లారీ ఢీకొని యువకుడి మృతి | Larry colliding young man died | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని యువకుడి మృతి

Nov 8 2013 1:53 AM | Updated on Aug 1 2018 2:31 PM

ఇసుక మాఫియా ఆగడాలకు అదుపులేకుండా పోయింది. కృష్ణా నది నుంచి ఇసుకను త్వరత్వరగా మండలం దాటించాలన్న ఆతృతతో వేగంగా వెళుతున్న

అచ్చంపేట, న్యూస్‌లైన్ :ఇసుక మాఫియా ఆగడాలకు అదుపులేకుండా పోయింది. కృష్ణా నది నుంచి ఇసుకను త్వరత్వరగా మండలం దాటించాలన్న ఆతృతతో వేగంగా వెళుతున్న లారీ బైక్‌పై వస్తున్న యువకుడిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన స్థానిక మాదిపాడు రోడ్డులోని తాళ్లచెరువు మలుపు వద్ద గురువారం చోటుచేసుకుంది. అచ్చంపేటకు చెందిన కోట నరేంద్ర (21)గ్రామాల్లో బాకీల వసూళ్లకు బైక్‌పై వెళుతుండగా ఇసుక లారీ ఢీకొట్టింది. ముందు టైరు నరేంద్ర పొట్టపైనుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. తల్లిదండ్రులు కోట రంగారావు, లక్ష్మిలు ఘటనాస్థలానికి చేరేలోపే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. 
 
 దీంతో కోపోద్రిక్తులైన మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు స్థానిక ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నాలుగు గంటలు పైగా రాస్తారోకో చేశారు. ఇసుక మాఫియా ఆగడాలకు అదుపులేకుండా పోయిందని, వందలాది లారీల్లో ఇసుక పట్టపగలే ఇసుక తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. శవపంచనామా చేయకుండా, కనీసం తల్లిదండ్రులు వచ్చేదాకా కూడా ఆగకుండా మృతదేహాన్ని ఎందుకు తరలించారని ప్రశ్నించారు. లారీని ఒక బాలుడు డ్రైవింగ్ చేశాడని, అతడ్ని తప్పించే ప్రయత్నంలో ఎస్‌ఐ పాత్ర ఉందని వారు ఆరోపించారు. ఇసుక మాఫియా నుంచి నెలకు రూ.50 లక్షలకు పైగా అధికారులు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు.
 
 బాధితులకు మద్దతుగా వచ్చిన కాంగ్రెస్ నాయకుడు షేక్ అజుంతుల్లా, ఎస్‌ఐ వెంకట్రావు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ముస్లిం యువకులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఎస్‌ఐ డౌన్‌డౌన్, ఇసుక మాఫియా నశించాలి, పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఆందోళన తీవ్రం కావడంతో క్రోసూరు ఎస్‌ఐ రాంబాబు తన సిబ్బందిని గ్రామంలో మోహరించారు. తహశీల్దారు ఎస్వీ రమణకుమారి బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు ప్రయత్నం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, రాస్తారాకో విరమించాలని కోరినా ససేమిరా అన్నారు. చివరకు సత్తెనపల్లి సీఐ శ్రీనివాసులురెడ్డి వచ్చి బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌ని, లారీ ఓనర్‌ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఎస్‌ఐ వెంకట్రావును పురమాయించడంతో బాధితులు ఆందోళన విరమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement