రాజన్‌ను త్వరలోనే లేపేస్తాం

రాజన్‌ను త్వరలోనే లేపేస్తాం


మాఫియా డాన్, దావూద్ ఇబ్రహీం కుడి భుజం లాంటి ఛోటా షకీల్ నోరు విప్పాడు. త్వరలోనే తాము ఛోటా రాజన్‌ను లేపేయడం ఖాయమని స్పష్టం చేశాడు. పాతికేళ్లుగా తమ డి కంపెనీకి ఛోటా రాజన్‌తో శత్రుత్వం ఎందుకు ఉందో కూడా తెలిపాడు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల నిందితుల్లో ఆరుగురిని ఛోటా రాజన్ గ్యాంగు చంపేసింది. 1998-2001 మధ్య ఈ హత్యలు జరిగాయి. దాన్ని తాము ఈరోజు వరకు జీర్ణించుకోలేకపోతున్నట్లు షకీల్ చెప్పాడు.



బాలిలో రాజన్ అరెస్టు అయినప్పటి నుంచి మళ్లీ రెండు దశాబ్దాల నాటి పాత పగలను గుర్తుకు తెచ్చుకున్నామన్నాడు. అప్పట్లో రాజన్ గ్యాంగు హతమార్చినవాళ్లలో యాకూబ్ యేడా సోదరుడు మజీద్ ఖాన్ ఒకడు. అతడు దావూద్ ఇబ్రహీంతో పాటు ఛోటా షకీల్కు కూడా బాగా సన్నిహితుడు.  ఈ హత్యలో రాజన్కు పోలీసులు కూడా సహకరించారని షకీల్ అంటున్నాడు. ఇప్పటికే డి కంపెనీ కోర్టులో రాజన్కు మరణశిక్ష విధించామని, ఈ హత్యల కారణంగా త్వరలోనే రాజన్ను చంపడం ఖాయమని స్పష్టం చేశాడు. త్వరలోనే అవకాశం రావాలని అల్లాను కోరుకుంటున్నట్లు చెప్పాడు.  



సీబీఐ వాళ్లు రాజన్ను ముంబై పోలీసులకు అప్పగించడానికి నిరాకరించడంపై కూడా ఛోటా షకీల్ వ్యాఖ్యానించాడు. ''రాజన్ ఏమైనా వాళ్లకు చుట్టమా.. అందుకే ముంబై పోలీసులకు అప్పగించలేదా? కేసులన్నీ ముంబైలోనే కదా ఉన్నవి.. ఆరుగురు నిర్దోషులను చంపేశాడు. ఆ కేసులు కూడా ముంబై పోలీసుల వద్దే ఉన్నాయి. ఈ హత్యల వల్లే అతడికి దేశభక్తుడన్న పేరు వచ్చేసింది'' అని ఛోటా షకీల్ అన్నాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top