breaking news
air bus 320
-
ఎయిర్‌బస్ @ ఓరుగల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ రూపొందబోతోంది. ఐదారేళ్ల తర్వాత ఎట్టకేలకు అవరోధాలు పరిష్కారం కావటంతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంసిద్ధత ప్రకటించింది. దీనిని సొంతంగానే నిర్మించాలని నిర్ణయించగా, అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి టెండర్లు పిలవబోతోంది. ఎయిర్‌బస్ దిగేలా.. నాలుగేళ్ల క్రితం ఏఏఐ ఆధ్వర్యంలో జరిగిన టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ సర్వే రెండు రకాల నివేదికలు సమర్పించింది. చిన్న విమానాశ్రయం నిర్మించేందుకు 724 ఎకరాల భూమి, రూ.248 కోట్ల వ్యయం అవుతుందని, పెద్ద విమానాలను ఆపరేట్ చేసే స్థాయిలో నిర్మించాలంటే 1053 ఎకరాల భూమి, రూ. 345 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. తొలుత చిన్న విమానాశ్రయంగానే నిర్మించాలని నాటి ప్రభుత్వం సూచించింది. కానీ భవిష్యత్‌లో విస్తరణ ఇబ్బందిగా ఉంటుందని, కనీసం 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒకేసారి పెద్ద విమానాశ్రయమే నిర్మించాలని గతేడాది చివరలో ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం సరే అనటంతో పెద్ద విమానాశ్రయమే రూపొందబోతోంది. ఇక్కడ ఎయిర్‌బస్ విమానం దిగేలా దాదాపు 2,800 మీటర్ల పొడవైన్ రన్‌వే నిర్మించబోతున్నారు. మామునూరులో నిజాం ప్రభుత్వం నిర్మించిన ఎయిర్‌్రస్టిప్ శిథిలం అయినా, నాటి రెండు రన్‌వేల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో పెద్దది దాదాపు 1,400 మీటర్ల పొడవు ఉంది. ఇప్పుడు అదే డైరెక్షన్లో దానిపైనే కొత్త రన్‌వే నిర్మించనున్నారు. దాని పక్కన గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే కూడా ఉంది. దానిని కూడా పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. సొంతంగానే నిర్మాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. ఎయిర్‌పోర్టుకు 150 కి.మీ. పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఇది అడ్డంకిగా మారటంతో జీఎమ్మార్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ విమానాశ్రయాన్ని కూడా దానికే కేటాయించేలా కూడా చర్చలు జరిగాయి. చివరకు ఆ నిబంధనపై అభ్యంతరం పెట్టకూడదన్న దిశలో చర్చలు సానుకూలంగా జరిగాయి. ఆ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ తీసుకుంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కేటాయించకుండా సొంతంగానే వరంగల్ ఎయిర్‌పోర్టును చేపట్టాలని అది నిర్ణయించింది. – విమానాశ్రయానికి 700 మీటర్ల దూరంలో ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిని మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు కిలోమీటరు నిడివితో భారీ సొరంగమార్గం నిర్మించి వాహనాలను దాని గుండా మళ్లించాలని ప్రతిపాదించారు. కానీ దీనికి భారీ ఖర్చు అవుతున్నందున, దాని బదులు బైపాస్‌రోడ్డు నిర్మించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై ఇప్పుడు పరిశీలిస్తున్నారు. – వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో జపాన్, తైవాన్ లాంటి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కార్గో ఫ్లైట్ సేవలు కోరుతున్నాయి. కార్గో ఫ్లైట్ ఆపరేషన్ జరగాలంటే పెద్ద రన్‌వే ఉండాలి. దీంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగానే దీనిని రూపొందించబోతున్నారు. మూడేళ్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్.. మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్’లోని రీజినల్ కనెక్టివిటీ స్కీంతో అనుసంధానించనున్నారు. ఇందులో మూడేళ్ల కాలానికి కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందిస్తుంది. రూట్ల వారీగా బిడ్డింగ్ నిర్వహిస్తే వాటిల్లో ఎంపికైన ఆపరేటర్లకు ఆయా రూట్లు కేటాయిస్తారు. ఆ ఆపరేటర్లు మాత్రమే ఆ రూట్లలో మూడేళ్లపాటు విమాన సర్వీసులు నిర్వహిస్తారు. ఈ కాలంలో సీట్ల వారీగా నష్టాలను బేరీజు వేసి.. డిమాండ్ అంచనా–వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉండే గ్యాప్‌ను కేంద్రం భర్తీ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వేయి ఎకరాలు అవసరం కొత్త విమానాశ్రయానికి వేయి ఎకరాలు కావాలి. నిజాం కాలం నాటి పాత విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాలు ప్రస్తుతం ఏఏఐ అధీనంలోనే ఉన్నాయి. మిగతా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం నిర్మించేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. త్వరలో ఏఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. -
300 విమానాలకు ఇండిగో ఆర్డరు
ముంబై: భారీ వృద్ధి ప్రణాళికల అమల్లో భాగంగా విమానయాన రంగ సంస్థ ఇండిగో తాజాగా ’ఎయిర్‌బస్ 320 నియో’ రకానికి చెందిన 300 విమానాలకు ఆర్డరు ఇచ్చింది. ఒక్కో విమానం రేటు వివరాలు వెల్లడించనప్పటికీ.. 2018లో ప్రచురించిన ధర ప్రకారం ఈ ఆర్డరు విలువ సుమారు 33 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 2.3 లక్షల కోట్లు) ఉండొచ్చని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో విమానాల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డరిచ్చిన ఏకైక సంస్థ తమదేనని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. తాజా కాంట్రాక్టుతో ఇండిగో మొత్తం 730 విమానాలకు(ఏ320 నియో) ఆర్డరిచ్చినట్లవుతుంది. ప్రస్తుతం 247 విమానాలతో ప్రతిరోజూ 1,500 ఫ్లయిట్స్ నడుపుతోంది. -
రన్ వే పై కుప్పకూలిన విమానం
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఒక విమానం టేకాఫ్ చేయబోతూ, టైర్ పేలి రన్‌వే పైనే కుప్ప కూలింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లోరిడా వెళ్లాల్సిన ఎయిర్ బస్ 320 ముందు టైర్ టేకాఫ్ చేసే ముందు గపేలిపోయింది. దాని తుక్కు బండి ఇంజన్‌లోకి దూరిపోయింది. దీంతో బారీగా పొగ వచ్చింది. కొద్ది క్షణాలకే విమానం రన్‌వే పై కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో 149 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది ఉన్నారు. నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలవడం మినహా ఏమీ కాలేదు. దీంతో అధికారులు, ప్రయాణికులు 'అమ్మయ్య' అని ఊపిరిపీల్చుకున్నారు.