breaking news
Abroad trips
-
సెట్ ఇన్ ఇండియా
హీరో – హీరోయిన్ కళ్లల్లో కళ్లు పెట్టుకొని ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు. కట్ చేస్తే.. ఈఫిల్ టవర్ ముందుంటారు ఇద్దరూ. ఫారిన్ వీధుల్లో ప్రేమ పాట పాడుకుంటారు. విదేశాల్లో ఉంటూ స్వదేశ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుంటాడు విలన్. అతడ్ని పట్టుకోవడానికి ఫారిన్ బయలుదేరతాడు మన పోలీస్ హీరో. ఇలా పాటకో, ఫైటుకో, కొన్నిసార్లు కథానుసారం, కొన్ని సార్లు హంగామానుసారం విదేశాలలో షూటింగ్ చేస్తారు. కథా వస్తువులాగో, బ్యాక్ డ్రాప్ లాగానో, లేదంటే హంగామా కోసమో ‘విదేశాలు – విదేశీ లొకేషన్లు’’ మన సినిమాకి ఎప్పుడూ ఉపయోగపడుతున్నాయి. అయితే కరోనా వల్ల ఇక ఈ అనుబంధం కొనసాగుతుందా? సందేహమే! ఇండస్ట్రీకి కుడా ఈ పరిస్థితి ఇంకా అర్థం అవ్వడం లేదు. ప్రతిసారీ విదేశాలు వెళ్లకపోయినా ఆ మూడ్ ని మన స్టూడియోలలో సెట్ వేసి, ప్రతిబింబించేలా చేసిన సందర్భాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో న్యూయార్క్ వీధిని హైదరాబాద్ నానక్ రామ్ గూడకి తీసుకొచ్చాం. లండన్ నగరాన్ని మన హైదరాబాద్ స్టూడియోలలో నిర్మించుకున్నాం. నెక్ట్స్ అదే పద్ధతిని అందరూ పాటించాలా? కరోనా ఎక్కడి వాళ్లను అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి అనేసింది. దాంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సినిమా షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయి? ఒకవేళ మొదలయితే మునుపటి లాగా చేసుకునే వీలుందా? లేదా? ఈ సమయంలో ‘విదేశాల్లో షూటింగ్’’ ప్రస్తుతం ఇండస్ట్రీ ముందు ఉన్న అతి పెద్ద సవాల్. విదేశాల్లో షూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్న సినిమాలు, ఆల్రెడీ సగం షూటింగ్ అయి మిగతా సగాన్ని పూర్తి చేయడానికి ఎదురు చూస్తున్న సినిమాల పరిస్థితి డైలమాలో పడింది. ఈ సినిమాల నెక్ట్స్‌స్టెప్ ఏంటి? ప్రత్యామ్నాయం ఏంటి? కొందరిని అడిగాం. ఈ విధంగా చెప్పారు. ఆ వివరాలు. ప్రభాస్ 20 రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ పీరియాడిక్ సినిమా చేస్తున్నారు. ఇటలీ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రకథ నడుస్తుంది. కరోనా విస్తృతంగా మొదలవుతున్న సమయంలోనూ జార్జియాలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు టీమ్. మళ్లీ షూటింగ్ ఎప్పుడు? నెక్ట్స్ ఏంటి? అని ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌ని అడిగితే ఈ విధంగా స్పందించారు. ‘‘కరోనా వల్ల చిన్న సినిమా.. పెద్ద సినిమా అని కాదు.. సినిమాలన్నీ ఇబ్బందుల్లో పడ్డాయి. సినిమాలు కచ్చితంగా వాయిదా పడుతుంటాయి. ప్రభాస్, సాయిధరమ్ తేజ్ మా సినిమా కథానుసారం ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లో జరిపాలి. కొన్ని రోజుల్లో లేదా నెలల్లో షూటింగ్‌లు