breaking news
The accident
-
తప్పు కేక
కథాసారం ఉన్నట్టుండి కంటి మూల మీదుగా గమనించాడు న్యాయవాది వెయ్. బండి నడుపుతున్నతను గాల్లోకి ఎగిరి దబ్బుమని శబ్దం చేస్తూ కింద పడ్డాడు. ఆగేముందు రెండు సార్లు పూర్తి గుండ్రంగా తిరిగింది శరీరం. వెయ్ మెదడు స్తంభించింది. వెంటనే కారు ఆపాడు. రాత్రి కావస్తోంది. ప్రమాది రోడ్డు మీద నిశ్చలంగా పడివున్నాడు. అతడి హెల్మెట్ కిందుగా రక్తం కారుతోంది. మే నెలలో పూర్తిగా విచ్చుకున్న రుగోసా గులాబీ వర్ణంలో ఉందది. వెయ్కు ఏం చేయాలో పాలుపోలేదు. ‘దయచేసి చచ్చిపోవద్దు మిత్రమా. తాగి నడపడం కొంప ముంచుతుందనుకోలేదు. నువ్వు చచ్చిపోయావంటే నేనూ చచ్చిపోయినట్టే’ అనుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత, కారు దిగి అతడి వద్దకు నడిచాడు. అతడు ఉన్నట్టుండి లేచి కూర్చుని, ‘కండ్లు దొబ్బినయా? ఏం నడపడం అది?’ అని తిట్టడం మొదలుపెట్టాడు. ఎంత తియ్యటి తిట్టు! 37 ఏళ్ల వెయ్ జీవితంలో ఎన్నో తిట్లు అతడి వైపు గురి చూసి విసరబడినప్పటికీ, ఈ తిట్టంత వినసొంపుగా మరేదీ అతడి చెవులకు సోకలేదు. స్వర్గంలోంచి వచ్చిన పిడుగులా ఉంది. బతకడమే కాదు, తిట్టగలుగుతున్నాడు కూడా అంటే... బాగుంది! రోడ్డు మీద ముల్లంగి, ఆకుకూరలు పరిచినట్టుగా పడివున్నాయి. నగరానికి కూరగాయలు మోసుకెళ్తున్న పేద రైతు అయివుండాలి. కొన్ని అడుగులు వేయడానికి ఆయనకు సాయపడ్డాడు. రైతు పూర్తి నిటారుగా నిలబడ్డాడు. కానీ నోట్లోంచి ఇంకా నెత్తురు కారుతూనేవుంది. తాను ఎంతమాత్రమూ బలహీనత చూపకూడదని అప్పటికే ఒక నిర్ణయానికొచ్చాడు వెయ్. కొద్దిగా మెత్తబడినా రైతు అడ్వాంటేజీ తీసుకోవచ్చు. ఏం పరిహారం అడుగుతాడో! రైతు నెమ్మదిగా హెల్మెట్ తీశాడు. ఇదే అదునుగా గట్టిగా అడిగాడు వెయ్. ‘నీ లైసెన్స్ ఏదీ? చూపించు’. ప్రమాదం చేసినవాడే ఇలా అడగటానికి సాధారణంగా సాహసించడు. కానీ అతణ్ని లొంగదీయాలంటే ఇదే దారి. రైతు కంగారుపడ్డాడు. తల మీద రక్తం తుడుచుకున్నాడు. వణుకుతున్న చేతుల వంక చూసుకున్నాడు. అతడికి యాబై ఏళ్లుంటాయి. బట్టలు జిడ్డు కారుతున్నాయి. వాటిల్లోంచి పురుగుమందుల వాసన వస్తోంది. పసుపురంగు రబ్బరు బూట్లు తొడుక్కున్నాడు. చూడ్డానికి పెద్ద తెలిసినవాడిలా అనిపించడు. ‘ఏం చేస్తుంటావు నువ్వు? నీ డ్రైవింగ్ లైసెన్స్ ఏది?’ మళ్లీ అడిగాడు వెయ్, భయపెడుతున్నట్టుగా. రైతు కొన్ని యుగాల పాటు జేబుల్ని వెతికి, సిగ్గుగా నవ్వూతూ ‘అయ్యా, నేను తేవడం మర్చిపోయాను’ అన్నాడు. ఇదీ! అతడి ఛాతీని నెడుతూ, ‘అయితే లైసెన్స్ లేదా? సరే. దొబ్బెయ్’. రైతు తిట్టును తిరిగి అప్పగించాడు వెయ్. ‘నా వెనకాతలే వస్తావు, పైగా నన్నే తిడతావా?’ రైతు తల వాలిపోయింది. ఆత్మరక్షణలో పడిపోయాడు. ‘నువ్వు... నువ్వు కూడా లైట్స్ వేసుకోలేదు, నాకెట్లా తెలుస్తుంది’. అప్పటికే కొంతమంది పోగవడం మొదలైంది. కుందేళ్లు కూడా ఒక్కోసారి జనాన్ని కరవొచ్చు. ఎందుకొచ్చిన గొడవ! ఎంతోకొంత ముట్టజెప్పి వదిలించుకుంటే మంచిది. రైతు బండిని నిలబెట్టడానికి వెయ్ సాయపడ్డాడు. ముసలాయన తల వంచుకుని వణుకుతూనే కొన్ని అడుగులు వేశాడు. ఉన్నట్టుండి మళ్లీ భూమ్మీద పడ్డాడు. ఎంత కుదిపినా లాభం లేదు. వెనుక కార్ల బారు పెరిగిపోతూవుంది. పోలీస్ సైరెన్లు వినబడుతున్నాయి. ఇది బాలేదు. వెంటనే హు కోక్సింగ్కు ఫోన్ చేశాడు వెయ్. హు పక్కా బిజినెస్‌మాన్. ప్రమాదం ఎక్కడ జరిగిందీ, ఇప్పుడు పరిస్థితి ఎలావుందీ లాంటి కొన్ని ప్రశ్నలు అడిగాడు. వెయ్ ఫోన్ కట్ చేసేలోపల పోలీసులు వచ్చారు. అందులో ఒకతను, డాక్యుమెంట్లు బయటికి తీయమని వెయ్‌ను ఆదేశించాడు. గొంతు తగ్గించి, ‘మీ హెడ్ నాకు తెలుసు’ అన్నాడు వెయ్. ఒకసారి దీర్ఘంగా చూసి, ‘నోర్ముయ్, ముందు నీ డాక్యుమెంట్లు బయటికి తియ్’ అన్నాడు పోలీసు. రైతు దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాడు. వెయ్లో ఆందోళన పెరుగుతోంది. ఇంతలో పోలీసు రేడియో బర్రున ప్రాణం సంతరించుకుంది. హు కోక్సింగ్ అయివుండాలి! పోలీస్ అందులో విని, వెయ్ వంక ఒక చూపు చూసి, సంభాషణను కొనసాగించడానికి వీలుగా జనానికి దూరంగా నడిచాడు. రెండు నిమిషాల్లో తిరిగొచ్చాడు, పూర్తి భిన్న వైఖరితో. రైతును ఉద్దేశించి, ‘నువ్వే ఈయన కారును ఢీకొట్టినట్టున్నావ్. ఏదీ చూపించు... నీ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్’ అన్నాడు పోలీసు. రైతు ముఖం పాలిపోయింది. ఏం జరుగుతుందో అతడికి అర్థం కాలేదు. కంపిస్తున్న శరీరాన్ని తమాయించుకోవడానికి బైక్‌ను ఆసరా చేసుకుని నిలబడ్డాడు. ‘లాయర్ వెయ్, ఈయనకు బాగా దెబ్బలు తగిలినయ్. ఎందుకైనా మంచిది ముందు హాస్పిటల్‌కు తీసుకెళ్దాం’ అన్నాడు పోలీసు. రైతు మూర్ఖుడు అయ్యుండాలి. అప్పుడే గంప తీసుకుని కింద పడిన కూరగాయలను ఏరడం మొదలుపెట్టాడు. ఒంటి మీది రక్తపు చుక్కలు ఆకుల మీద పడ్డాయి. లాయరూ పోలీసూ చిర్నవ్వుతో చూపులు మార్చుకున్నారు. ‘ఇప్పుడు బానేవుందా?’ అడిగాడు పోలీసు. ఛాతీ రుద్దుకుని, ‘నొప్పిగా ఉంది’ అన్నాడు రైతు. మరో బక్కపలుచని పోలీసు ముందుకు వచ్చి, ‘దీన్నిక్కడే ఏదో పరిష్కారం చేసుకో. నీకు లైసెన్స్ లేదు. చూస్తుంటే నువ్వే కారును గుద్దినట్టు ఉంది. నువ్వు నష్టపరిహారం కట్టాలి తెలుసా?’ రైతుతో అని, వెయ్ వైపు తిరిగాడు: ‘మీది కూడా తప్పుంది. మీ లైట్స్ లేవు’. అవునన్నట్టుగా చిన్నగా తలూపాడు వెయ్. రైతు క్షమించమని ప్రాధేయపడ్డాడు. వెయ్ లోపల నవ్వుకున్నాడు. హమ్మయ్య! దెబ్బ తగిలిన కారు భాగం వైపు చూస్తూ, ‘అది ఫర్లేదా?’ వెయ్‌ను అడిగాడు పోలీసు. ‘గరాజ్‌కు వెళ్లకుండా ఇప్పుడే చెప్పలేను. కానీ పెయింట్ పోయింది, ట్రిమ్మింగ్ చేయించాలి. మూడు నాలుగు వేలకు తక్కువ కావు’ అంచనా వేశాడు వెయ్. రైతు ముఖంలోకి ఒక్కసారిగా భయం ప్రవేశించింది. జేబులోంచి ముడతలు పడిన నోట్లు బయటికి తీశాడు. రెండు యువాన్ల నోటు, ఒక యువాన్ నోటు, బోల్డన్ని మావో నాణేలు. అన్నీ కలిపినా 100 యువాన్లు కావు (1 యువాన్ సుమారు పది రూపాయలు). అతడి కళ్లలోంచి నీళ్లు కారుతున్నాయి. ‘నా దగ్గర ఇంతే వుంది, లేదంటే నా బండి తీసుకో’. ‘నేనేం చేసుకోవాలి? ఇనుప సామాన్లకు అమ్మడానికి తప్ప పనికిరాదు’ అన్నాడు వెయ్. పోలీసు నెమ్మదిగా రైతు చెవిలో ఏదో చెప్పాడు. రైతు బెంబేలు పడిపోయి, జాకెట్లోంచి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ బయటికి తీశాడు. 