ఈ పంటలకు సమయం మించలేదు

ఈ పంటలకు సమయం మించలేదు


పాడి-పంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడిప్పుడే వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. అయితే రైతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వేసుకునేందుకు కూడా అనువైన పంటలు ఉన్నాయి. వర్షాలు తక్కువగా పడినప్పుడు లేదా సకాలంలో పడనప్పుడు అవి పడే సమయాన్ని, నేల స్వభావాన్ని బట్టి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకొని సాగు చేయవచ్చునని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ కో-ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ) డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత (వీరిని తెలంగాణ రైతులు 1800-425-1110, ఆంధ్రప్రదేశ్ రైతులు 1800-425-4440 మొబైల్ ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు) సూచిస్తున్నారు. ఆ వివరాలు...

 

 ఆంధ్రప్రదేశ్‌లో...

 ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా వ్యవసాయ వాతావరణ మండలంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులు, విశాఖపట్నం జిల్లాలోని మైదాన ప్రాంతాల రైతులు ఆగస్టులో తేలిక నేలల్లో రాగి, ఉలవ, జొన్న, కంది వేసుకోవచ్చు. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో రాగి, మినుము, జొన్న, ఉలవ, గోరుచిక్కుడు, కంది, మొక్కజొన్న (స్వల్పకాలిక రకాలు), మొక్కజొన్న+కంది వేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబరులో తేలిక నేలల్లో పెసర, ఉలవ, పొద్దుతిరుగుడు విత్తుకోవచ్చు.

 

 గోదావరి మండలంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు ఆగస్టులో తేలిక నేలల్లో రాగి, ఉలవ, జొన్న, పిల్లిపెసర, అలసంద వేసుకోవాలి. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో రాగి, ఉలవ, మిరప, జొన్న, పొద్దుతిరుగుడు విత్తుకోవచ్చు. సెప్టెంబరులో తేలిక నేలల్లో మినుము వేసుకోవాలి.

 కృష్ణా మండలంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు తేలిక నేలల్లో ఆగస్టులో ఉలవ, జొన్న వేసుకోవాలి. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో కంది, అలసంద, పత్తి+కంది వేసుకోవచ్చు. తేలిక నేలల్లో సెప్టెంబరులో మినుము వేసుకునే అవకాశం ఉంది.

 

 దక్షిణ మండలంలోని చిత్తూరు, నెల్లూరు, వైఎస్‌ఆర్ జిల్లాల రైతులు తేలిక నేలల్లో ఆగస్టులో రాగి, కంది, పెసర, ఆముదం, జొన్న వేసుకోవచ్చు. మధ్యస్థ నుంచి బరువైన నేలల్లో ఉలవ, అలసంద, వేరుశనగ, పొద్దుతిరుగుడు విత్తుకోవాలి. సెప్టెంబరులో తేలిక నేలల్లో మినుము, పెసర, ఉలవ, జొన్న వేసుకునే అవకాశం ఉంది.

 అత్యల్ప వర్షపాత మండలంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులు తేలిక నేలల్లో ఆగస్టులో కొర్ర, ఉల్లి, జొన్న, వేరుశనగ, సజ్జ, ఉలవ పంటలు వేసుకోవచ్చు. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో ఆముదం, వేరుశనగ+కంది, పొద్దుతిరుగుడు, పొగాకు వేసుకోవాలి. సెప్టెంబరులో తేలిక నేలల్లో జొన్న, పెసర, సజ్జ, ఉలవ విత్తుకోవచ్చు. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో పొద్దుతిరుగుడు, పొగాకు వేసుకునే అవకాశం ఉంది.

 

 తెలంగాణలో...

 ఉత్తర, మధ్య తెలంగాణ మండలాలకు చెందిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల రైతులు తేలిక నేలల్లో ఆగస్టులో ఉలవ, పొద్దుతిరుగుడు, ఆముదం వేసుకోవాలి. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో పొద్దుతిరుగుడు, కంది వేసుకోవచ్చు. సెప్టెంబరులో తేలిక నేలల్లో ఉలవ వేసుకోవాలి.

 

 దక్షిణ తెలంగాణ మండలంలోని మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులు తేలిక నేలల్లో ఆగస్టులో ఉలవ, జొన్న, సజ్జ, రాగి, ఆముదం విత్తుకోవాలి. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో పొద్దుతిరుగుడు, ఆముదం, కంది వేసుకోవచ్చు. సెప్టెంబరులో తేలిక నేలల్లో ఉలవ, పెసర విత్తుకోవచ్చు.

 రెండు రాష్ట్రాల రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే జొన్నను చొప్ప కోసం మాత్రమే విత్తుకోవాలి. కంది విత్తనాలను దగ్గర దగ్గరగా వేయాలి.

 

 ఇప్పుడు ఏం చేయాలి?

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం రైతులు చేపట్టాల్సిన పనులపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు అందిస్తున్న సూచనలు...

 రెండు రాష్ట్రాలలోనూ... వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల (200 చదరపు మీటర్లు) నారుమడిలో కిలో చొప్పున కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు వేసుకోవాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు విత్తనాలు వేసిన 20 రోజులకు మోనోక్రొటోఫాస్+నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి ఆ మందు ద్రావణాన్ని మెత్తని బ్రష్‌తో లేత కాండం మీద పూయాలి.

 

 ఇక తెలంగాణలో... రైతులు ఇప్పటికే వర్షాధార పంటలు వేసుకున్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్న వానలను ఆసరాగా చేసుకొని మొదటి దఫా ఎరువులను పైపాటుగా వేసుకోవాలి. ఆముదం విత్తనాలు విత్తేటప్పుడు ఎకరానికి 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం అందించే ఎరువులు వేయాలి. విత్తనాలు వేసిన 48 గంటల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి పిచికారీ చేసుకుంటే కలుపు బెడద ఉండదు. మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పత్తి పంటను పిండినల్లి ఆశిస్తోంది. దీని నివారణకు పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలి. ఎందుకంటే ఈ పురుగులు ముందుగా కలుపు మొక్కలను ఆశ్రయిస్తాయి.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top