ప్రారంభం అవుతాయి. ఆం్ర«ధ, తెలంగాణలో షూటింగ్స్ చేసుకోవచ్చు. కొంచెం ప్రయత్నించి ఇండియాలో తిరగొచ్చు. విదేశాలలో షూటింగ్ అనేది ఎలా వీలవుతుందా అని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి విదేశాల్లో చిత్రీకరించే ఇన్ డోర్ సన్నివేశాలన్నీ ఇక్కడే సెట్ వేసి షూట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక ఆరు నెలలు వేచి చూస్తాం. ఈలోగా ఇక్కడ షూటింగ్ పార్ట్, ఇన్ డోర్ మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ ఆరు నెలల్లో పరిస్థితిని బట్టి మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అయితే అందరూ ఇది చాలా పెద్ద ఇబ్బంది అనుకుంటున్నారు. కానీ నేను దీంట్లో ఓ భారీ ఛాలెంజ్‌ని చూస్తున్నాను. ఈ ఛాలెంజ్‌ని దాటగలిగితే ఫ్యూచర్ సినిమాలకు మార్గదర్శకంగా నిలుస్తాం. ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం. విదేశాల్లో తీయాల్సిన పాటల్ని, సన్నివేశాల్ని అదే క్వాలిటీతో ఇక్కడ సెట్స్ ద్వారా సాధించగలిగితే ఫారిన్ వెళ్లే పనిని చాలా శాతం తగ్గించుకోవచ్చు. సినిమా అంటేనే ఛాలెంజ్‌ని ఎదుర్కొని అవుట్ పుట్ సంపాదించడం కదా?’’ అన్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్నాయి. పుష్ప అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో పలు కీలక సన్నివేశాలను మన రాష్ట్రాల్లోనే పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ విషయం గురించి ‘పుష్ప’ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం కరోనా వల్ల కావాలనుకున్న చోట షూటింగ్ చేయాలనుకోవడం కచ్చితంగా కుదరదు. మా సినిమాకు ఇంకా సెట్ వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు. కానీ అడవి ప్రాంతాల్లో షూటింగ్ ఎక్కువ శాతం ఉంది. చిత్తూరు, వికారాబాద్ అడవుల్లో షూట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అన్నీ కుదిరితే కేరళలో కొంత భాగం షూట్ చేస్తాం. మా బ్యానర్ లో మిగతా సినిమాల్లో ఏదైనా ఫారిన్ లో ఉంటే తర్వాత ఆలోచిస్తాం. సినిమా అంటేనే క్రియేషన్. క్రియేటివ్ వర్క్‌ని ఇక్కడే చేయాలి.. అక్కడే చేయాలని నిబంధనలు పెట్టుకోలేం. సో.. అన్ని సినిమాలూ ఇండియాలోనే చేస్తామా? అంటే ఇప్పుడే ఏం చెప్పలేం’’ అని పేర్కొన్నారు. లవ్ స్టోరీ నాగ చైతన్య – శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. సాయి పల్లవి హీరోయిన్. 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ఈ సినిమాలో ఓ పాటను దుబాయ్‌లో చిత్రీకరించారు. ఇంకో పాటను కూడా మరో ఫారిన్ కంట్రీలో తీయాలన్నది ప్లాన్. కానీ ఆ ప్లాన్ మారిపోయింది. ఇండియాలోనే ఈ పాటను షూట్ చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ‘లవ్ స్టోరీ’లో నాగచైతన్య, సాయిపల్లవి ఫైటర్ పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం కలసిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్యాన్ ఇండియా సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ముంబై – ఫారిన్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలిసింది. బ్యాక్ డ్రాప్లో కొంత ఫారిన్ కాబట్టి అక్కడ షూటింగ్ తప్పనిసరి అట. అంతా చక్కబడే వరకు ఓ నిర్ణయానికి రాలేమని చిత్రబృందం నుంచి సమాచారం. ‘ఫైటర్’లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే మోసగాళ్ళు ఇంగ్లిష్ – తెలుగు భాషల్లో మంచు విష్ణు ఓ భారీ క్రాస్ ఓవర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మోసగాళ్ళు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఓ ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలోని కీలక భాగాన్ని అమెరికాలో షూట్ చేశారు. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మిగతా భాగాన్ని అమెరికాలోనే తీయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో నటించడంతోపాటు నిర్మిస్తున్నారు విష్ణు. ‘మోసగాళ్ళు’లో విష్ణు మరికొన్ని... రవితేజ ‘క్రాక్’ సినిమా పాటల మినహా షూటింగ్ పూర్తి అయింది. ఈ పాటల్ని ఫారిన్ లో చిత్రీకరించాలని అనుకున్నారు. ఇప్పుడు ఊటీ లేదా మున్నార్ వంటి ప్రదేశాల్లో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్రం బ్యాంకాక్ షెడ్యుల్ పూర్తి చేయాల్సి ఉంది. అది కూడా డైలమాలో ఉంది. సాయి ధరమ్ తేజ్ ‘సోలో బతుకే సో బెటర్’ చిత్రంలో ఉన్న ఫారిన్ షెడ్యూల్స్ ని ఇండియాలోనే చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. ‘క్రాక్’లో రవితేజ, శ్రుతీహాసన్.. సో కరోనా వల్ల కథల్లో మార్పు రాబోతోందా? కథ జరిగే ప్రదేశాల్లో మార్పు ఉండబోతోందా? కథలన్నీ మన దగ్గరే సెట్ చేస్తారా? లేదంటే కావాల్సిన ప్రదేశాల సెట్ వేస్తారా? రాబోయే రోజుల్లో సినిమా కథలన్నీ ‘సెట్ ఇన్ ఇండియా’యేనా? కావాల్సిన లొకేషన్స్ ని సెట్లుగా మార్చుకోవడమేనా? చూస్తుంటే అదే అయ్యేలా ఉంది. అదే జరిగితే క్రియేటివ్ గా కొంచెం రాజీ పడాలేమో? ఈ సరికొత్త ఛాలెంజ్ ను ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది? ప్రతిదానికీ ప్లాన్ ఎ వర్కవుట్ కాకపోతే ప్లాన్ బి ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ ప్లాన్ బి ఆలోచిస్తోందా? రానున్న రోజులు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాయి. – గౌతమ్ మల్లాది ∙ ∙ -
స్టాప్ వేర్.. అంతా హార్డ్‌వర్కే..
కత్తిలాంటి ఉద్యోగం.. ఖతర్నాక్ జీతం.. వాళ్ల గురించి వినిపించే టాక్ ఇదే. హైక్‌లు.. అబ్రాడ్ ట్రిప్‌లు.. వీకెండ్ ఈవెంట్లు.. ఇవన్నీ వారి జీవితానికి ఓ వైపు మాత్రమే. రెండోవైపు చూస్తే.. కరెన్సీ కట్టల వెనుక కష్టం తెలుస్తుంది. జాలీ లైఫ్ మాటున జాలి లేని జీవితం దిగాలు పడుతుంటుంది. అకౌంట్లోకి ఐదంకెలు వచ్చి పడినా.. నెలాఖరుకు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్‌గా