రైల్వే శాఖ అధీనంలో 46,333 హెక్టార్ల ఖాళీ స్థలం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
న్యూఢిల్లీ: రైల్వే శాఖ అధీనంలో 46,333 హెక్టార్ల ఖాళీ స్థలం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖకు మొత్తం 4,61,487 హెక్టార్ల భూమి ఉందని రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఇందులో 4,14,240 హెక్టార్లు తమశాఖ కార్యకలాపాలకు వినియోగిస్తున్నామని, మిగతా స్థలం ఖాళీగా ఉందని రాజ్యసభలో చెప్పారు.
ఖాళీగా ఉన్న స్థలం ఎక్కువ శాతం రైల్వే పట్టాల వెంట నిలువుగా ఉందని తెలిపారు. సర్వీసింగ్, ట్రాక్ నిర్వహణకు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ ఖాళీ స్థలం అవసరమవుతుందన్నారు. అవసరానికి అనుగుణంగా దీన్ని వినియోగిస్తామని చెప్పారు. రైల్వే భూముల రికార్డుల డిజిటలైజేషన్ దాదాపు పూర్తైందని మంత్రి తెలిపారు.