breaking news
Ajay gudavarthi
-
మతం, మార్కెట్ కలిసిన రాజకీయం
స్వేచ్ఛా మార్కెట్టు అనే భావనలో ఎటువంటి స్వేచ్ఛా లేదు. అది... మధ్యతరగతి వాళ్ళకు ‘మేం మంచిగానే ఉన్నా’మనిపించే కొనుగోలుదారీతనపు మానసిక తృప్తినీ, పేద సాదలకు కేవలం నానా ఇబ్బందులూ పడి రోజువారీ బతుకు బత్తెం సంపాదించుకునే అవకాశాన్నీ ఇచ్చే నిర్మాణం మాత్రమే! ఇక్కడ విజయానికీ, ఓటమికీ పూర్తిగా బాధ్యులు వ్యక్తులే గానీ వ్యవస్థ కాదు. ఇక, అంతిమ సత్యాన్ని వ్యక్తి అర్థం చేసుకోవడానికి మతం ఒక దారి చూపుతుంది. ఫలితాల సాధనకు గానీ, సాధించలేనితనానికి గానీ సంపూర్ణ బాధ్యత సాధకులదే తప్ప మరొకరిది కాదు. ఈ రకంగా దేశంలో మతమూ, మార్కెట్టూ నడుమ భావనాత్మక ఐక్యత కుదిరింది. ఇప్పుడు మతం సామాజిక జీవితాన్ని నయా ఉదారవాద మార్కెట్‌కు అనుకూలంగా మార్చే పనిముట్టు మాత్రమే! మతమూ, వ్యాపారమూ అనే జోడుగుర్రాల మీద నయా ఉదారవాద హిందూత్వం సవారీ చేస్తూ, వ్యక్తి వాద ఆత్మ తృప్తిని గొప్ప విలువగా ప్రచారం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా ప్రజలను తిప్పుకునే కార్యక్రమంలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి మతాన్ని రాజకీయ పనిముట్టుగా మార్చడం అయితే, మరోటి ఉదారవాద మార్కెట్టును ఆయుధంగా మార్చడం. తీవ్రమైన నయా ఉదార వాదం... సాయుధమూ, హింసాత్మకమూ అయిన మత ప్రతీకలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ప్రభుత్వ రంగ వనరులను కుదువ బెట్టి డబ్బుచేసుకోవడం, ప్రజల వనరులను ప్రైవేటు రంగానికి అప్పచెప్పడం అనే ఆర్థిక కార్యక్రమం... ఆదే సమయంలో వ్యక్తిగత వ్యవహారంగా ఉండాల్సిన మతాన్ని బజారుకు ఈడ్వడం అనే వ్యూహం ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్నాయి. వాస్తవానికి స్వేచ్ఛా మార్కెట్టు అనే భావనలో ఎటువంటి స్వేచ్ఛా లేదు. అది మధ్యతరగతి వాళ్ళకు ‘మేం మంచిగానే ఉన్నాం’ అని అనిపించే కొనుగోలుదారీతనపు మానసిక తృప్తినీ, పేద సాదలకు కేవలం నానా ఇబ్బందులూ పడి రోజు వారీ బతుకు బత్తెం సంపా దించుకునే అవకాశాన్నీ ఇచ్చే నిర్మాణం మాత్రమే! ఇంకా ఇప్పుడు బజార్లలో మనకి కనిపిస్తున్న మతానికి ఆధ్యాత్మిక వికాసంతో ఎటువంటి సంబంధం లేదు. అది ఇప్పుడు అధిక సంఖ్యాకుల ఆధిపత్యాన్ని గట్టి పరిచే పనిముట్టు మాత్రమే. దోపిడీని స్వేచ్ఛ అని చూపే నయా ఉదార మార్కెట్టు, బజారుకెక్కి హింసాత్మక అధి పత్యాన్ని గట్టిపరిచే మతం... ఒకదానితో ఒకటి పెనవేసుకొన్న కొంగొత్త దృశ్యం ఇది! భారతదేశంలో హిందుత్వ రాజకీయాలు... మార్కెట్టునూ, మతాన్నీ రెండింటినీ కలిపి జనాన్ని తన వైపు తిప్పుకోవడానికి వాడుకుంటున్న వైనం స్పష్టం. అంతిమ సత్యాన్ని వ్యక్తి అర్థం చేసుకోవడానికి మతం ఒక దారి చూపుతుంది. విశ్వాసపూరిత మత ప్రధాన ఆచరణ ద్వారానే అంతిమ సత్యం లేదా దైవం అనుభవం లోకి వస్తుందనేది మతం చెప్పే కీలక విషయం. దైవాన్ని లేదా అంతిమ సత్యాన్ని తెలుసుకోలేదు అంటే... అనుమానాలు, సందేహాలు లేని పూర్ణ విశ్వాసం లేకపోవడమే కారణం అనే తర్కాన్ని మతాలు వాడుతాయి అని కొంచం కొంచం పరిశీలించే వారికి తెలిసి పోతుంది. అంటే విశ్వాసం లేకపోవడం వల్లనే విశ్వాసం ఇచ్చే అనుభవాన్ని పొందలేకపోవడానికి అడ్డంకి అనే విచిత్రమైన తర్కాన్ని మతం ముందుకు తెస్తుంది. అంటే మతాన్ని పాటించాలి అంటే ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు. రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయో అన్న సంశయాత్మక దృష్టి కలిగి ఉండటం అంటేనే మతం పట్ల విశ్వాసం లేని స్థితి అవుతుంది. ఈ తర్కం నీకు అచంచల విశ్వాసం లేకుంటే (పూర్ణ విశ్వాసిగా) నీవు అనుకున్న ఫలితాలు సాధించలేవు అనే వైపునకు దారి తీస్తుంది. ఫలితాల సాధనకు గానీ, సాధించలేని తనానికి గానీ సంపూర్ణ బాధ్యత సాధకులదే తప్ప మరొకరిది కాదు అనే నిరంకుశ తర్కం ఇది. ఇక్కడ నేటి భారత దేశంలో ఉపయోగిత ప్రధానమైన మార్కెట్ తర్కంతో మనం ఆత్మ నిర్భరత సాధించాలి అంటున్నాం. ఈ ఆత్మ నిర్భరత శిఖరాన్ని చేరుకోవాలంటే ఒక్కో అంచె ఎక్కడానికి మనం చాలా ప్రయాస పడాలి. ఒకవేళ ఆ అంచెను ఎక్కడంలో విఫలం అయితే దానికి వ్యక్తుల అసమర్థత మాత్రమే కారణం (దానికి వ్యవస్థా గత కారణాలు ఉండవు). ఎవరి విజయానికి వారే బాధ్యులు అని గుర్తు పెట్టుకోవాలి. ఈ రకమైన చట్రం నుండి చూస్తే ఇక్కడ భద్రత అన్నది ప్రధాన విలువ అని తెలుస్తుంది. స్వేచ్ఛ అనే దానికి ఇక్కడ చోటు లేదు. వ్యక్తుల సముదాయాలు తమ తమ వ్యక్తిగత బాధ్యతా యుత ప్రయత్నాల ద్వారా మాత్రమే భద్రతను సాధించుకోవాలి. నిర్భయస్థితికి చేరుకోవాలి! మొత్తంగా వ్యక్తిగత భద్రత లేక నిర్భ యత్వం సాధించాలంటే స్వేచ్ఛను పక్కకు పెట్టి బాధ్యతగా పనిచేయ డమే దిక్కు అనేది ఈ తర్కం చెప్పుతున్న విషయం. మన దేశంలో ఈ రకంగా మతమూ, మార్కెట్టూ రెండూ వ్యక్తి బాధ్యతకు అధిక ప్రాధా న్యతని ఇస్తూ ఉన్నాయి. అట్లా వాటి నడుమ భావనాత్మక ఐక్యత కుదిరింది. గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న ప్రైవేటీకరణా, నయా ఉదరవాద ఆర్థిక సంస్కరణలూ, వాటి ఫలితాల వల్ల... స్వాతంత్య్రం తరువాత కాలంలో దేశంలో ప్రజలందరూ నిలబడిన జాతీయ విలువల సాధికారత నశించి పోయింది. ఇప్పుడు సంక్షేమం అంటే బుజ్జగింపో, లేక దానం పొందే అనుచరులను తయారు చేసుకునే వ్యవహారంగానో మారిపోయింది. హింసాత్మక నిరాకరణకు గురి కావడమో లేక పూర్తి విశ్వాస పూరిత విధేయత ప్రదర్శించడమో అనేవి మాత్రమే ఇప్పుడు సంక్షేమాన్ని ఆశించే వారి ముందున్న రెండు దారులుగా మారిపోయిన దుఃస్థితి ఉన్నది. అధికారానికి పూర్తిగా విధేయులుగా ఉన్నాం అని చెప్పుకునే దానికి ప్రమాణంగా ‘పరాయి వారు’గా ముద్రితమైన ముస్లింలను దూరం పెట్టాలి అనే ఒత్తిడి ఎల్లెడలా ఉంది ఇప్పుడు. ఈ నిరాకరణ– విధేయత చట్రానికి బయట ఉండే వారు పూర్తిగా ఒంటరులు. అదృష్టం, అరకొర