కన్పిస్తుంది. కాస్ట్లీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియని టెన్స్ ట్రాన్స్‌లో బతికేస్తున్నారు. క్రెడిట్ కార్డులు గోలపెడుతున్నా, లోన్ ఈఎంఐలు వెంటపడుతున్నా.. గుట్టు రట్టు కాకుండా నెట్టుకువస్తున్నారు. కాలంతో పరుగులు తీస్తున్న టెకీలను సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా మారిన హీరో నిఖిల్ పలకరించాడు. - రిపోర్టర్ నిఖిల్ నిఖిల్: లాస్ట్ టూ, త్రీ ఇయర్స్‌లో ముగ్గురో.. నలుగురో అమ్మాయిలు ఐటీ కంపెనీల్లో సూసైడ్ చేసుకున్నారు. కార్తీకేయ: ఆత్మహత్యలకు జాబ్ టెన్షన్ ఒక్కటే కారణం కాదు. ప్రొఫెషనల్ ప్రెషర్‌తో పాటు.. పర్సనల్ సమస్యలు ఉంటాయి కదా ! దాంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయి అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. నిఖిల్: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పగానే ఎక్కడికో వెళ్లిపోతాం.. సినిమాలో మేం స్టార్లయితే.. ఉద్యోగాల్లో మీరు సూపర్ స్టార్లు.. ఏమంటారు..? సురేంద్రరెడ్డి: అంత సీన్ లేదండి. సెంట్రల్ ఏసీ.. కంప్యూటర్ కీబోర్డు నొక్కితే.. లక్షల్లో జీతాలు వచ్చి పడుతున్నాయని చాలా మంది అనుకుంటారు. జాబ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగే రియల్ స్టార్. లోకేష్: లక్షల్లో జీతాలున్నా.. మా టెకీలు (సాఫ్ట్వేర్ ఇంజనీర్స్) గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు. గ్రూప్స్ ఉద్యోగాల వేటలో ఇంజనీర్లు చాలామందే ఉన్నారు. కార్తీకేయ: ఇబ్బందుల్లేని ఉద్యోగాలు ఉండవనుకోండి. బట్ టెకీ ఈజ్ డిఫరెంట్. నిఖిల్: సాఫ్ట్వేర్ అంటే ప్రెషర్ ఎక్కువని అంటారు. మీ పరిస్థితి ఏంటి? లోకేష్: 24 బై 7 సపోర్ట్‌లో ఉంటే మాత్రం ప్రెషర్ తప్పదు. వారంలో ఏడు రోజులు.. రోజులో 24 గంటలూ కంపెనీకి అందుబాటులో ఉండాలి. సినిమా హాల్లో ఉన్నా కాల్ వచ్చిందంటే ల్యాప్‌టాప్ తెరిచి లాగిన్ కావాల్సిందే. సురేష్: ఎక్కడికెళ్లినా ల్యాప్‌టాప్ చేతిలో ఉండాల్సిందే. పెళ్లిలో ఉన్నా.. పబ్‌లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే ఫీలవ్వాలి. నిఖిల్: మరి ఎందుకు 24 బై 7 సపోర్ట్‌లో చేరడం? లోకేష్: డబ్బుల కోసం, జీతం 30 శాతం ఎక్కువగా ఉంటుంది. నిఖిల్: సాఫ్ట్వేర్ ఉద్యోగమంటే.. మొదట్లో జీతాలు ఎలా ఉంటాయి ? సురేష్: ఏడాదికి 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్ అయితే కాస్త బెటర్. చాలామంది మొదట్లోనే లక్షలు వచ్చేస్తాయని అనుకుంటారు. కానీ అంతలేదు. కార్తీకేయ: ఈ ఫీల్డ్‌లో టాలెంటును బట్టి ప్రమోషన్ ్స, హైక్‌లూ ఉంటాయి. నిఖిల్: నా రాబోయే సినిమా పేరు కార్తీకేయ. మీరు చెప్పండి టెకీల లైఫ్ స్టయిల్ గురించి. కార్తీకేయ: వారంలో రెండు వీక్లీ ఆఫ్‌లు. ఒక రోజు కంటి నిండా నిద్రపోతాం. రెండో రోజు సినిమాలకని, షికార్లకని తిరుగుతాం. నిఖిల్: సో...