సమాన అవకాశాలు ఇవ్వాలి

muncipal chair person premalatha reddy special interview - Sakshi

పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్లు కల్పించాలి

స్త్రీలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి

చట్టాలను కఠినతరం చేస్తేనే మహిళలకు న్యాయం

జనగామ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతారెడ్డి

జనగామ: ‘‘ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పురుషులతోపాటు మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి.. పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్లు,  సమాజంలో తగిన గౌరవం కల్పించాలి.. అప్పుడే మహిళా సాధికారత ఏర్పడుతోంది..’’ అని అంటున్నారు జనగామ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి. ‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అనేది నినాదానికే పరిమితం కాకుండా మహిళలకు అన్ని చోట్ల తగిన ప్రాతినిథ్యం కల్పిస్తేనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.   ఆ వివరాలు ఆమె మాటల్లోనే..  

మహిళల సత్తా చాటాం..
ప్రభుత్వాలు మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. గత టీడీపీ హయాంలో అసెంబ్లీలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తీర్మానం చేసినా, పార్లమెంట్‌కు వెళ్లే సరికి అది ఆమోదానికి నోచు కోలేదు. రాజకీయంగా రిజర్వేషన్లు లేకపోవడంతో మహిళలు జనరల్‌ స్థానాల్లో పోటీచేయాల్సి వస్తుంది. జనగామ మునిసిపల్‌లో 14 మంది మహిళలకు రిజర్వేషన్లు అనుకూలిస్తే, ఇతర స్థానాల్లో కలుపుకుని మొత్తం 16 మంది గెలిచి మహిళల సత్తా చాటు కున్నాం. రిజర్వేషన్లు ఉంటే పురుషులతో సమానంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. మాకు మేమే ముందుకు వెళ్తున్నాం తప్ప.. చట్టాలు అనుకూలంగా కనిపించడం లేదు.

స్త్రీలను ప్రోత్సహించాలి..
మహిళలు వంటింటికే పరిమితం అనే పదాన్ని పక్కన బెట్టి.. వారిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయంగా సమాన హక్కులు కల్పించాలి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ తదితర వాటిలో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. మార్కెట్‌ కమిటీలో రిజర్వేషన్లు తీసుకురావడంతో మహిళలకు అక్కడ సముచిత స్థానం లభించింది. అన్నింట్లో పనిచేయగలిగే సత్తా మహి ళలకు ఉంది. 80 శాతం మంది విద్యావంతులుగా మారినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామంది వెనకబడి ఉన్నారు. నేల నుంచి ఆకాశం వరకు దేశం సాధిస్తున్న ప్రగతిలో మహిళల పాత్ర ముఖ్యభూమిక పోషిస్తుంది. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలనే తపన మహిళల్లో రావాలి. రిజర్వేషన్లు అమలైతే నారీ లోకానికి తిరుగు ఉండదు.

స్వేచ్ఛ రావాలి..
ప్రస్తుత రాజకీయాల్లో మహిళలు రాణిస్తున్నా.. పూర్తిస్థాయి స్వేచ్ఛ లేకుండా పోయింది. మహిళలకు ప్రత్యేక హోదా.. గౌరవం రావాలి. ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న క్రమంలో స్వతహాగా నిర్ణయం తీసుకునే శక్తిగా ఎదగాలి. రాజకీయ రంగంతో పాటు ఉద్యోగ అవకాశాల్లో పురుషులతో సమాన అవకాశాలు రావాలి. పురుషుల చాటు మహిళలు కాకుండా, వారే నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలి. మహిళలకు అనేక చట్టాలు ఉన్నా, దాడులు, అత్యాచారాలు జరిగిన సమయంలో దుండగులు అందులో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని తప్పించుకుంటున్నారు.

ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి..
మహిళలు ఆర్థికంగా బలపడే విధంగా ఏటా బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసినప్పుడే వంటింటి చాటున ఉన్న వారు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమున్న మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఉద్యోగం చేస్తున్న మహిళల్లో మరింత ఆత్మ స్థ్యైర్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్య క్రమాలను నిర్వహించాలి. భ్రూణహత్యలు, వరకట్న వేధింపులు లేకుండా ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలి.

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top