breaking news
Air Arabia
-
విమానంలో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేరళ నర్సులు
దుబాయ్: కేరళలోని కొచ్చి నుంచి అబుదాబీ వెళ్తున్న ఇద్దరు పురుష నర్సులు తమతోపాటు విమానంలో ప్రయాణించే ఓ వ్యక్తి ప్రాణాలను సకాలంలో స్పందించి కాపాడారు. వయనాడ్ వాసి అభిజిత్ జీస్(26), చెంగన్నూర్‌కు చెందిన అజీశ్ నెల్సన్(29)లు ఎయిర్ అరేబియా విమానంలో దుబాయ్‌కి వెళ్తున్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకే ఓ ప్రయాణికుడు శ్వాసపీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వారిద్దరూ ఆయనకు సాయం చేసేందుకు ముందుకువచ్చారు. రెండు రౌండ్ల సీపీఆర్ చేపట్టారు. దీంతో, ఆయన శ్వాస కుదుటపడింది. విమానంలోనే ఉన్న ఆరిఫ్ అబ్దుల్ ఖాదిర్ అనే వైద్యుడు వారికి సాయంగా వచ్చారు. బాధిత ప్రయాణికుడికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించారు. దీంతో, ఆయన నాడి తిరిగి సవ్యంగా కొట్టుకోవడంతోపాటు పరిస్థితి మెరుగైంది. ఈ విషయాలను ఓ ప్రయాణికుడి ద్వారా తెల్సుకున్నట్లు ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. విమానం దిగిన అభిజిత్, అజీశ్ మామూలుగానే తమ విధుల్లో చేరిపోగా, మీడియా ద్వారా విషయం తెలిసిన బాధిత ప్రయాణికుడి కుటుంబీకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై అభిజిత్, అజీశ్ స్పందించి, ఆరోజు జరిగిన ఘటనను వివరించారు. ఆ ప్రయాణికుడు శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటం గమనించాం. దగ్గరికెళ్లి పరీక్షించగా, నాడి కొట్టుకుంటున్న జాడలే లేవు. గుండెపోటుకు గురయ్యారనే విషయం అర్థమయింది. అటువంటి సమయాల్లో చేపట్టాల్సిన సీపీఆర్‌కు వెంటనే ఉపక్రమించాం. దీంతో, పరిస్థితి మెరుగైంది. దీంతో ఊపిరి పీల్చుకున్నాం’అంటూ వివరించారు. ఇదంతా తమ వృత్తి ధర్మమని చెప్పారు. కాగా, బాధిత ప్రయాణికుడిని ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే సిబ్బంది వైద్య సాయం అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. -
షార్జా-కొచ్చివిమానంలో లోపం: సేఫ్ ల్యాండింగ్
కొచ్చి: జాతీయ, అంతర్జాతీయ, విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్న ఘటనలు రోజుకొకటి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా షార్జా నుంచి కొచ్చి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం(జి9-426) విమానం ల్యాండ్ అవుతుండగా సమస్య ఏర్పడింది. దీంతో విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది గందర గోళానికి గురయ్యారు. కొచ్చికి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం (జి9-426)లో లోపం తలెత్తింది. యుఎఇలోని షార్జా నుండి ఈరోజు సాయంత్రం కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నప్పుడు సమస్య తలెత్తింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్న మొత్తం 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారని కొచ్చిన్ విమానాశ్రయంలో కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని డీజీసీఏ తెలిపింది. A Kochi-bound Air Arabia flight (G9- 426) departed from Sharjah in UAE and had a hydraulic failure while landing at Kochi airport, today evening. The aircraft landed safely. All 222 passengers and 7 crew members on board are safe: Cochin International Airport Authority pic.twitter.com/1bGS7xygTY — ANI (@ANI) July 15, 2022 -
ఎంత మోసం.. మాయరోగం నటించి విమానాన్ని దారి మళ్లించి..