ఫుల్ ఎంజాయ్ అంటావ్. లోకేష్: బ్యాచిలర్స్ పని బాగుంటుంది సార్. మా పరిస్థితే తేడా.. సురేంద్రరెడ్డి: కొత్తగా పెళ్లయింది. లోకేష్: ఇంటికెళ్లి భోజనానికని కూర్చుంటామా.. ఫోన్ రింగవుతుంది. రిసీవ్ చేసుకున్నామా..? రుసరుసలు. నిఖిల్: నిజంగా ఇబ్బందే. సురేష్: సార్.. ఒక్కో ప్రొఫెషన్లో ఒక్కో రకం ఇబ్బంది ఉంటుంది. సురేంద్రరెడ్డి: ఇందులో జీతం తప్ప.. మిగితావన్నీ ఇబ్బందులే. పదిహేను రోజులు డే టైమ్‌లో.. పదిహేను రోజులు నైట్ వర్క్ చేయాలి. కొత్త కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయి. రవీంద్రనాథ్ రెడ్డి: నిజమే.. రాత్రిళ్లు పనిచేయడం అలవాటయ్యేలోపు డే షిఫ్ట్ వేస్తారు. వర్క్ ప్రెషర్‌తో చాలామంది హెడెక్, డిప్రెషన్, వెయిట్ ప్రాబ్లమ్స్ వంటి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. నిఖిల్: అమ్మాయిలకు నైట్ షిఫ్ట్ జాబ్‌లు కరెక్ట్ అంటారా ? జ్యోత్స్న: విదేశీ కంపెనీలే చాలా వరకు ఉండటంతో రాత్రుళ్లు కూడా జాబ్ చేయాల్సి వస్తోంది. నిఖిల్: రాత్రి పూట క్యాబ్స్‌లో వెళ్తారు కదా.. ఏమైనా ఇబ్బందులుంటాయా ? జ్యోత్స్న: కంప్లయింట్స్ తక్కువే కానీ.. ఉండే ఇబ్బందులు ఉంటాయి. సెక్యూరిటీ విషయంలో డౌట్ లేకున్నా రిస్కే. నిఖిల్: మీరు చాలా సెన్సిటివ్ అంటారు... సురేంద్రరెడ్డి: ఉద్యోగం, ఇల్లు, షాపింగ్ ఇవే మా ప్రపంచం. మిగతా ప్రపంచంతో అనుబంధం దూరమైంది. అందుకే ఏ చిన్న సమస్య వచ్చినా.. దాన్ని ఎదుర్కొనే శక్తి చాలామందిలో ఉండదు. నిఖిల్: జాబ్ సెక్యూరిటీ మాటేమిటి. దానికి మీ దగ్గర ఎలాంటి పరిష్కారం ఉంది ? సురేష్: ఏ కంపెనీ ఎప్పుడు మూతపడుతుందో తెలియదు. ఎప్పుడు లాభాలు వస్తాయో, ఎప్పుడు నష్టాలు వస్తాయో అస్సలు తెలియదు. నిఖిల్: మా ఫ్రెండ్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. వాడు జాబ్ చేసే కంపెనీలో లాభాల్లేవని.. కొందరిని తీసేశారు. వారిలో వీడూ ఉన్నాడు. డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. లోకేష్: జాబ్ ఉన్నంత వరకు హ్యాపీ. ఈ లోగా.. మేం ఎక్కడ దుబారా చేస్తామో అని ఇంట్లో వాళ్లు.. ఇళ్లు, కారు అంటూ కొనిపిచ్చేస్తారు. ప్రతినెలా ఈఎంఐలు పీకకు చుట్టుకుంటాయి. నిఖిల్: సరే.. ఇవన్నీ పక్కన పెడితే, సినిమాలు చూస్తుంటారు కదా. సురేష్: సినిమాలు, సోషల్ నెట్వర్కింగ్ లేకపోతే ఎలా..? నిజం చెప్పాలంటే మాకు కాస్తో కూస్తో రిలీఫ్ ఇస్తున్నవి సినిమాలే . టాక్ బాగుందంటే వీకెండ్లో సినిమా పక్కా. మా వాళ్లు రివ్యూలు బాగా రాస్తారు. నిఖిల్: యూఎస్‌లో ఉన్నవాళ్లు రాసే రివ్యూలు చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంత బాగా రాస్తారు. సో.. మొత్తానికి ఎన్ని టెన్షన్లున్నా.. ఎన్ని టార్గెట్లున్నా.. సినిమాలు తప్పకుండా చూస్తారు కాబట్టి ఐయామ్ హ్యాపీ (నవ్వుతూ) బై.. నైస్ టు మీట్ యూ! - ప్రెజెంటేషన్: భువనేశ్వరి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్