breaking news
Accampeta
-
కన్నీటి కష్టాలు
అచ్చంపేట రూరల్ : వేసవిలో తాగునీరు లేక గ్రామీణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు సరిపడా తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నారు. బిందె నీటి కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలోని నీరు ఎండిపోయింది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో మరింత జఠిలమంది. అచ్చంపేట మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డైరెక్ట్ పంపింగ్ ద్వారా.. అన్ని గ్రామాల్లో డైరెక్టు పంపింగ్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో తాగునీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో ప్రధానంగా బోర్లపైనే ఆధార పడి ఉన్నారు. కొన్ని చోట్ల లీకేజీలు ఉండడంతో తాగునీరు వృథాగా పోతుంది. పట్టించుకోని ప్రజాప్రతినిధులు పదవీకాలం ముగియనుండడంతో గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని ప్రజల దాహార్తిని తీర్చలేక పోతున్నారు. గతంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశామని, అప్పటి డబ్బు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లోని ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. గ్రామాలకు చాలా దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. మిషన్ స్లో.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైపులైను పనులు గ్రామాలకు వచ్చినా ట్యాంకులు మాత్రం నేటికీ పూర్తికాలేదు. వివిధ కారణాలతో కొన్నింటికి పునాదులే పడలేదు. ఈ వేసవిలో తాగునీటి కష్టాలు తీరుతాయని ప్రజలు భావించినా అధికారుల అలసత్వంతో మిషన్ భగీరథ పనులు స్లోగానే సాగుతున్నాయి. మండలంలో 36 మిషన్ భగీరథ ట్యాంకులు పూర్తి చేయాల్సి ఉన్నా కేవలం 16 ట్యాంకులు మాత్రమే పూర్తి చేశారు. తీవ్ర తాగునీటి ఎద్దడి మండలంలోని రంగాపూర్‌లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉంది. ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. వేసవి కాలం వస్తే చాలు భయమేస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటిని అందించాలి. -
లారీ ఢీకొని యువకుడి మృతి
అచ్చంపేట, న్యూస్‌లైన్ :ఇసుక మాఫియా ఆగడాలకు అదుపులేకుండా పోయింది. కృష్ణా నది నుంచి ఇసుకను త్వరత్వరగా మండలం దాటించాలన్న ఆతృతతో వేగంగా వెళుతున్న లారీ బైక్‌పై వస్తున్న యువకుడిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన స్థానిక మాదిపాడు రోడ్డులోని తాళ్లచెరువు మలుపు వద్ద గురువారం చోటుచేసుకుంది. అచ్చంపేటకు చెందిన కోట నరేంద్ర (21)గ్రామాల్లో బాకీల వసూళ్లకు బైక్‌పై వెళుతుండగా ఇసుక లారీ ఢీకొట్టింది. ముందు టైరు నరేంద్ర పొట్టపైనుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. తల్లిదండ్రులు కోట రంగారావు, లక్ష్మిలు ఘటనాస్థలానికి చేరేలోపే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. దీంతో కోపోద్రిక్తులైన మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు స్థానిక ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నాలుగు గంటలు పైగా రాస్తారోకో చేశారు. ఇసుక మాఫియా ఆగడాలకు అదుపులేకుండా పోయిందని, వందలాది లారీల్లో ఇసుక పట్టపగలే ఇసుక తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. శవపంచనామా చేయకుండా, కనీసం తల్లిదండ్రులు వచ్చేదాకా కూడా ఆగకుండా మృతదేహాన్ని ఎందుకు తరలించారని ప్రశ్నించారు. లారీని ఒక బాలుడు డ్రైవింగ్ చేశాడని, అతడ్ని తప్పించే ప్రయత్నంలో ఎస్ఐ పాత్ర ఉందని వారు ఆరోపించారు. ఇసుక మాఫియా నుంచి నెలకు రూ.50 లక్షలకు పైగా అధికారులు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. బాధితులకు మద్దతుగా వచ్చిన కాంగ్రెస్ నాయకుడు షేక్ అజుంతుల్లా, ఎస్ఐ వెంకట్రావు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ముస్లిం యువకులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఎస్ఐ డౌన్‌డౌన్, ఇసుక మాఫియా నశించాలి, పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఆందోళన తీవ్రం కావడంతో క్రోసూరు ఎస్ఐ రాంబాబు తన సిబ్బందిని గ్రామంలో మోహరించారు. తహశీల్దారు ఎస్వీ రమణకుమారి బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు ప్రయత్నం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, రాస్తారాకో విరమించాలని కోరినా ససేమిరా అన్నారు. చివరకు సత్తెనపల్లి సీఐ శ్రీనివాసులురెడ్డి వచ్చి బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ని, లారీ ఓనర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఎస్ఐ వెంకట్రావును పురమాయించడంతో బాధితులు ఆందోళన విరమించారు.