అవకాశాల కోసం ఎదురు చూసే నిస్సహాయులు! ఇదీ ఈ దేశంలో ప్రస్తుతం విపరీతంగా ఊపులో ఉన్న హిందూ ఏకీకరణకు అందుతున్న మద్దతుకు వెనుక ఉన్న వాస్తవం. పెచ్చు పెరిగిపోతున్న వ్యక్తివాదం పక్కనే ఈ హిందూత్వ సాముదాయిక ఏకీకరణ కూడా జరుగుతోంది. ఇది ఒక విషాద వైపరీత్యం. వాస్తవానికి ఇది మతాన్ని సాయుధంగా మార్చి మార్కెట్ విస్తరణను నిరంతరాయంగా కొనసాగించే వ్యవహారం. ఇప్పుడు మన దేశంలో రాజ్య యంత్రానికి ఈ వ్యవస్థీకృత దుర్మార్గాన్ని, చట్టబద్ధ పాలన నుండి తప్పించే కొత్త బాధ్యత ఏర్పడింది. చట్టం అమలును పక్కన పెట్టివేయడం ఇప్పుడు నిత్య కృత్యం అయిపోయింది. ఢిల్లీ మత కల్లోలాల సందర్భంలో తప్పుడు కేసులు పెట్టడం, జహాంగీర్ పురిలో కూల్చివేతలు... ఈ నూతన రాజ్య ప్రవర్తనకు ఉదాహరణలు. చట్ట బద్ధ పాలన అనేది మెజారిటీ ప్రజల భద్రతకు అవరోధం అనే భావం బాగా ప్రచారం అవుతున్నది. చట్టబద్ధ పాలన, రాజ్యాంగ బద్ధ ప్రవర్తన అనే మాటలకు – ‘మైనారిటీలను బుజ్జగించడం’ అనే విపరీ తార్థాలు తీస్తున్నారు. మన నడుమ ఇప్పుడు మతంగా ఉన్నది సామాజిక జీవితాన్ని మొత్తంగా నయా ఉదారవాద మార్కెట్‌కు అనుకూలంగా మార్చే ప్రక్రియకి పనికి వచ్చే పెద్ద పనిముట్టు మాత్రమే. వ్యక్తివాదం, హద్దూ అదుపూ లేని ప్రైవేటు లాభాపేక్షను పెంచే నయా ఉదార వాద మార్కెట్ అనే నేలలో ఈనాటి మతోన్మాద మూలాలు ఉన్నాయన్నది గమనించాల్సిన వాస్తవం. పండుగలు ఇప్పుడు ఉత్సాహాన్నీ, ఆనం దాన్నీ పంచుకునే సందర్భాలు కావు. అవి హింసాత్మక శక్తి ప్రదర్శన లుగా మారిపోయాయి. ఈ దుర్భర పరిస్థితిని ఎదుర్కోవడానికి మన దేశంలో అంతర్గతంగా చాలా ప్రయత్నాలు జరగాలి. బయటి నుండి వచ్చి ఎవరూ మనలను కాపాడే స్థితి లేదు. తక్కువలో తక్కువ ప్రయ త్నంగా, ముందుగా ఎట్టి పరిస్థితిలోనూ హింసకు ఆమోదం తెలప కుండా, మెజారిటీ ప్రజలకు ఉన్న అభద్రత ఏమిటి? దాని కారకాలు ఏమిటి? అన్న అంశాలను పట్టించుకోవాలి. మీ మంచికీ, చెడుకూ మీరే కారణం అని చెప్పే మార్కెట్ ఆధారిత స్వచ్ఛందతా ఉప దేశాలను వెనక్కు నెట్టేసి... నియమ బద్ధమూ, వ్యవస్థీకృతమూ అయిన సంక్షేమాన్ని ముందుకు తేవాలి. విషపూరిత మత వాదానికి... మెజారిటీ, మైనారిటీ మతçస్థులు ఎవరు పాల్పడినా ఎటువంటి మిన హాయింపు ఇవ్వకుండా దాన్ని ఎండగట్టి, తీవ్ర విమర్శకు నిలపడం ఇప్పుడు జరగాలి. దేశంలో నిండి పోతున్న విషాలకు ఇప్పుడు విరుగుడు కావాలి. అది దేశం లోపటినుండే రావాల్సి ఉంది. వ్యాసకర్త: ప్రొ‘‘ అజయ్ గుడవర్తి ఢిల్లీ జేఎన్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్ -
ప్రాతినిధ్యం పెరగాలి.. ముస్లింలకు పాకిస్తాన్
