తెలుగు వాళ్లకు తిరగడం ఇష్టం ఉండదట..! | Telugu people don't travel much, reveals study | Sakshi
Sakshi News home page

తెలుగు వాళ్లకు తిరగడం ఇష్టం ఉండదట..!

Jul 2 2016 2:00 PM | Updated on Sep 4 2017 3:59 AM

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(ఎన్ఎస్ఎస్ఓ) 2014-2015 ఏడాది కాలంపై చేసిన సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రజల తీరులో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.

హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు తమ ప్రాంతాన్ని దాటి పర్యాటకానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తెలిపింది. 2014-15 సంవత్సరానికిగాను చేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. సొంత రాష్ట్రాలను దాటి ట్రిప్, హాలీడేయింగ్‌లాంటి వాటికి వెళ్లడానికి తెలుగు ప్రజలు శ్రద్ధ చూపడం లేదని పేర్కొంది. ఏడాదికాలంలో కేవలం 8.1 శాతం మంది ప్రజలు మాత్రమే ఓవర్ నైట్ ట్రిప్స్, ఆటవిడుపు, హాలీడేయింగ్, షాపింగ్, మెడికల్ అవసరాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లారని సర్వే ఫలితాల్లో తెలిసింది.

వీటిలో కూడా సామాజిక, బిజినెస్, మెడికల్, మతాలకు సంబంధించినవే ఎక్కువని తేలింది. ఆట విడుపు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడాది కాలంలో అత్యధికంగా 1,30,600 ట్రిప్స్ జరిగితే, తెలంగాణ నుంచి 2,02,700 ట్రిప్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 30 రోజుల వ్యవధిలో మత సంబంధిత కార్యక్రమాల కోసం 1,44,200 ట్రిప్స్, సామాజిక అవసరాల పరంగా 14,08,400 ట్రిప్స్ జరిగాయి. తెలంగాణ నుంచి సామాజిక అవసరాలకు 6,54,000, మత సంబంధిత కార్యక్రమాలకు 53,100 ట్రిప్ లు జరిగినట్లు రికార్డుల లెక్కల్లో తేలింది.

దక్షిణ భారతదేశంలో ఆటవిడుపు కోసం ట్రిప్స్ కు వెళ్లినవారి సంఖ్యలో అతి తక్కువ తెలుగువారిదేనని సర్వే తేల్చింది. తెలుగురాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల నుంచి ట్రిప్స్ కు వెళ్తున్న వారు అక్కడ అతి తక్కువ ఖర్చు చేసిన వారు కూడా మనవాళ్లే. ఆంధ్రప్రదేశ్ నుంచి సగటున రూ.5,396లు ట్రిప్స్ కు వెళ్లిన వారు ఖర్చు చేశారని, అదే తెలంగాణ నుంచి అయితే రూ.9,777లు ఖర్చు చేశారని తెలిపింది. ఒంటరిగా ట్రిప్స్ వెళ్తున్న మహిళల్లో మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి 53శాతం మంది మహిళలు, తెలంగాణ నుంచి 60 శాతం మంది మహిళలు ఒంటరిగా ట్రిప్స్ కు వెళ్లారని సంస్థ వివరించింది. 30రోజుల పరిధిలో అత్యధికంగా యాత్రికులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలుగు రాష్ట్రాలు 8,68,100 మందితో రెండో స్థానంలో నిలిచాయి. కాగా, హర్యానా రాష్ట్రం నుంచి అత్యధికంగా 38 శాతం మంది ట్రిప్స్, హలీడేయింగ్ కు వెళ్లగా.. అత్యల్పంగా ఒడిశా నుంచి కేవలం 7.5 శాతం మంది మాత్రమే వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement