airbase attack
-
‘నూర్ఖాన్’ నేలమట్టం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌పై భారత్ చేస్తున్న మెరుపుదాడుల్లో ఆ దేశ వైమానిక స్థావరాలు నేలమట్టమవుతున్నాయి. తాజాగా ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం మీదా భారత్ దాడులు చేసిన విషయం తాజాగా చైనా ఉపగ్రహ చిత్రాలతో స్పష్టమైంది. చైనాకు చెందిన కృత్రిమ ఉపగ్రహాల సంస్థ ‘మిజాజ్విజన్’ తీసిన తాజా శాటిలైట్ ఫొటోలు భారత దాడి తీరును బహిర్గతం చేశాయి. ఇప్పటికే రఫీఖీ, మురీద్, నూర్ ఖాన్, ఛునియన్, సుక్కూర్‌లలో వైమానిక స్థావరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. ఈ దాడులను పాకిస్తాన్ సైతం ధృవీకరించింది. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌తోపాటు ఛక్వాల్‌లోని మురీద్ స్థావరం, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఝంగ్ జిల్లాలోని రఫీఖీ బేస్‌పైనా బాంబులు పడ్డాయని పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మెద్ షరీఫ్ వెల్లడించారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపంలోని నూర్ఖాన్ బేస్ ఆ దేశానికి చాలా కీలకమైన వైమానిక స్థావరం. ఇక్కడ చాలా ప్రధానమైన స్క్వాడ్రాన్లు ఉంటాయి. సైనిక, సరకు రవాణా సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సీ–130 హెర్క్యులస్, సాబ్ –2000 సైనిక ఉపకరణాల రవాణా విమానాలను ఇక్కడే నిలిపి ఉంచుతారు. గాల్లోనే విమానాలకు ఇంధనాన్ని నింపే ఐఎల్–78 వంటి రీఫ్యూయిలర్ విమానాలతోపాటు పాక్‌లోని వీవీఐపీలకు సంబంధించిన చిన్న విమానాలకూ ఇదే కీలక స్థావరం. -
అఫ్జల్ గురు ఉరితీతకు ప్రతీకారంగానే..!
పఠాన్‌కోట్: గురుదాస్‌పుర్ వాసి అయిన రాజేశ్ వర్మ అదృష్టవంతుడనే చెప్పాలి. శుక్రవారం ఉదయం ఆయనను నలుగురు సాయుధ ఉగ్రవాదులు అపహరంచుకుపోయారు. ఆ తర్వాత ఆయన గొంతు కోసి.. చనిపోయి ఉంటాడని భావించి వదిలేసి పోయారు. అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడ్డ ఆయన.. పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరితీయబడ్డ అఫ్జల్ గురు మరణానికి ప్రతీకారంగా తాము పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై దాడికి తెగబడుతున్నట్టు ఉగ్రవాదులు తెలిపారని ఆయన చెప్పారు. 'మిత్రుడైన ఎస్పీ సల్విందర్‌సింగ్, ఆయన వంటమనిషితో కలిసి మేం సరిహద్దుల సమీపంలోని నోరాత్ జైమాల్‌సింగ్ బ్లాక్‌కు వెళ్లి నివాళులర్పించాం. అనంతరం తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ ఉగ్రవాదులు మా వాహనాన్ని అడ్డగించారు. ఆర్మీ యూనిఫాంలు ధరించి.. భారీ ఆయుధాలతో ఉన్న వారు మమ్మల్ని బలవంతంగా వారి వాహనాల్లో ఎక్కించుకున్నాను. మా ముగ్గురిని తాళ్లతో బంధించి తీవ్రంగా కొట్టారు' అని ప్రస్తుతం ఆస్పత్రి బెడ్ మీద కోలుకుంటున్న రాజేశ్ వర్మ తెలిపారు. 'అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారంగానే మేం ఎయిర్‌బేస్‌పై దాడి చేయబోతున్నామని వారు చెప్పారు. 'మీరు అఫ్జల్ గురును చంపారు. మేం ప్రతీకారం తీర్చుకుంటాం' అని ఉగ్రవాదులు పదేపదే చెప్పారు. వారి వద్ద భారీ ఆయుధాలతోపాటు, జీపీఎస్ నావిగేషన్ సిస్టం కూడా ఉంది. ఎయిర్‌బేస్ ఎక్కడుందో కూడా వారికి స్పష్టంగా తెలుస' అని ఆయన చెప్పారు. ' ఆ తర్వాత ఎస్పీని, అతని వంటవాడిని వదిలేశారు. నన్ను మాత్రం వెంట తీసుకెళ్లి నిత్యం కొడుతూ పోయారు. ఎయిర్‌బేస్ కొంత దూరంలో నా గొంతు కత్తితో కోసి.. చనిపోయి ఉంటానని భావించి వాహనం నుంచి కింద పడేసి పోయారు. కానీ నేను మాత్రం బతుకడానికి ప్రయత్నించారు. రక్తస్రావం కాకుండా గొంతు చుట్టు వస్త్రాన్ని కట్టుకున్నాను. ఆ తర్వాత సమీపంలోని గురుద్వారలోకి పరుగెత్తికెళ్లి అక్కడ ఉన్న వారి ద్వారా మా కుటుంబసభ్యులకు ఫోన్ చేయించాను. వారు నన్ను ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలు దక్కాయి' అని ఆయన వివరించారు. పంజాబ్ పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. దాడికి దిగిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు సిబ్బంది చనిపోయారు.