* తెలంగాణ ముస్లింల డిమాండ్ * ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలి తెలంగాణలో ముస్లింల స్థితిగతులు, సామాజికంగా, రాజకీయంగా వారికున్న అవకాశాలు, ఆకాంక్షలు తదితరాలపై మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో జేఎన్‌యూ సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి ఒక సర్వే నిర్వహించారు. ముస్లిం సంస్థల నేతలతోపాటు లాయర్లు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, జర్నలిస్టులు, వ్యాపారులు, మధ్య తరగతికి చెందిన వారు... ఇలా అన్ని రంగాలకు చెందిన ముస్లింల నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించారు. దాని ముఖ్యాంశాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ముస్లింల జనాభా 12.5 శాతం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయి మెరుగవుతుందా? లేక ఇంకా దిగజారుతుందా? ఇది ప్రస్తుతం కీల కాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ముస్లింల అభిప్రాయం ఏమిటి? తెలంగాణ ఉద్యమంలో వారు చురుగ్గా పాల్గొన్నారా? తటస్థంగా ఉన్నారా? లేక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారా? ఉద్యమ సమయంలో తెలంగాణలో మత ప్రాతిపదికన చీలిక ఏర్పడిందా? లేక మరింత లౌకికత్వాన్ని సంతరించుకుందా? ‘సామాజిక తెలంగాణ’లో ముస్లింలకు స్థానముందా? తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం ల ప్రాబల్యం పెరుగుతుందని హిందువులు భయపడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో జరిపిన ఒక సర్వేలో కొన్ని వాస్తవాలు వెల్లడయ్యాయి. వాటి వివరాలు... మా సీట్లు మాకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత కేంద్రీకృత ముస్లిం జనాభా కారణంగా హిందూ ముస్లింల మధ్య చీలిక మరింత ప్రస్ఫుటమయింది. ప్రత్యేక రాష్ట్రంలో ముస్లింలు కోరుకుంటున్న సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను, రాజకీయ ప్రాతినిధ్యాన్ని హిందువులు దురాక్రమణపూరిత వైఖరిగా భావిస్తున్నారు. తమ వర్గం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ రాజకీయ ప్రాతినిధ్యం పెరగడమొక్కటే పరిష్కారమని ముస్లింలు భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. తమ జనాభా అధికంగా ఉన్న చోట పార్టీలు తమకే టికెట్లు కేటాయించాలని ముస్లింలు కోరుతున్నారు. తద్వారా ఆ స్థానాల్లో తమ అభ్యర్థినే గెలిపించుకుని చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలో ముస్లింలున్నారు. అయితే, దీన్ని మతం ప్రాతిపదికన ఓట్లను సమీకరించడంగా, ఓటుబ్యాంకు రాజకీయంగా హిందువులు భావిస్తున్నారు. నిజాం అనంతరం పేదరికంలోకి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం చెందిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా, నిజాం రాజును కర్కోటకుడిగా బీజేపీ పేర్కొంటోంది. దీన్ని తెలంగాణ లోని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఆసుపత్రి సహా ఎన్నో నిర్మాణాలు నిజాంల హయాంలోనే జరిగాయని, ఎంతోమంది హిందువులకు భూములనిచ్చి నిజాం వారిని దేశ్‌ముఖ్‌లను చేశారని వారు వాదిస్తున్నారు. ఏ రాజైనా