పాల్మా(స్పెయిన్): మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ మనుషులు పరాయి దేశాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. కొందరు చట్టబద్ధంగా వెళ్తే.. ఆ అవకాశం లేని మరికొందరు అక్రమంగా మరో దేశంలోకి ప్రవేశిస్తుంటారు. పుట్టిన గడ్డపై బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి మరీ విదేశాలకు వలస వెళ్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఇదొక కొత్త రకం అక్రమ వలస. శుక్రవారం స్పెయిన్‌లో చోటుచేసుకుంది. ఎయిర్ అరేబియా విమానం మొరాకోలోని కాసాబ్లాంకా నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. ఇందులో చాలామంది మొరాకో దేశస్తులున్నారు. మార్గమధ్యంలో ఓ ప్రయాణికుడు తనకు అనారోగ్యమంటూ విలవిల్లాడాడు. దీంతో విమానాన్ని స్పెయిన్ దేశానికి చెందిన పాల్మా డి మాలోర్కా దీవిలో ఉన్న ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ఇది స్పెయిన్‌లో బిజీ ఎయిర్‌పోర్టు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బాధిత ప్రయాణికుడికి చికిత్స అందించేందుకు(మెడికల్ ఎమర్జెన్సీ) ఎయిర్ అరేబియా ఫ్లైట్‌ను మాలోర్కా ఎయిర్‌పోర్టులో దించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వెంట ఓ సహాయకుడు ఉన్నాడు. విమానంలో ఆగడంతో ఇదే అదనుగా భావించి దాదాపు 22 మంది కిందికి దిగి, పరుగులు ప్రారంభించారు. కొందరు ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని బయటకు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.12 మందిని పట్టుకున్నారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా విమానాశ్రయాన్ని శుక్రవారం 4 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. దాదాపు 60 విమానాలను దారి మళ్లించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రయాణికుడు అనారోగ్యం అంటూ విమానంలో నాటకం ఆడినట్లు తేలింది. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు. ప్రయాణికుడి వెంట వచ్చిన సహాయకుడు సైతం పరారయ్యాడు. ఇలాంటి సంఘటన తమ ఎయిర్‌పోర్టులో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెప్పారు. స్పెయిన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికే మొరాకో దేశస్తులు ఈ కుట్ర పన్నినట్లు గుర్తించారు. (చదవండి: టెక్సాస్ మ్యూజిక్ ఫెస్ట్‌లో తొక్కిసలాట) -
పైలట్ చాకచక్యం.. విమానానికి తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై : షార్జా నుంచి కోయంబత్తూరుకు వచ్చిన ఎయిర్ అరేబియా విమానానికి ల్యాండింగ్ సమయంలో నెమళ్ల గుంపు అడ్డుగా వచ్చింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానానికి, నెమళ్లకూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆదివారం తెల్లవారుజామున 3.40 గంటలకు 107 మంది ప్రయాణికులతో వచ్చిన విమానం కోయంబత్తూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు సిద్ధం అయింది. రన్ వే మీదుగా హఠాత్తుగా నెమళ్ల గుంపు రావడంతో పైలట్ వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. చాకచక్యంగా వ్యవహరించి విమాన వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ నెమళ్లను ఢీ కొనకుండా విమానాన్ని జాగ్రత్తగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమానానికి ప్రమాదం తప్పినట్టు అయింది. ఓ నెమలి ఈక మాత్రం విమానం రెక్కలో ఇరుక్కుని ఉండటాన్ని ఇంజనీర్లు గుర్తించారు. ఈ విమానం రన్ వే మీదే ఎక్కువ సమయం ఉండాల్సి వచ్చింది. దీంతో ఉదయం 4.30 గంటలకు షార్జా బయలుదేరాల్సిన మరో విమానం ఆలస్యంగా టేకాఫ్ తీసుకుంది. -
ఎయిర్ అరేబియా‘ఈఎంఐ’ ఆఫర్
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్అరేబియా ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. విమాన ప్రయాణ టికెట్ చార్జీని నెలవారీ సమాన వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించే అవకాశం కల్పించింది. ఈ సంస్థ షార్జా నుంచి భారత్‌లోని 13 పట్టణాలకు వారంలో 115 విమాన సర్వీసులను నడుపుతోంది. ఎస్బీఐ, హెడ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ సహా ఎనిమిది బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఈ అవకాశం అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. -
విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
చెన్నై: షార్జా నుండి కోయంబత్తూరు వస్తున్న ఎయిర్ అరేబియా విమానానికి సోమవారం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పైలెట్ అప్రమత్తతో వ్యవహరించటంతో ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఈరోజు తెల్లవారుఝామున ఈ ఘటన చోసుకుంది. వంద మంది ప్రయాణీకులతో షార్జా నుంచి వస్తున్న విమానానికి అకస్మాత్తుగా ఓ పక్షి అడ్డుగా వచ్చింది. విమానానికి బలంగా వచ్చి తాకింది. ఒక్కసారి విమానం కుదుపుకు గురవటంతో... అప్రమత్తమైన పైలట్ చాకచ్యంగా విమానాన్ని కిందికి దించారు. దీంతో ప్రయాణీకులందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మరమ్మత్తు కార్యక్రమాల తరువాత విమానం తిరిగి షార్జాకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. షార్జా వెళ్లడానికి ఎదురు చూస్తున్న సుమారు 160 మంది ప్రయాణికులకు ఎయిర్ పోర్టు అధికారులు... హోటళ్లలో తగిన ఏర్పాట్లు చేశారు.


