చట్టంలోని లొసుగులను సాకుగా చూపుతూ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రమాదానికి గురైన బస్సు యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
‘బస్సు’ దగ్ధం కేసు నుంచి తప్పించుకొనేందుకు యత్నాలు
‘జబ్బార్’ ట్రావెల్స్‌ను ముందు పెట్టి వ్యవహారం నడిపిస్తున్న జేసీ బ్రదర్స్?
చట్టంలోని లొసుగులను వినియోగించుకునే ప్రయత్నం
బెంగళూరు-హైదరాబాద్ ప్రయాణం 8 గంటలేనట.. రెండో డ్రైవర్ అవసరం లేదట
ఇరుకు వంతెన కారణంగానే ప్రమాదం జరిగిందంటూ బుకాయింపు
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: చట్టంలోని లొసుగులను సాకుగా చూపుతూ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రమాదానికి గురైన బస్సు యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం చట్టంలోని నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ తప్పు తమదికాదని వాదిస్తోంది. అయితే ఈ కేసు తమ మీదికి వచ్చే అవకాశం ఉండడంతో.. జబ్బార్ ట్రావెల్స్‌ను ముందుపెట్టి ‘జేసీ’ బ్రదర్స్ తెరవెనుక వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు బుధవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా పాలెం శివార్లలో దగ్ధమై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్‌తో పాటు మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే, అసలు ఈ కేసులో తమ తప్పేమీ లేదనేందుకు నిబంధనల్లోని లొసుగులను వాడుకొనేందుకు బస్సు యాజమాన్యం ప్రయత్నిస్తోంది.
బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు ఎనిమిది గంటలు మాత్రమే పడుతుందని.. దాంతోపాటు ప్రమాదానికి గురైన బస్సుకు జాతీయ రహదారి పర్మిట్ లేనందున ఇద్దరు డ్రైవర్లు అవసరం లేదని, నిబంధనల ప్రకారం ఒక్కరే సరిపోతారని ట్రావెల్స్ యాజమాన్యం అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. దీనికితోడు పాలెం సమీపంలో కల్వర్టు జాతీయ రహదారిపైకి చొచ్చుకువచ్చిందునే ప్రమాదం జరిగిందని వారు వాదిస్తున్నట్లు సమాచారం. ఏడో నంబర్ జాతీయ రహదారి విస్తరణ సమయంలో పాత కల్వర్టును తొలగించి.. కొత్త కల్వర్టు నిర్మించకపోవడం వల్ల అక్కడ రహదారిపైకి కల్వర్టు నిర్మాణం కొంత చొచ్చుకువచ్చినట్లుందని.. అందువల్లే దుర్ఘటన జరిగిందని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా.. బస్సు ఢీ కొన్న కల్వర్టు నిర్మాణాన్ని ఢిల్లీకి చెందిన జాతీయ రహదారి శాఖ అధికారులు వచ్చి పరిశీలించారు.