తొలిసారి రెండేళ్ల నిషేధం... రెండోసారి జీవితకాలం!
న్యూఢిల్లీ: భారత క్రీడారంగంలో సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్య ఆటగాళ్లు తమ వయసును తప్పుగా చూపించడం. నకిలీ వయోధ్రువీకరణ పత్రాలతో ఎంతోమంది ఇతర వయోవిభాగాల పోటీల్లో పాల్గొని వాటి ద్వారా ప్రయోజనం పొందారు. వైద్యపరీక్షల్లో అప్పుడప్పుడు ఇలాంటి కేసులు కొన్ని పట్టుబడినా... కఠినమైన శిక్షలు లేక అందరూ బయటపడిపోయారు. అయితే ఇప్పుడు దీనిని నిలువరించేందుకు ప్రభుత్వం ‘ఎన్సీఏఏఎఫ్ఎస్’ పేరుతో కొత్తగా నేషనల్ కోడ్‌ను తీసుకువస్తోంది.ఈ కోడ్‌కు సంబంధించిన ముసాయిదాను గత మార్చిలోనే రూపొందించిన ప్రభుత్వం... ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలు కోరింది. అనంతరం వయో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కేంద్ర క్రీడా శాఖ వద్ద తమ పేరును నమోదు చేసుకున్న ఆటగాడు ఎవరైనా బర్త్ సర్టిఫికెట్, ఆధార్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వీటి విశ్వసనీయతను స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పరీక్షిస్తుంది.అంతా బాగుంటే ఈ పుట్టిన తేదీనే శాశ్వతంగా రికార్డుల్లోకి చేరుస్తారు. ఆటగాడి కెరీర్ ముగిసే వరకు ఇదే తేదీ ప్రామాణికంగా మారుతుంది. ఆటగాడు తన వయసును తప్పుగా చూపించాడని తేలితే మొదటిసారి రెండేళ్ల నిషేధాన్ని విధిస్తారు.రెండోసారి కూడా ఇదే తప్పు చేసినట్లు తేలితే జీవితకాల నిషేధం విధించి భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు కూడా నమోదు చేస్తారు. ఇప్పటికే రిజిస్టర్ అయిన ఆటగాళ్లలో ఎవరైనా తమ వయసును తప్పుగా నమోదు చేసి ఉంటే... కోడ్ అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోగా స్వచ్ఛందంగా తామే చెప్పి దానిని సరి చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్