భూస్వామ్య మనస్తత్వమే కలిగి ఉంటాడని, ముస్లిం కావడం వల్లనే నిజాం రాజును నియంతగా ప్రచారం చేస్తున్నారన్నది వారి వాదన. నిజాం పాలన తరువాత ఉర్దూను అధికార భాషగా తొలగించడం వల్ల ఆధునిక విద్యకు ముస్లింలు దూరమయ్యారు. దాంతో 1950లో ప్రభుత్వోద్యోగాల్లో ముస్లింలు 40% ఉండగా, 2010 నాటికి అది 5 శాతానికి చేరింది. అప్పుడు వారికి 35% భూములుండగా, ప్రస్తుతం అది 4 శాతానికి పడిపోయింది. పోలీస్ చర్య అనంతరం గ్రామాల్లోని ముస్లింలను వెళ్లగొట్టి వారి భూములను అక్కడి వెలమ, రెడ్డి కులస్తులు తీసేసుకున్నారు. ప్రస్తుతం 70% పైగా ముస్లింలు నగరాల్లో, చిన్నచిన్న పట్టణాల్లో మెకానిక్‌లుగా, టైలర్లుగా, డ్రైవర్లుగా జీవనం వెళ్లదీస్తున్నారు. ఉద్యమంపై భిన్న కోణాలు తెలంగాణ ఉద్యమం ప్రధానంగా భూమికి, నీటికి, వ్యవసాయ సంక్షోభానికి సంబంధించినది కావడంతో వ్యవసాయ భూములు లేని ముస్లింలను అది ఆకర్షించలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలోగ్రామాల్లోని ముస్లింలు తటస్థంగా ఉండటమో లేక నిశ్శబ్దంగా మద్దతు ప్రకటించడమో చేశారు. పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న ముస్లింలు ఉద్యమంపై నిరాసక్తత చూపారు. మధ్యతరగతి ముస్లింలు, ముస్లిం లాయర్లు, టీచర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉద్యమాన్ని ప్రోత్సహించారు. అందులో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో నివసించే ముస్లింలు, జిల్లాల్లో ఎంఐఎం పార్టీకి మద్దతిచ్చేవారు మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. అయితే తెలంగాణ ఉద్యమంలో ముస్లింలు చురుగ్గా పాల్గొనలేదన్న భావన హిందువుల్లో బలంగా ఉంది. ఉర్దూను అధికార భాషగా తొలగించిన తరువాత ముస్లింలు మిగతా సమాజంతో కలిసేందుకు ఇష్టపడలేదని, ఆధునిక విద్యపై ఆసక్తి చూపలేదని, అందువల్లనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేకపోయారని, అంతేగానీ వారిపై వివక్ష ఎన్నడూ లేదని వారు వాదిస్తున్నారు. ముస్లింలే దేశభక్తులు: ‘దేశ విభజన సమయంలో హిందువులకు భారత్‌లో ఉండటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. కానీ ముస్లింలకు పాకిస్తాన్ అనే ప్రత్యామ్నాయం ఉంది. అయినా, ముస్లింలు భారత్‌లో ఉండేందుకే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది నిజమైన దేశభక్తో?’ అని ఎంఐఎం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు హబ్దుల్ హజీమ్ ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రాంతీయతత్వం ఉంటే తెలంగాణలో మతతత్వం ఉందని నల్గొండకు చెందిన అనీస్ ముఖ్తాదార్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో ముస్లింలు అక్కడి సమాజంతో మమేకమయ్యారని, వెనకబాటుతనం కారణంగా తెలంగాణలో వారికి మిగతా సమాజంతో దూరం పెరిగిందని అనీస్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రలో