330 యువాన్లు ఉన్నాయందులో. ఒక వంద నోటు, నాలుగు యాబైలు, 3 పదులు. తీసి ఇచ్చాడు. ‘ఇవి ఎరువు కొనడానికి. నా దగ్గరున్నది ఇంతే’. వెయ్ వాటిని తీసుకున్నాడు. రైతు బైక్ నెట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. గుంపు పలుచబడింది. ‘ఒక పెగ్‌కు ఎక్కడైనా కలుద్దాం’ అన్నాడు పోలీసు. ‘మీకో పార్టీ బాకీ’ చెప్పాడు వెయ్. విజిల్ ఊదుకుంటూ పోలీసు వెళ్లిపోయాడు. వెయ్ కారులోకి ఎక్కి, కొంచెం ముందుకు పోనిచ్చాడు. అక్కడ రైతు ఒక చిన్న చెట్టు కింద కడుపుకు చేతిని అడ్డం పెట్టుకుని దగ్గుతున్నాడు. ఇద్దరి చూపులూ ఒక్కసారి కలుసుకున్నాయి. ఏమీ జరగనట్టుగా ఫెంగ్ షాన్ పట్టణం వైపు సాగిపోయాడు వెయ్. దిగితే మళ్లీ ఏం మీద పడుతుందో! పైగా వెయ్ ప్రియురాలు జియావో లీ ఈపాటికే ఏమైందోనని కంగారు పడుతూ ఉంటుంది! మరో బక్కపలుచని పోలీసు ముందుకు వచ్చి అన్నాడు: ‘దీన్నిక్కడే ఏదో పరిష్కారం చేసుకో. నీకు లైసెన్స్ లేదు. చూస్తుంటే నువ్వే కారును గుద్దినట్టు ఉంది. నువ్వు నష్టపరిహారం కట్టాలి తెలుసా?’ రైతు ముఖంలోకి ఒక్కసారిగా భయం ప్రవేశించింది. జేబులోంచి ముడతలు పడిన నోట్లు బయటికి తీశాడు. తప్పెవరిది? ఒప్పెవరిది? ఎలా తేల్చాలి? దానికంటే ముందు తేల్చాల్సింది ఇంకోటుంది. బలవంతుడెవరు? బలహీనుడెవరు? మురాంగ్ స్వీకెన్ రాసిన చైనీస్ కథ ‘ది ఏక్సిడెంట్’ సారాంశం ఇది. దీన్ని ఇంగ్లిష్‌లోకి హార్వే థామ్లిన్సన్ అనువదించారు. 2012లో ‘ద గార్డియన్’ పత్రిక ప్రచురించింది. మురాంగ్ స్వీకెన్ కలంపేరుతో రాసే హావో చీన్ 1974లో జన్మించారు. తొలి నవల ‘లీవ్ మి ఎలోన్: ఎ నావెల్ ఆఫ్ చంగ్తూ’తో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. చైనా ప్రభుత్వ సెన్సార్షిప్ను వ్యతిరేకిస్తారు. - మురాంగ్ స్వీకెన్ -
నెత్తురోడిన రహదారి
ఉట్నూర్ రూరల్/ఆదిలాబాద్/ఇంద్రవెల్లి/తాండూర్, న్యూస్‌లైన్ : రహదారి నెత్తురోడింది. మృత్యువు కాపుకాసి నలుగురిని బలితీసుకుంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన వారు క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. గమ్యస్థానానికి చేరుకునేలోపే కారు రూపంలో మృత్యువు కబళించింది. ఇరుకుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉండటం విషాదకరం. అతివేగం ప్రాణం తీసింది.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గోండుగూడకు చెందిన పవన్ జైస్వాల్ కుటుంబ సభ్యులు వారి బంధువులు కలిపి దాదాపు 20 మంది ఆటో ట్రాలీలో గురువారం ఉదయం ఉట్నూర్‌లోని శివరామ గురుదత్త సాయి కృష్ణ మందిరంలో జరిగిన ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లారు. మధ్యాహ్యం 2.30 గంటలకు తిరిగి ఇం ద్రవెల్లికి బయలు దేరారు. ఈ క్రమంలో ఉట్నూర్ మండలం శ్యాంపూర్ వద్దకు ఆటోట్రాలీ రా గానే ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వెళ్తున్న ఇండికా కారు వేగంగా ఢీకొట్టింది. కారులో ప్ర యాణిస్తున్న చాపిడి శంకర్, భాస్కర్‌గౌడ్, రాజ్‌కుమార్‌తోపాటు మరొకరికి, ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న దాదాపు 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో కొందరికి ఉట్నూర్ ఆస్పత్రికి, మరికొందరికి రిమ్స్‌కు తరలించారు. ఉట్నూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చాపిడి శంకర్(25) మృతి చెందారు. రిమ్స్‌తో చికిత్స పొందుతూ ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గోండుగూడకు చెందిన పవన్ తల్లి నిర్మల జైస్వాల్(45), వరుసకు అత్త అయిన కాంతాబాయి(54), తన బాబాయి దిలీప్ జైస్వాల్ కుమారుడు సాయి(15) మృతిచెందారు. మిగతా క్షతగాత్రులు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రక్తంతో రహదారి తడిసింది. విషయం తెలియడంతో స్థానికులు గుమిగూడారు. స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలతో రహదారి దద్దరిల్లింది. ఉపాధి కోసం వెళ్లి.. తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన చాపిడి పీరయ్య(రాజయ్య), శోభ దంపతులకు ఆరుగురు సంతానం. ఇందులో ఇద్దరు కుమారు లు, నలుగురు కుమార్తెలు. కుమార్తెలు విజయ, రీన, మీనలకు వివాహాలు కాగా కుమారుడు హ రిదాస్, చిన్న కుమార్తె సోనీలు తల్లిదండ్రులతో నే ఉంటున్నారు. రెండో సంతానమైన శంకర్ నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసం రేచిని నుంచి వెళ్లిపోయి మంచిర్యాలలో ఉంటున్నాడు. గురువారం స్నేహితులతో కలిసి కార్లో ఆదిలాబాద్ కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా శ్యాంపూర్ వద్ద జ రిగిన ఘటనలో శంకర్ మృతి చెందాడు. కూలీ పని చేసుకుని జీవనం సాగించే పీరయ్య కుటుం బం ఇంటికి పెద్ద కొడుకును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది. శంకర్ మృతితో రేచినిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న శంకర్ తల్లిదండ్రులు, కుటుంబీకులు ఉట్నూర్‌కు వెళ్లారు. ఆనందం.. అంతలోనే ఆవిరి ఇంద్రవెల్లి మండలం గోండుగూడకు చెందిన పవన్ జైస్వాల్ కిరాణ దుకాణం నడుపుతూ భార్య, తల్లి, సోదరులతో నివసిస్తున్నాడు. ఏడాది కిందట సరిగ్గా ఇదేరోజు అంటే 2013 జూన్ 5న ఆయనకు శీతల్‌తో వివాహమైంది. గురువారం పెళ్లిరోజు కావడంతో భార్య శీతల్, తల్లి నిర్మల జైస్వాల్, వరుసకు సోదరులు, బంధువులతో కలిసి ఉట్నూర్‌కు పూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. శీతల్ ఎనిమిది నెలల గర్భిణీ. మరో నెల దాటితే తమకు బిడ్డ పుడతాడని ఆనందంతో ఉన్నారు. శీతల్‌కు తీవ్రగాయాలు కావడంతో గర్భస్రావమైంది. పెళ్లిరోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. భర్త మరణించినా కుటుంబాన్ని పోషిస్తూ.. నిర్మల జైస్వాల్ భర్త బాబు జైస్వాల్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అయిన నిర్మల ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గోండ్గూడాలో కిరాణ దుకాణం నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుంది. కొద్ది రోజుల క్రితమే కూతురు ప్రియాంకకు మహారాష్ర్టలోని కుఫ్టీ గ్రా మ యువకునితో వివాహం జరిపించింది. నిర్మలకు మరో సంతానం పవన్ ఉన్నారు. కిరాణా దుకాణంలో తల్లికి చేదోడువాదుడుగా ఉంటాడు. నిర్మల మృతితో కుటుంబంలో చీకటి అలుముకుంది. బంధువుల ఇంటికి వచ్చి.. మహారాష్ట్రంలోని కుఫ్టీ గ్రామానికి చెందిన కాంత ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఉండే బంధువుల ఇంటికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. నిర్మల కూమార్తె ప్రియాంకకు స్వయాన అత్త అయిన ఈమె తమ కోడలిని తీసుకెళ్లేందుకు ఇంద్రవెల్లి మండల కేంద్రానికి వచ్చింది. శ్యాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఆమెను కబళించింది. ఆశల దీపం ఆవిరి ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గోండ్గూడాకు చెందిన దిలీప్‌కుమార్-సీమ దంపతులకు ము గ్గురు సంతానం. సాయి, సోను, రోష్న. దిలీప్‌కుమార్ గోండ్గూడాలోనే కిరాణం దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎంతో ఆనందంగా గడుపుతున్న కుటుంబంలో సాయి మృతి విషాదం నింపింది. చదువులో చురుకుగా ఉండే సాయి ఇంద్రవెల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రిమ్స్‌లో హాహాకారాలు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రమాదం జరుగగా సాయంత్రం నాలుగు గంటలకు రిమ్స్‌కు క్షతగాత్రులు వాహనంలో వచ్చారు. ఆటో ట్రాలీలో ఇరుకున్న వారిని బయటకు తీయడానికి గంటన్నరకు పైగా పట్టడంతో జాప్యం జరిగింది. ఆస్పత్రిలో నిర్మల జైస్వాల్, కాంతాబాయి, సాయి మృతిచెందడంతో వారి మృతదేహాలను మార్చురీకి తరలించారు. పవన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సోను రెండు కాళ్లకు దెబ్బలు తగలడంతో ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. పవన్ సోదరి ప్రియాంక పైకి గాయాలు కనిపించినా ఆమె స్పృహలో లేదు. రిమ్స్ డెరైక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో డాక్టర్ తిప్పస్వామితోపాటు పలువురు వైద్యులు వారికి చికిత్స అందజేశారు. సోను, దయాకర్‌ల పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్ నిమ్స్‌కు వైద్యులు రిఫర్ చేశారు. కలెక్టర్ పరామర్శ కలెక్టర్ అహ్మద్‌బాబు రిమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. హైదరాబాద్ నిమ్స్‌కు తరలించే విషయంలో అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి వారిని నిమ్స్‌కు తరలించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని నిమ్స్ వైద్యులతో ఫోన్లో సంప్రదించారు. మిగితా క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలని రిమ్స్ అధికారులను ఆదేశించారు.