభించాడు. తొలిసారిగా ‘సూరజ్’లో విలన్‌గా కనిపించాడు. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జంజీర్’లో విలన్ పాత్రకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ‘జంజీర్’తో అమితాబ్ బచ్చన్ హీరోగా నిలదొక్కుకుంటే, అజిత్ విలన్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. విలన్లకే విలన్... సినిమాల్లో అజిత్ స్టైలే వేరు. సాఫిస్టికేటెడ్ వేషధారణ, నెమ్మదిగా పలుకుతూనే, ఎదుటివారి వెన్నులో వణుకు పుట్టించేలా డైలాగులు పలికే తీరు అజిత్‌ను విలన్లకే విలన్‌గా నిలిపాయి. ముఖ్యంగా 70వ దశకంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో అజిత్ ఎక్కువగా విలన్ గ్యాంగ్ నాయకుడి పాత్రల్లోనే ప్రేక్షకులను అలరించాడు. అజిత్ గ్యాంగులో జీవన్, ప్రేమ్చోప్రా, రంజీత్, కాదర్ ఖాన్, సుజిత్ కుమార్ వంటి ఛోటా విలన్లు ఉండేవారు. సినిమాల్లో విలన్ అన్నాక వ్యాంప్ తప్పనిసరి. అజిత్ సినిమాల్లోనూ ఒక వ్యాంప్ పాత్రధారిణి ఉండేది. తరచూ వ్యాంప్ పాత్ర పేరు ‘మోనా’గానే ఉండేది. ‘కళాపోషణ’ సన్నివేశాల్లో ‘మోనా! డార్లింగ్...’ అంటూ అజిత్ గోముగా పలికే తీరు అప్పట్లో అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేది. వందేళ్ల సినీచరిత్రలో విలన్ పాత్రలకు వన్నె తెచ్చిన వారిలో అజిత్ స్థానం ప్రత్యేకమైనది. ఈ బాలీవుడ్ ‘లయన్’ 1998 అక్టోబర్ 22న హైదరాబాద్‌లోనే కన్నుమూశాడు. మరణానికి మూడేళ్ల ముందు వరకు అంటే, 1995 వరకు సినిమాల్లో నటించాడు. - పన్యాల జగన్నాథదాసు