దుబాయ్: కేరళలోని కొచ్చి నుంచి అబుదాబీ వెళ్తున్న ఇద్దరు పురుష నర్సులు తమతోపాటు విమానంలో ప్రయాణించే ఓ వ్యక్తి ప్రాణాలను సకాలంలో స్పందించి కాపాడారు. వయనాడ్ వాసి అభిజిత్ జీస్(26), చెంగన్నూర్‌కు చెందిన అజీశ్ నెల్సన్(29)లు ఎయిర్ అరేబియా విమానంలో దుబాయ్‌కి వెళ్తున్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకే ఓ ప్రయాణికుడు శ్వాసపీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వారిద్దరూ ఆయనకు సాయం చేసేందుకు ముందుకువచ్చారు. రెండు రౌండ్ల సీపీఆర్ చేపట్టారు.
దీంతో, ఆయన శ్వాస కుదుటపడింది. విమానంలోనే ఉన్న ఆరిఫ్ అబ్దుల్ ఖాదిర్ అనే వైద్యుడు వారికి సాయంగా వచ్చారు. బాధిత ప్రయాణికుడికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించారు. దీంతో, ఆయన నాడి తిరిగి సవ్యంగా కొట్టుకోవడంతోపాటు పరిస్థితి మెరుగైంది. ఈ విషయాలను ఓ ప్రయాణికుడి ద్వారా తెల్సుకున్నట్లు ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. విమానం దిగిన అభిజిత్, అజీశ్ మామూలుగానే తమ విధుల్లో చేరిపోగా, మీడియా ద్వారా విషయం తెలిసిన బాధిత ప్రయాణికుడి కుటుంబీకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
దీనిపై అభిజిత్, అజీశ్ స్పందించి, ఆరోజు జరిగిన ఘటనను వివరించారు. ఆ ప్రయాణికుడు శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటం గమనించాం. దగ్గరికెళ్లి పరీక్షించగా, నాడి కొట్టుకుంటున్న జాడలే లేవు. గుండెపోటుకు గురయ్యారనే విషయం అర్థమయింది. అటువంటి సమయాల్లో చేపట్టాల్సిన సీపీఆర్‌కు వెంటనే ఉపక్రమించాం. దీంతో, పరిస్థితి మెరుగైంది. దీంతో ఊపిరి పీల్చుకున్నాం’అంటూ వివరించారు. ఇదంతా తమ వృత్తి ధర్మమని చెప్పారు. కాగా, బాధిత ప్రయాణికుడిని ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే సిబ్బంది వైద్య సాయం అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.