అస్తిత్వం కోల్పోయారు ఈ అభిప్రాయంతో టీ జేఏసీ చైర్మన్ కోదండరాం విభేదిస్తున్నారు. ముస్లింలు ఆంధ్ర ప్రాంతంలో తమ భాష అయిన ఉర్దూ సహా తమ అస్తిత్వాన్ని, తమ ప్రత్యేకతను కోల్పోయారని, అందుకే అక్కడి సమాజంలో కలిసిపోగలిగారని వివరించారు. ‘ఇక్కడలా కాదు. వారి అస్తిత్వం ఇక్కడ బలంగా ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల ముస్లింలకు తమ గొంతుకను వినిపించే అవకాశం కలిగింది, వారితో చర్చలకు ఆస్కారం ఏర్పడింది. ఉద్యమంలోనూ వారు చురుగ్గా పాల్గొన్నారు’ అన్నారు. ఓట్లకు మతం రంగు మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి 2011లో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఈ హిందూ-ముస్లిం మధ్య ఓట్ల చీలిక స్పష్టంగా కనిపించింది. ఒక వర్గం ఓట్లను తమవైపుకు ఆకర్షించుకోవడం కోసం మత కలహాలు సృష్టించే ప్రయత్నాలు కూడా అప్పుడు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. లౌకికవాదం పఠించే తెలంగాణ జేఏసీ కూడా ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిందని ముస్లింలు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ముస్లింలు, రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో విరుద్ధ అభిప్రాయాలు కలిగిన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సమ్మిళిత అభివృద్ధి మంత్రం పఠిస్తున్నాయి. అయితే, రాజకీయ ప్రాతినిధ్యమే తమ సమస్యలకు పరిష్కారమని ముస్లింలు నమ్ముతుండగా, పార్టీలు మాత్రం టికెటిచ్చేందుకు గెలుపు అవకాశాలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. ముస్లిం వ్యక్తికి టికెటిస్తే ఆ నియోజకవర్గంలోని హిందూ ఓట్లకు దూరమవుతామన్న భయం పార్టీల్లో నెలకొని ఉంది. ముస్లింలకు టికెటిస్తే వారు గెలవలేరని, ఈ ఎన్నికల్లో ముస్లింలెవరికీ టికెటివ్వబోమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ప్రకటించారు. ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ నుంచి కూడా ఆయన వెనక్కు తగ్గారు. అయితే కేసీఆర్‌ను మతవాదిగా ఇక్కడి ముస్లింలు భావించడం లేదు. ఒక్క బీజేపీనే కాదు, ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వని పార్టీలన్నీ మతవాద పార్టీలేనని ఎల్జేపీ నేత షహదత్ అలీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన పార్టీల్లో ఎంఐఎం ఒకటి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల సంఘ్ పరివార్ శక్తులు బలోపేతమవుతాయని ఎంఐఎం భావిస్తోంది. అయితే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలతో భూ వ్యవహారాలు, వ్యాపార సంబంధాలు ఉండటం వల్లనే ఎంఐఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిందని ఉర్దూ దినపత్రిక సియాసత్ ఎడిటర్ ఆరోపిస్తున్నారు. - అజయ్ గుడవర్తి, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